ఈ నెలాఖరు నాటికి ఆరోగ్య బీమాలోకి ఎల్‌ఐసీ
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:41 AM
వచ్చే రెండు వారాల్లో ఓ ఆరోగ్య బీమా సంస్థలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి...
ముంబై: వచ్చే రెండు వారాల్లో ఓ ఆరోగ్య బీమా సంస్థలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి తెలిపారు. ఆయితే, ఏ కంపెనీలో వాటా కొనుగోలు చేయబోతున్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. వాటా కొనుగోలుకు సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నాయని, ఈ నెలాఖరు నాటికి ఒప్పందం కుదరవచ్చని మొహంతి ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఆరోగ్య బీమా కంపెనీలో ఎల్‌ఐసీ మెజారిటీ వాటా (51 శాతం, అంతకుపైగా) మాత్రం కొనుగోలు చేయబోదని స్పష్టం చేశారు. మంగళవారం ‘జీసీఏ25’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాల్ని వెల్లడించారు.
ఎంత వాటా కొనుగోలు చేయాలనేది ఎల్‌ఐసీ బోర్డు నిర్ణయంతో పాటు లక్షిత ఆరోగ్య బీమా సంస్థ మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం జీవిత కంపెనీలు ఆరోగ్య బీమా కవరేజీ ఆఫర్ చేసేందుకు అనుమతి లేదు. అయితే, బీమా కంపెనీలు జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా సేవలందించేందుకు వీలుగా కాంపొజిట్ లైసెన్సులను ప్రవేశపెట్టాలని ఇండస్ట్రీ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. ఇందుకు సంబంధించి ఈసారి బడ్జెట్లో ప్రకటన వెలువడవచ్చని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ, అది జరగలేదు.
స్టాండ్‌ఎలోన్ హెల్త్ ఇన్సూరెన్స్
కంపెనీలో వాటా కొనుగోలు
ఎల్‌ఐసీ ఆరోగ్య బీమా విభాగంలోకి ప్రవేశించేందుకు మణిపాల్ సిగ్నాలో వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తోందని, వాటా కొనుగోలు ఒప్పందం విలువ రూ.4,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ వార్తలపై స్పందించిన ఎల్‌ఐసీ.. కేవలం ఆరోగ్య బీమా సేవలందిస్తోన్న స్టాండ్‌ఎలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు వివరణ ఇచ్చింది.
100 ఏళ్ల ప్రభుత్వ బాండ్లను ప్రవేశపెట్టాలి..
వందేళ్ల కాలపరిమితితో కూడిన ప్రభుత్వ బాండ్ల (జీ-సెక్)ను ప్రవేశపెట్టాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ని ఎల్‌ఐసీ అభ్యర్థించింది. ప్రస్తుతం 40 ఏళ్ల వరకు టర్మ్ బాండ్ల జారీకి ఆర్‌బీఐ అనుమతించింది. 50 ఏళ్లు, 100 ఏళ్ల టర్మ్ బాండ్లను కూడా జారీ చేయాలని ఆశిస్తున్నట్లు ఎల్‌ఐసీ ఎండీ మొహంతి అన్నారు. ఇందుకోసం ఆర్‌బీఐతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని, ఆర్‌బీఐ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోందన్నారు. పూర్తిగా జీవిత బీమా పాలసీలు విక్రయించే ఎల్‌ఐసీ.. పాలసీదారుల నుంచి సమీకరించిన ప్రీమియం సొమ్మును ప్రధానంగా ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లు, ఈక్విటీలతో పాటు భిన్న ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులుగా పెడుతుంది.
Read More Business News and Latest Telugu News