Share News

కార్పొరేట్‌ నగరి

ABN , Publish Date - Feb 12 , 2025 | 03:29 AM

భాగ్యనగరంలో కార్యాలయ స్థలాలకు భారీగా డిమాండ్‌ నెలకొంది. 2030 నాటికి నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ 20 కోట్ల చదరపు అడుగులకు చేరుకోవచ్చని సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌- హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌...

కార్పొరేట్‌ నగరి

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు భారీ డిమాండ్‌

  • 2030 నాటికి 20 కోట్ల చదరపు అడుగులు

  • సీబీఆర్‌ఈ-హైసియా అంచనా

హైదరాబాద్‌: భాగ్యనగరంలో కార్యాలయ స్థలాలకు భారీగా డిమాండ్‌ నెలకొంది. 2030 నాటికి నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ 20 కోట్ల చదరపు అడుగులకు చేరుకోవచ్చని సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌- హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌(హైసియా) సంయుక్తంగా మంగళవారం విడుదల చేసిన నివేదిక అంచనా వేసింది. దేశంలోని మొత్తం ఆఫీస్‌ స్పేస్‌లో హైదరాబాద్‌ వాటా 15 శాతంగా ఉండగా.. గ్రీన్‌ సర్టిఫైడ్‌ ఆఫీస్‌ స్పేస్‌లో 18 శాతం వాటా కలిగి ఉంది. అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ డిమాండ్‌ నెలకొనడంతో 2014 నుంచి నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ మూడు రెట్లకు పైగా పెరిగిందని, 2024 డిసెంబరు నాటికి దాదాపు 13.7 కోట్ల చదరపు అడుగులకు చేరుకుందని ఆ నివేదికలో వెల్లడించారు. హైదరాబాద్‌ గడిచిన కొన్నేళ్లలో అంతర్జాతీయ సంస్థలకు వేదికగా, సాంకేతిక హబ్‌గా మారిందని.. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందగల సామర్థ్యం ఈ నగరానికి ఉందనడానికిదే నిదర్శనమని సీబీఆర్‌ఈ ఇండియా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా మార్కెట్ల చైర్మన్‌, సీఈఓ అన్షుమన్‌ మ్యాగజైన్‌ అన్నారు. సమృద్ధిగా మౌలిక వసతులతోపాటు కంపెనీల కార్యాలయ స్థలాల వైవిధ్యీకరణ, విరివిగా నిపుణుల లభ్యత వంటి అంశాలు భారత స్థిరాస్తి రంగంలో హైదరాబాద్‌ను కీలక మార్కెట్‌గా నిలిపాయన్నారు. ఐటీ, ఐటీఈఎస్‌ విభాగాల్లో బలంగా ఉండటంతో టెక్నాలజీ, బీఎ్‌ఫఎ్‌సఐ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు చెందిన గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ టాప్‌ చాయి్‌సగా కొనసాగనుందన్నారు. ఇది నగరంలో కార్యాలయ స్థలాల గిరాకీని మరింత పెంచనుందన్నారు.


గత ఏడాది 1.23 కోట్ల చ.అ స్థలాల లీజు

హైదరాబాద్‌లో రియల్టీ మార్కెట్‌ శరవేగంగా వృద్ధి చెందుతోందని, పర్యావరణహిత నిర్మాణాలపై దృష్టిపెరిగిందని సీబీఆర్‌ఈ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిప్సన్‌ పాల్‌ అన్నారు. హైదరాబాద్‌ వ్యాపారాలకు ప్రాధాన్య గమ్యంగా మారడంతో ఆఫీస్‌ స్పేస్‌కు గిరాకీ పెరుగుతోందన్నారు. 2024లోనూ ఇదే జోరు కొనసాగిందని, 1.23 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. నగరంలోని కార్యాలయ స్థలాల లీజులో టెక్నాలజీ కంపెనీల వాటా అత్యధికంగా 31 శాతంగా ఉంది. జీసీసీల ఏర్పాటు కోసం ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. టెక్నాలజీ, ఫార్మా, బయోటెక్నాలజీ, ఆర్థిక సేవల రంగ సంస్థలు ఎక్కువగా ఈ నగరాన్ని ఎంచుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా అనలిటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగం హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ను మరింత పెంచనుందని రిపోర్టు ప్రస్తావింంచింది.


ఈ ఏడాది టాప్‌-6 నగరాల్లో

7 కోట్ల చ.అ స్థలం లీజుకు..

వర్ధమాన సంవత్సరంలోనూ దేశంలోని 6 ప్రధాన నగరాల్లో (ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌, చెన్నై) కార్యాలయ స్థలాలకు బలమైన డిమాండ్‌ నెలకొందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సేవల సంస్థ కొలియర్స్‌ ఇండియా తాజా రిపోర్టు పేర్కొంది. మంగళవారం జరిగిన ఫిక్కీ 18వ రియల్‌ ఎస్టేట్‌ సదస్సులో ఈ నివేదికను విడుదల చేసింది. 2025లో ఈ ఆరు నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 6.5-7 కోట్ల చదరపు అడుగుల స్థాయిలో ఉండవచ్చని అంచనా వేసింది. 2024లో కంపెనీలు మొత్తం 6.64 కోట్ల చ.అ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయని తెలిపింది. ఈ ఏడాది ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ మొత్తంలో మూడో వంతు వాటా బెంగళూరుదే కానుందని కొలియర్స్‌ ఇండియా ఎండీ అర్పిత్‌ మెహ్రోత్రా అన్నారు. జీసీసీలు, ఇంజనీరింగ్‌, తయారీ సంస్థలు, కో-వర్కింగ్‌ స్పేస్‌ కంపెనీలు ఈ నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ గిరాకీకి ప్రధాన చోదకం కానున్నాయని ఆయన అన్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ మార్కెట్లలో 1-15 కోట్ల చ.అ చొప్పున స్థలం లీజుకు తీసుకోవచ్చని రిపోర్టు అంచనా. ముంబై, చెన్నై, పుణెలో 0.5-1 కోటి చ.అ ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 03:29 AM