Job Opportunities: వచ్చే ఆర్థిక సంవత్సరం ఐటీలో 1.5 లక్షల ఫ్రెషర్ల నియామకాలు!
ABN , Publish Date - Mar 15 , 2025 | 02:23 AM
ఐటీ రంగంలో మళ్లీ ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రాంగణ నియామకాల జోరు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
2024-25తో పోలిస్తే దాదాపు రెట్టింపు హైరింగ్!!
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో మళ్లీ ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని, సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రాంగణ నియామకాల జోరు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఫ్రెషర్ల నియామకాలు 1.5 లక్షల స్థాయిని దాటవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)తో పోలిస్తే దాదాపు రెట్టింపు కావచ్చన్న అంచనాలున్నాయి. ఈ నెలాఖరుతో ముగియనున్న 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఫ్రెషర్ల హైరింగ్ 85,000-95,000కు పరిమితం కావచ్చని రిక్రూట్‌మెంట్ సేవల సంస్థ టీమ్‌లీజ్ భావిస్తోంది.
సవాళ్ల సంద్రంలో ఐటీ: ప్రస్తుతం దేశీయ ఐటీ రంగం పలు సవాళ్లు ఎదుర్కోంటోంది. ఒకవైపు సాంకేతిక పరివర్తనం.. మరోవైపు ప్రధాన ఆదాయ వనరైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఐటీ వ్యయాలు తగ్గడం. ఈ రెండు కారణాల వల్ల కంపెనీలు గత ఏడాదిలో ముందు జాగ్రత్త ధోరణితో వ్యవహరించాయి. వ్యయ నియంత్రణ సాకుతో ఉద్యోగాల్లో కోతలు పెట్టాయి. ప్రాంగణ నియామకాలూ పరిమిత స్థాయిలోనే జరిగాయి. ఐటీ రంగంలో ఇప్పుడిప్పుడే హైరింగ్ మళ్లీ పెరుగుతోందని, కంపెనీలు ముఖ్యంగా ఫ్రెషర్లతో పాటు ప్రత్యేక నిపుణుల నియామకాలపై దృష్టిసారించాయని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలంటున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ పరివర్తన నిపుణులకు డిమాండ్ పెరిగిందని టీమ్‌లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి శర్మ తెలిపారు.
మళ్లీ మాంద్యం భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల వడ్డనతో అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి పెరిగింది. యూఎస్ మళ్లీ మాంద్యంలోకి జారుకోవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం మన ఐటీ రంగానికి ప్రతికూల పరిణామమే. కాస్త మెరుగువుతూ వస్తున్న నియమాకాల సెంటిమెంట్‌ను మళ్లీ దెబ్బతీయవచ్చని కొందరు భావిస్తున్నారు.
ప్రత్యేక నిపుణులకు భారీ డిమాండ్
జెనరేటివ్ ఏఐతో వచ్చిన సాంకేతిక పరివర్తన కారణంగా ఐటీ రంగంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి భారీగా డిమాండ్ నెలకొందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ నిపుణులకు ఆకర్షణీయ పారితోషికం ఆఫర్ చేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని రిక్రూటింగ్ ఏజెన్సీలంటున్నాయి. ఫ్రెషర్లు కోడింగ్‌తో పాటు ఆధునిక టెక్నాలజీల్లోనూ ప్రావీణ్యం సాధించగలిగితే భారీ వేతనంతో కూడిన ఉద్యోగం దక్కించుకోవచ్చని వారంటున్నారు.