వెండి నగలకూ హాల్‌మార్కింగ్
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:25 AM
వెండి నగలు, వస్తువులకూ ‘హాల్‌మార్కింగ్’ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన విధి విధానాలు ఖరారు చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ...

రంగం సిద్ధం చేస్తున్న బీఐఎస్
ఆరు నెలల్లో అమలు చేసే అవకాశం!
న్యూఢిల్లీ: వెండి నగలు, వస్తువులకూ ‘హాల్‌మార్కింగ్’ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన విధి విధానాలు ఖరారు చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. భారతీయ ప్రమాణాల సంస్థ బీఐఎ్‌సను కోరారు. బీఐఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన విలేకరులతో ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం బంగారంతో చేసిన నగలు, వస్తువులకు మాత్రమే ‘హాల్‌మార్క్’ గుర్తును తప్పనిసరి చేశారు. వెండి నగల్లో కల్తీని నిరోధించేందుకు, వాటికీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని వినియోగదారుల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు అందుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జోషి చెప్పారు. బీఐఎస్ ఇందుకు అవసరమైన విధి విధానాలు ఖరారు చేశాక అందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాగా దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. ఇందులో భాగంగా వెండి నగల స్వచ్ఛతను తెలిపేందుకు అవసరమైన హాల్‌మార్కింగ్‌ను రూపొందించి పరిశ్రమ వర్గాలతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈ చర్చలు పూర్తయితే మూడు నుంచి నాలుగు నెలల్లో వెండి నగలకూ హాల్‌మార్కింగ్ అమలు చేస్తామన్నారు.