Share News

అమ్మకాల హోరుతో మార్కెట్‌ డౌన్‌

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:55 AM

డిసెంబరు త్రైమాసిక ఆదాయాల వృద్ధిపై నెలకొన్న భయాల కారణంగా మార్కెట్‌ దిగ్గజాలైన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ కౌంటర్లలో జరిగిన భారీ అమ్మకాలు మార్కెట్‌ను కుంగదీశాయి. చైనా విడుదల చేసిన ద్రవ్యోల్బణం...

అమ్మకాల హోరుతో మార్కెట్‌ డౌన్‌

ముంబై: డిసెంబరు త్రైమాసిక ఆదాయాల వృద్ధిపై నెలకొన్న భయాల కారణంగా మార్కెట్‌ దిగ్గజాలైన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ కౌంటర్లలో జరిగిన భారీ అమ్మకాలు మార్కెట్‌ను కుంగదీశాయి. చైనా విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికా బాండ్లలో భారీ అమ్మకాలు, ఆసియా మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు కూడా గురువారం మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. దీంతో సెన్సెక్స్‌ 528.28 పాయింట్లు నష్టపోయి 77,620.21 వద్ద ముగిసింది. నిఫ్టీ 162.45 పాయింట్ల నష్టంతో 23,526.50 వద్ద ముగిసింది. అమెరికాలో 10 సంవత్సరాల బాండ్ల రాబడులు 2024 ఏప్రిల్‌ తర్వాత గరిష్ఠ స్థాయిలకు చేరాయని, దీనివల్ల అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ తక్కువ సార్లు మాత్రమే వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న భయాలు బాండ్లలో అమ్మకాలను ప్రేరేపించాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.


లెన్స్‌కార్ట్‌ రూ.8,500 కోట్ల ఐపీఓ: కళ్లద్దాల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టప్‌ కంపెనీ లెన్స్‌కార్ట్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇష్యూ ద్వారా 100 కోట్ల డాలర్లు (రూ.8,500 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ కావాలని, అప్పటికి 700 కోట్ల నుంచి 800 కోట్ల డాలర్ల (రూ.59,500 నుంచి 68,000 కోట్లు) విలువ సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 20 కోట్ల నుంచి 30 కోట్ల డాలర్ల విలువ గల సెకండరీ షేర్ల అమ్మకాలు పూర్తి చేసినట్టయితే కంపెనీ విలువ 20 శాతం పెరిగి 600 కోట్ల డాలర్లకు చేరుతుందని గత నవంబరులో అంచనా వేశారు. కంపెనీ ఇప్పటికే ఫిడెలిటీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌, టెమాసెక్‌ నుంచి 20 కోట్ల డాలర్లు సమీకరించింది. 2010 సంవత్సరంలో స్థాపించిన లెన్స్‌కార్ట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2000 స్టోర్లను నిర్వహిస్తోంది.

Updated Date - Jan 10 , 2025 | 03:55 AM