Midwest IPO: 15 నుంచి మిడ్‌వెస్ట్ ఐపీఓ
ABN , Publish Date - Oct 11 , 2025 | 04:35 AM
తెలంగాణకు చెందిన గ్రానైట్ కంపెనీ మిడ్‌వెస్ట్ లిమిటెడ్ రూ.451 కోట్ల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న...
ఇష్యూ ధరల శ్రేణి రూ.1,014-1,065
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణకు చెందిన గ్రానైట్ కంపెనీ మిడ్‌వెస్ట్ లిమిటెడ్ రూ.451 కోట్ల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.1,014-1,065గా నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతో పాటు రూ.201 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనుంది. ఈ నెల 24న కంపెనీ తన షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసే అవకాశం ఉంది. తాజా ఈక్విటీ జారీ ద్వారా లభించనున్న నిధుల్లో రూ.130.3 కోట్లను తన అనుబంధ విభాగమైన మిడ్‌వెస్ట్ నియోస్టోన్ క్వార్ట్జ్ రెండో దశ విస్తరణ కోసం ఉపయోగించుకోనున్నట్లు మిడ్‌వెస్ట్ తెలిపింది. మరో రూ.25.7 కోట్లను ఎలక్ట్రిక్ డంప్ ట్రక్కుల కోసం, రూ.3.2 కోట్లను కొన్ని గనుల్లో సోలార్ ఇంధన అనుసంధానం కోసం వినియోగించుకోనుంది. కాగా, రూ.56.2 కోట్లను రుణాల తిరిగి చెల్లింపు కోసం, మిగతా సొమ్మును వ్యాపార అవసరాల కోసం ఉపయోగించుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. మిడ్‌వెస్ట్ తెలంగాణ, ఏపీలో 16 గ్రానైట్ గనులను నిర్వహిస్తోంది. అత్యంత ఖరీదైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్‌ను ఉత్పత్తి చేస్తోందీ సంస్థ.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..