ఔరా కుబేర
ABN , Publish Date - Jun 06 , 2025 | 06:04 AM
గత ఏడాది (2024) దేశంలోని సిరిమంతుల సంఖ్యతో పాటు వారి సంపద కూడా గణనీయంగా పెరిగింది. క్యాప్‌జెమినీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2025’ ప్రకారం..
దేశంలో 3.79 లక్షల మంది మిలియనీర్లు
వారి మొత్తం ఆస్తి రూ.129 లక్షల కోట్లు
ఏడాది కాలంలో 8.8 శాతం సంపద వృద్ధి
‘వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2025’లో వెల్లడి
న్యూఢిల్లీ: గత ఏడాది (2024) దేశంలోని సిరిమంతుల సంఖ్యతో పాటు వారి సంపద కూడా గణనీయంగా పెరిగింది. క్యాప్‌జెమినీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2025’ ప్రకారం.. గత సంవత్సరం దేశంలోని మిలియనీర్లు లేదా హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్య 33,000కు పైగా పెరిగి మొత్తం 3,78,810కి చేరింది. 2023లో నమోదైన 3.45 లక్షల మంది తో పోలిస్తే ఏడాది కాలంలో వీరి సంఖ్య 5.6 శాతం పెరిగింది. అంతేకాదు, 2024లో మన మిలియనీర్ల మొత్తం సంపద వార్షిక ప్రాతిపదికన 8.8 శాతం వృద్ధితో 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.129 లక్షల కోట్లు. దీంతో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంపద కేంద్రాల్ల్లో ఒకటిగా నిలిచిందని, ఈ విషయంలో చైనాను మించిపోయిందని నివేదిక పేర్కొంది. మరిన్ని విషయాలు..
కొత్తగా మిలియనీర్లుగా అవతరించిన వారిలో చాలామంది మిలియనీర్ నెక్స్ట్ డోర్ విభాగం పరిధిలోకి వస్తారని రిపోర్టు వెల్లడించింది. ఒక మిలియన్ డాలర్ల్ల (10 లక్షల డాలర్లు= రూ.8.58 కోట్లు) నుంచి 5 మిలియన్ డాలర్ల (50 లక్షల డాలర్లు= రూ.42.9 కోట్లు) పెట్టుబడి ఆస్తులు కలిగిన వారు ఈ పరిధిలో వస్తారు. గత ఏడాది వీరి సంఖ్య 3,33,340కు పెరిగిందని, వీరి మొత్తం సంపద 62,893 కోట్ల డాలర్లకు (రూ.53.96 లక్షల కోట్లు) చేరిందని రిపోర్టు తెలిపింది.
కనీసం 30 మిలియన్ డాలర్ల (3 కోట్ల డాలర్లు= రూ.257 కోట్లు) పెట్టుబడి ఆస్తులు కలిగిన కుబేరులు లేదా అలా్ట్ర హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్య గత ఏడాది చివరినాటికి 4,290కి పెరిగింది, వారి మొత్తం సంపద 53,477 కోట్ల డాలర్ల (రూ.45.88 లక్షల కోట్లు)కు చేరిందని నివేదిక వెల్లడించింది.
గత ఏడాది ప్రపంచ మిలియనీర్ల సంఖ్య 2.6 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్లు, కృత్రిమ మేధ (ఏఐ) బూమ్‌తో అలా్ట్ర హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ 6.2 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది.
సంపద వృద్ధికి చోదకాలు
ఈక్విటీ మార్కెట్ల వృద్ధి, దేశీయ వినియోగం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య పెరగడం, వేగంగా డిజిటలీకరణ, స్టార్ట్‌పల బూమ్ సహా టెక్నాలజీ, ఫిన్‌టెక్, ఇన్‌ఫ్రా తదితర రంగాల వివిధీకరణ వంటి అంశాలు దేశంలో మిలియనీర్ల సంఖ్యతో పాటు వారి సంపద వృద్ధికి దోహదపడుతున్నాయని క్యాప్‌జెమినీ రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
లిస్టెడ్ కంపెనీలకు NSE ESG రేటింగ్‌లు ప్రారంభం...
ఎన్.ఎస్.ఈ సస్టైనబిలిటీ రేటింగ్స్ అండ్ అనలిటిక్స్ లిమిటెడ్ (NSE Sustainability) లిస్టెడ్ కంపెనీలకు ఎన్విరాన్‌మెంటల్, సోషల్, అండ్ గవర్నెన్స్ (ESG) రేటింగ్‌లను ప్రారంభించింది. భారతదేశంలో సుస్థిర వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడం, పెట్టుబడిదారులకు నిష్పాక్షికమైన సమాచారాన్ని అందించడం ఈ రేటింగ్‌ల ముఖ్య లక్ష్యం. సెబీ నుండి కేటగిరీ I ఈఎస్‌జీ రేటింగ్ ప్రొవైడర్‌గా అనుమతి పొందిన ఎన్.ఎస్.ఈ సస్టైనబిలిటీ, పారదర్శకమైన, డేటా ఆధారిత పద్ధతిలో కంపెనీల ఈఎస్‌జీ పనితీరును మదింపు చేస్తుంది. ఈ రేటింగ్‌లు భారతీయ కార్పొరేట్ రంగంలో జవాబుదారీతనాన్ని, సుస్థిరతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి