IPO: ఐపీఓల జోరు.. భారత క్యాపిటల్ మార్కెట్‌కు కొత్త కంపెనీల వెల్లువ!
ABN , Publish Date - Jul 01 , 2025 | 10:37 PM
భారత క్యాపిటల్ మార్కెట్‌లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ) సందడి కొనసాగుతుంది.
హైదరాబాద్: భారత క్యాపిటల్ మార్కెట్‌లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ) సందడి కొనసాగుతుంది. కేటరింగ్, ఆహార సేవలు, బాస్మతి బియ్యం, పునరుత్పాదక ఇంధనం, ఆటోమోటివ్ విడిభాగాలు ఆర్థిక సేవలు వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు తమ ఐపీఓల కోసం సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లు (DRHP) సమర్పించాయి.
ఏవంటే...
1. ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్:
కేటరింగ్, ఫుడ్ రిటైల్ చెయిన్ రంగంలోని ఈ సంస్థ రూ. 160 కోట్ల విలువైన తాజా షేర్లు, 1.19 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS)తో ఐపీఓకు సిద్ధమైంది. సేకరించిన నిధులను కొత్త కిచెన్‌లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయడానికై, రుణాల చెల్లింపునకై వినియోగించనున్నారు.
2. క్యూర్‌ఫుడ్స్ ఇండియా లిమిటెడ్:
ఇంటర్నెట్ ఆధారిత మల్టీ-బ్రాండ్ ఫుడ్ సేవల కంపెనీ క్యూర్‌ఫుడ్స్ ఇండియా, రూ. 800 కోట్ల తాజా షేర్లు, 4.85 కోట్ల ఈక్విటీ షేర్ల OFSతో కూడిన DRHPని సమర్పించింది. తమ కార్యకలాపాలను విస్తరించడానికై, కొత్త కిచెన్‌లు స్థాపించడానికై, బ్రాండ్‌లను విస్తరించడానికై ఈ నిధులను ఉపయోగిస్తారు.
3. అమీర్‌చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్:
బాస్మతి బియ్యం, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించే ఈ సంస్థ రూ. 550 కోట్ల ఐపీఓకు డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది. నిధులను నిర్వహణ మూలధన అవసరాలకై, సాధారణ కార్పొరేట్ అవసరాలకై వినియోగించనున్నారు.
4. జునిపర్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్:
పునరుత్పాదక విద్యుదుత్పత్తి రంగంలో ఉన్న జునిపర్ గ్రీన్ ఎనర్జీ, రూ. 3,000 కోట్ల తాజా షేర్ల ఐపీఓ కోసం DRHP దాఖలు చేసింది. సేకరించిన నిధులను రుణాల చెల్లింపునకై, కార్పొరేట్ అవసరాలకై కేటాయిస్తారు. 2024 డిసెంబర్ నాటికి ఇది భారత్‌లోని టాప్ 10 పునరుత్పాదక విద్యుదుత్పత్తి దిగ్గజాలలో ఒకటిగా నిలిచింది.
5. టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియా లిమిటెడ్:
యూఎస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన టెన్నెకో గ్రూప్‌లో భాగమైన టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియా లిమిటెడ్, తమ ఐపీఓ కోసం సెబీకి DRHP సమర్పించింది. ప్రమోటర్ టెన్నెకో మారిషస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా రూ. 3000 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది.
6. గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్:
గజా క్యాపిటల్ బ్రాండ్ కింద కార్యకలాపాలను నిర్వహించే గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, తమ ఐపీఓ కోసం సెబీ వద్ద రహస్య DRHP దాఖలు చేసింది. విద్య, వినియోగదారు ఆర్థిక సేవల రంగాలకు ఇది మూలధనాన్ని అందిస్తుంది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ ప్రీ-ఐపీఓ నిధుల సేకరణలో రూ. 125 కోట్లు సేకరించింది. కొత్త ఇష్యూ ఆదాయం ఫండ్ మేనేజర్ల మూలధనాన్ని కొత్త నిధులను సీడ్ చేయడానికై, పంపిణీ సామర్థ్యాలను విస్తరించడానికై ఉపయోగిస్తారు.
7. షాడోఫాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్...
షాడోఫాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కోసం సెబీ వద్ద గోప్యమైన రీతిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(DRHP)ను దాఖలు చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఐపీవో పరిమాణం రూ. 2,000 - రూ. 2,500 కోట్ల పరిధిలో ఉండనుంది. ఇందులో ప్రస్తుత వాటాదారుల తాజా ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ (OFS) కలిపి వుంటాయి . కంపెనీ విలువ దాదాపు రూ. 8,500 కోట్లు ఉంటుందని అంచనా.