చెల్లింపులకు కొత్త యూపీఐ వ్యవస్థ: సెబీ
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:15 AM
క్యాపిటల్ మార్కెట్ చెల్లింపుల్లో జరిగే మోసాలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సిద్ధమవుతోంది. ముఖ్యం గా మదుపరులు మార్కెట్ ఇంటర్మీడియరీలకు...

న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ చెల్లింపుల్లో జరిగే మోసాలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సిద్ధమవుతోంది. ముఖ్యం గా మదుపరులు మార్కెట్ ఇంటర్మీడియరీలకు చేసే చెల్లింపులను మరింత సురక్షితం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఆయా సంస్థల ప్రత్యేక గుర్తింపుతో కూడిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. మార్కెట్ వర్గాలు ఈ నెల 21లోగా ఈ చర్చా పత్రంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని సెబీ కోరింది. ఈ విధానం అమల్లోకి వస్తే తాము నిజమైన క్యాపిటల్ మార్కెట్ మధ్యవర్తి సంస్థకు చెల్లిస్తున్నామా? లేక నకిలీ సంస్థకు చెల్లిస్తున్నామా? అనే విషయాన్ని మదుపరులు ఎవరికి వారు స్వయంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. కొత్త విధానంలో యూపీఐ రోజువారీ చెల్లింపుల పరిమితి ప్రస్తుత రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరుగుతుంది. ఎన్‌పీసీఐతో చర్చించి ఎప్పటికప్పుడు ఈ పరిమితిని అవసరాన్ని బట్టి పెంచుతారు.