‘మెటల్ కింగ్’ అనిల్ అగర్వాల్
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:06 AM
అనిల్ అగర్వాల్. భారత పారిశ్రామిక సామ్రాజ్యంలో ఈ పేరు తెలియని వారుండరు. పాట్నాకు చెందిన ఈ పారిశ్రామిక దిగ్గజం అంతర్జాతీయంగా ‘మెటల్ కింగ్’గా పేరు ప్రతిష్ఠలు గడించారు. జీవితంలో అనేక ఆటుపోట్లు...
పట్టుదలతో శిఖరాగ్రానికి
అనిల్ అగర్వాల్. భారత పారిశ్రామిక సామ్రాజ్యంలో ఈ పేరు తెలియని వారుండరు. పాట్నాకు చెందిన ఈ పారిశ్రామిక దిగ్గజం అంతర్జాతీయంగా ‘మెటల్ కింగ్’గా పేరు ప్రతిష్ఠలు గడించారు. జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా తట్టుకుంటూ ప్రస్తుతం 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.34,800 కోట్లు) నికర ఆస్తులతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగి, ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలిచారు. ఆయనే వేదాంత రిసోర్సెస్ అధినేత అనిల్ అగర్వాల్.
కుటుంబ నేపథ్యం : అనిల్ అగర్వాల్ 1954 జనవరి 24న బిహార్ రాజధాని పాట్నాలో ఒక మార్వాడి కుటుంబంలో జన్మించారు. తండ్రి ద్వారకా ప్రసాద్ అగర్వాల్‌కు ఒక చిన్న అల్యూమినియం కండక్టర్ల తయారీ వ్యాపారం ఉండేది. పాట్నాలోని మిల్లర్ హైస్కూల్‌లో అనిల్ హైస్కూలు విద్య పూర్తి చేశారు. ఆ పై చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దాంతో తండ్రి బిజినె్‌సలో చేరాలని ఉన్నా అప్పటికే ఆ వ్యాపారం గాలిలో దీపంలా మారింది.
ముంబై పయనం: ఇక ఏదైతే అదవుతుందని ప్రయాణ ఖర్చులకు సరిపడా డబ్బులతో అనిల్ ముంబై రైలెక్కారు. పొట్టకూటి కోసం అక్కడ అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. చివరికి ఒక స్ర్కాప్ (లోహాల తుక్కు) డీలర్ వద్ద పని చేస్తూ, ఆ వ్యాపారాన్ని ఔపోసన పట్టి, 1976లో తానే స్ర్కాప్ బిజినెస్ ప్రారంభించారు. ముంబైతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కేబుల్ కంపెనీల నుంచి స్ర్కాప్ కొని, దాన్ని కరిగించి మెటల్‌గా మార్చి ముంబైలోని వివిధ కంపెనీకు అమ్మడం ప్రారంఽభించారు.
పారిశ్రామికవేత్తగా : ఈ స్ర్కాప్ బిజినెస్ చేస్తూనే అగర్వాల్ మరింత ఎదిగేందుకు బుర్రకు పదును పెట్టారు. 1976లో బ్యాంకు లోన్‌తో షంషేర్ స్టెర్లింగ్ కార్పొరేషన్ అనే కంపెనీని కొనుగోలు చేసి ఎనామిల్డ్ కాపర్ సహా అనేక ఉత్పత్తులు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. పదేళ్ల పాటు ఈ రెండు వ్యాపారాల్ని నెట్టుకొచ్చారు. తర్వాత 1986లో జెల్లీఫిల్డ్ కేబుల్స్ తయారీ కోసం స్టెరిలైట్ ఇండస్ట్రీ్‌సను ఏర్పాటు చేశారు. అయితే ఈ బిజినెస్ లాభ నష్టాలు కీలక ముడి పదార్ధాలైన రాగి, అల్యూమినియంపై ఆధారపడి ఉండేవి. దాంతో 1993లో దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు కాపర్ స్మెల్టర్, రిఫైనరీని ఏర్పాటు చేశారు. 1995లో ఖాయిలా పడిన మద్రాస్ అల్యూమినియం కంపెనీని, 2001లో ప్రభుత్వ రంగంలోని భారత్ అల్యూమినియం కంపెనీని (బాల్కో) కొనుగోలు చేసి కీలక ముడి పదార్ధాలైన కాపర్, అల్యూమినియం ధరలు తగ్గించుకున్నారు. 2002లో మరో ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జడ్‌ఎల్) ఈక్విటీలోనూ మెజారిటీ వాటా 65 శాతం కొని లోహాల రంగంలో పట్టు పెంచుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లకు: 2003లో తన గ్రూప్ ప్రధాన కంపెనీ వేదాంత రిసోర్సెస్ షేర్లను లండన్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్ ద్వారానే అనిల్ అగర్వాల్ దేశ, విదేశాల్లోని తన ఖనిజ, మెటల్ కంపెనీలను నిర్వహిస్తున్నారు.
సవాళ్లు : అనిల్ అగర్వాల్ వ్యాపారంలో చాలా సవాళ్లే ఎదుర్కొన్నారు. తమిళనాడు తూత్తుకుడిలోని స్టెరిలైట్ ఇండస్ట్రీస్ కాపర్ స్మెల్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ పేరుతో మూసివేయడం అతి పెద్ద సవాలు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రాగి, అల్యూమినియం ధరలు పడిపోయాయి. దాంతో కంపెనీ అప్పుల చెల్లింపుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని ఆర్థిక సంస్థలు అప్పుల చెల్లింపు గడువు పొడిగించగా కొన్ని కుదరదన్నాయి. దాంతో ఆ అప్పులు చెల్లించేందుకు అధిక వడ్డీతో కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి చూసి, ఇంకేముంది వేదాంత మరో దివాలా కంపెనీ కాబోతోందనే వార్తలు గుప్పుమన్నాయి.
కొత్త రంగాల్లోకి : ఈ సవాళ్లను తట్టుకుని వేదాంత గ్రూప్ ఇప్పుడు సెమీకండక్టర్లతో సహా అనేక కొత్త రంగాల్లోకి విస్తరిస్తోంది. రాజస్థాన్‌లోని తన చమురు, గ్యాస్ క్షేత్ర ఉత్పత్తి సామర్ధ్యాన్నీ మరింత పెంచుతోంది. ఏదేమైనా అనిల్ అగర్వాల్ వ్యాపార నైపుణ్యాలు, పట్టుదలే ఈ రోజు వేదాంతా గ్రూప్‌ను ప్రముఖ అంతర్జాతీయ లోహాల కంపెనీగా నిలబెట్టాయి. ఈ విధంగా అగర్వాల్ ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శిగా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News