India’s Gold Reserves: ఈక్విటీల కంటే బంగారమే ముద్దు
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:06 AM
మన దేశంలో పసిడి నిల్వలు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి మన దేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), ప్రజల వద్ద 34,600 టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్టు...
ఈక్విటీల కంటే బంగారమే ముద్దు
దేశంలో 34,600 టన్నుల పసిడి
విలువ రూ.335.69 లక్షల కోట్లు
ఈక్విటీ పెట్టుబడుల కంటే 3.1 రెట్లు అధికం
జీడీపీలో పసిడి విలువ 88.8 శాతం
మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ: మన దేశంలో పసిడి నిల్వలు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి మన దేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), ప్రజల వద్ద 34,600 టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూస్తే దీని విలువ 3,78,500 కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే ఇది దాదాపు రూ.335.69 లక్షల కోట్లకు సమానం. ప్రస్తుతం భారత కుటుంబాలు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన 1,18,500 కోట్ల డాలర్ల కంటే ఇది 3.1 రెట్లు ఎక్కువ. జీడీపీపరంగా చూసినా పసిడి విలువ ప్రస్తుత జీడీపీలో 88.8 శాతం వరకు ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలిపింది.
వినియోగంలో రెండో స్థానం: ప్రస్తుతం ప్రపంచ పసిడి డిమాండ్‌లో చైనా తర్వాత మన దేశం రెండో స్థానంలో ఉంది. గత ఐదేళ్ల డేటాను పరిశీలిస్తే ప్రపంచ వార్షిక పసిడి కొనుగోళ్లలో చైనా 28 శాతం కొనుగోలు చేస్తుంటే, మన దేశం 26 శాతం వరకు కొనుగోలు చేస్తోందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్యుజీసీ) ఒక నివేదికలో తెలిపింది. మన దేశంలో పసిడి నిల్వలు పెద్దగా లేవు. దీంతో దేశ అవసరాల్లో దాదాపు 99 శాతానికి దిగుమతులే దిక్కు. భారత్ ఎంత లేదన్నా ఏటా 750 నుంచి 840 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది.
కారణాలు: మన దేశంలో పండగొచ్చినా, పబ్బమొచ్చినా చిన్నమెత్తు బంగారమైనా లేకుండా ఏ కార్యక్రమమూ పూర్తి కాదు. ఇక ధనత్రయోదశి రోజైతే బంగారం షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. ధర ఎంత పెరిగినా, తాహతుకు తగ్గట్టు కొద్దో గొప్పో బంగారం కొని పెట్టుకోవడం మధ్య, సంపన్న వర్గాల సంప్రదాయం. దీనికి తోడు ఇటీవల పెట్టుబడి లాభాల కోసం బంగారం కొని పెట్టుకునే వారి సంఖ్యా పెరిగి పోయింది. ప్రస్తుతం దేశంలో అమ్ముడయ్యే బంగారంలో 30 శాతం బిస్కెట్లు, కడ్డీలు, నాణేల రూపంలో అమ్ముడవుతోంది. వీటిని కొనేవారిలో ఎక్కువ మంది పెట్టుబడి లాభాల కోసం కొనేవారే. ఆర్థిక అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ ఆటుపోట్లు, ద్రవ్యోల్బణం కూడా చాలా మంది ఇన్వెస్టర్లను పసిడి వైపు చూసేలా చేస్తున్నాయి.

బంగారం రుణ మార్కెట్ రూ.15 లక్షల కోట్లు..
దేశంలో పసిడి నిల్వలతో పాటు బంగారాన్ని కుదువ పెట్టుకుని అప్పులిచ్చే మార్కెట్ కూడా పెరిగిపోతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి సంఘటిత రంగంలోని ఈ మార్కెట్ రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఇక్రా రేటింగ్ సంస్థ అంచనా. గతంలో అంచనా వేసిన దాని కంటే ఇది ఒక ఏడాది తక్కువ. 2027 మార్చి నాటికి ఇది మరింత విస్తరించి రూ.18 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపింది. రేసు గుర్రంలా పరుగెడుతున్న బంగారం ధరను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది సెప్టెంబరులో విడుదల చేసిన తమ అంచనాలను సవరిస్తున్నట్టు ఇక్రా తెలిపింది.
బ్యాంకులదే అగ్రస్థానం: రుణాలివ్వటంలో బ్యాంకింగేతర ఆర్థికేతర సంస్థ (ఎన్‌బీఎ్‌ఫసీ)లతో పోలిస్తే బ్యాంకులు ముందున్నాయి. 2020 -25 మఽధ్య కాలంలో సంఘటిత రంగంలోని ఎన్‌బీఎ్‌ఫసీల పసిడి రుణాల మార్కెట్ ఏటా సగటున 20 శాతం చొప్పున పెరిగితే, బ్యాంకుల పసిడి రుణాల వితరణ 26 శాతం చొప్పున పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నాటికి పసిడి రుణాల మార్కెట్ రూ.11.8 లక్షల కోట్లు ఉంటే, అందులో బ్యాంకుల వాటా 82 శాతానికి చేరినట్టు ఇక్రా తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..