Share News

GST Reduction: మార్కెట్‌కు జీఎ్‌సటీ జోష్‌

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:44 AM

జీఎ్‌సటీ రేట్లు తగ్గించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రకటించడంతోపాటు ఎస్‌ అండ్‌ పీ 18 ఏళ్ల తర్వాత భారత పరపతి రేటింగ్‌ను పెంచడం స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.

GST Reduction: మార్కెట్‌కు జీఎ్‌సటీ జోష్‌

రూ.6.17 లక్షల కోట్ల సంపద వృద్ధి

  • ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,168 పాయింట్లు అప్‌

  • చివరికి 676 పాయింట్ల లాభంతో 81,273 వద్ద ముగింపు

  • మళ్లీ 25,000 స్థాయిని తాకిన నిఫ్టీ

  • వాహన, వినియోగ రంగ షేర్లలో ర్యాలీ

ముంబై: జీఎస్‌టీ రేట్లు తగ్గించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రకటించడంతోపాటు ఎస్‌ అండ్‌ పీ 18 ఏళ్ల తర్వాత భారత పరపతి రేటింగ్‌ను పెంచడం స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. జీఎ్‌సటీ రేట్ల తగ్గుదలతో భారీగా లబ్ది పొందనున్న వాహనం, వినియోగ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పోటెత్తించడంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం ఉవ్వెత్తున ఎగిశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 1,168.11 పాయింట్లు పెరిగి 81,765.77 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి కాస్త తగ్గిన సూచీ చివరకు 676.09 పాయింట్ల లాభంతో 81,273.75 వద్ద ముగిసింది.


నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 390 పాయింట్లు పెరిగి 25,000 స్థాయిని అధిగమించినప్పటికీ, చివరికి 245.65 పాయింట్ల వృద్ధితో 24,876.95 వద్ద స్థిరపడింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.6.71 లక్షల కోట్లు పెరిగి రూ.450.96 లక్షల కోట్లకు చేరుకుంది.

  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 20 రాణించాయి. మారుతి సుజుకీ షేరు ఏకంగా 8.94 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫైనాన్స్‌ 5.02 శాతం వృద్ధి చెందగా.. అలా్ట్రటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు 3 శాతానికి పైగా పుంజుకున్నాయి. కాగా, ఐటీసీ 1.26 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. ఐటీ రంగ షేర్లూ నష్టాల్లో పయనించాయి.

  • బీఎస్‌ఈలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీల ప్రాతినిథ్య సూచీలైన స్మాల్‌క్యాప్‌ 1.39 శాతం, మిడ్‌క్యాప్‌ ఒక శాతం వృద్ధి చెందాయి. రంగాల వారీ సూచీల్లో ఆటో ఏకంగా 4.26 శాతం ఎగబాకింది. కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ 3.08 శాతం, కన్స్యూమర్‌ డిస్‌క్రెషనరీ 2.74 శాతం, రియల్టీ 2.19 శాతం లాభపడ్డాయి. కమోడిటీస్‌, మెటల్‌, సర్వీసెస్‌ ఇండెక్స్‌లు 1.96 శాతం వరకు పెరిగాయి. ఐటీ, పవర్‌, టెక్‌, ఫోకస్డ్‌ ఐటీ సూచీలు మాత్రం నష్టాల్లో ముగిశాయి.

  • బీఎస్‌ఈలో మొత్తం 4,365 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 2,499 లాభపడ్డాయి. 1,696 నష్టపోగా.. 170 యథాతథంగా ముగిశాయి. 156 కంపెనీల స్టాక్స్‌ సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని తాకాయి.

Updated Date - Aug 19 , 2025 | 04:44 AM