విస్తరణ బాటలో విమానయాన సంస్థలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:12 AM
విమానాల తయారీ సంస్థలైన ఎయిర్‌బస్, బోయింగ్‌లకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా మారుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్.. ఎయిర్‌బస్ నుంచి మరో 30 ఏ350 రకం విమానాలు కొనుగోలు చేసేందుకు...
30 ఏ350 విమానాలకు ఇండిగో ఆర్డర్
అదేబాటలో ఎయిర్ ఇండియా!
న్యూఢిల్లీ: విమానాల తయారీ సంస్థలైన ఎయిర్‌బస్, బోయింగ్‌లకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా మారుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్.. ఎయిర్‌బస్ నుంచి మరో 30 ఏ350 రకం విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) సదస్సుకు హాజరైన సందర్భంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఈ విషయం వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్‌లోనూ ఇండిగో.. ఎయిర్‌బస్ నుంచి 30 ఏ350 రకం విమానాలు కొనేందుకు ఆర్డర్ పెట్టింది. తాజా ఆర్డర్‌తో ఎయిర్‌బస్ నుంచి ఇండిగో కొనే ఏ350 విమానాల సంఖ్య 60కి చేరింది. ఇండిగో ఈ విమానాలను విదేశాల్లోని సుదూర ప్రాంతాలకు నడుపుతుంది. వ్యాపార విస్తరణలో భాగంగా ఇండిగో రానున్న సంవత్సరాల్లో 900కు పైగా కొత్త విమానాలను సమకూర్చుకోనుంది.
ఎయిర్ ఇండియా 200 విమానాలకు!
టాటాల నిర్వహణలోని ఎయిర్ ఇండియా (ఏఐ) కూడా పెద్దఎత్తున విస్తరణ చేపడుతోంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో కొత్త విమానాల కొనుగోలుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఎయిర్‌బస్, బోయింగ్ కంపెనీలతో కంపెనీ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ఆర్డర్ కూడా దాదాపు 200 విమానాల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాల కొనుగోలుకు ఏఐ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులతో పాటు సరుకు రవాణా కోసం కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తామని కంపెనీ సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ ఐఏటీఏ సదస్సులో ప్రకటించడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. 2028కల్లా దేశీయ విమానయాన మార్కెట్లో కనీసం 30 శాతం వాటా సాధించడమే తమ లక్ష్యమన్నారు.
పెరుగుతున్న భాగస్వామ్యాలు
మరోవైపు మన దేశానికి చెందిన విమానయాన సంస్థలు విదేశీ విమానయాన సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదర్చుకుంటున్నాయి. తాజాగా ఇండిగో.. డెల్టా ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్‌ఎం, వర్జిన్ అట్లాంటిక్ సంస్థలతో భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్లో దేశాలతో ఇండిగోకు మరింత కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంతో టిక్కెట్ల బుకింగ్‌లో ఈ సంస్థలన్నీ పరస్పరం సహకరించుకుంటాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రపంచంలోని 10 ప్రముఖ నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. కాగా ఎయిర్ ఇండియా.. టాటా గ్రూప్ చేతికి వచ్చిన తర్వాత 20 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఇవీ చదవండి:
జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి