Share News

GST Rules: నిరంతర సరఫరా అంటే

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:09 AM

జీఎ్‌సటీలో నిరంతర సరఫరా (కంటిన్యుయస్‌ సప్లయ్‌) అనే కాన్సెప్ట్‌ ఉంది. ఏదేనీ ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి ఒక్కసారి కాకుండా నిరంతరంగా కొంతకాలం పాటు ఏదేనీ వస్తువులు లేదా...

GST Rules: నిరంతర సరఫరా అంటే

జీఎ్‌సటీలో నిరంతర సరఫరా (కంటిన్యుయస్‌ సప్లయ్‌) అనే కాన్సెప్ట్‌ ఉంది. ఏదేనీ ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి ఒక్కసారి కాకుండా నిరంతరంగా కొంతకాలం పాటు ఏదేనీ వస్తువులు లేదా సేవలను పొందితే దానిని నిరంతర సరఫరా అంటారు. ఒక సరఫరా నిరంతర సరఫరా కిందకు రావాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.

ఇందులో మొదటిది కొనుగోలుదారునికి, అమ్మకందారునికి మధ్య ఆ సరఫరాకు సంబంధించి ఒక కాంట్రాక్ట్‌ ఉండాలి. ఉదాహరణకు ఒక పరిశ్రమకు సంబంధించి ముడి పదార్ధాలు సరఫరా చేయటం, ఒక కంపెనీకి కారు లేదా సెక్యూరిటీ సేవలు ఇవ్వటంతో పాటు పైప్‌ ద్వారా చేసే గ్యాస్‌ సరఫరా ఈ కోవలోకి వస్తాయి. అలాగే ఆ సరఫరా అనేది సేవలకు సంబంధించినది అయితే సరఫరా అనేది మూడు నెలలకు మించి ఉండాలి.

మరి కంటిన్యుయస్‌ సప్లయ్‌, సాధారణ సరఫరాలో జీఎ్‌సటీకి సంబంధించి ఏమైనా తేడాలు ఉన్నాయా అంటే.. అమ్మకపు విలువలోనూ, కట్టే పన్నులోనూ ఎలాంటి తేడా ఉండదు. కానీ ఇన్వాయిస్‌ ఇవ్వాల్సిన సమయం మారుతుంది. దీనివల్ల పన్ను కట్టాల్సిన సమయం మారుతుంది. అంటే ‘టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌’ మారుతుంది. దీన్ని వివరంగా తెలుసుకుందాం.


ఒక సరఫరాకు సంబంధించి పన్ను ఎప్పుడు కట్టాలనే విషయం టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ తెలుపుతుంది. అంటే, ఒక వ్యక్తి తాను చేసిన సరఫరాకు పన్ను కట్టే ముందు ఆ సరఫరాకు సంబంధించి టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. ఉదాహరణకు సర్వీసుల విషయానికి వస్తే టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ అనేది ఇన్వాయిస్‌ సకాలంలో ఇచ్చారా లేదా అనే దానిని బట్టి ఉంటుంది. ఇన్వాయిస్‌ నియమ నిబంధనల ప్రకారం ఒక సర్వీస్‌ పూర్తయిన తర్వాత గరిష్ఠంగా 30 రోజులలోపు ఇన్వాయిస్‌ ఇవ్వాలి. అలా ఇచ్చిన పక్షంలో ఇన్వాయిస్‌ తేదీ లేదా సరఫరాకు సబంధించిన సొమ్ము వచ్చిన తేదీ.. ఈ రెండింటిలో ఏది ముందైతే అది టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ కింద పరిగణించాలి. ఒకవేళ ఇన్వాయిస్‌ సకాలంలో అంటే నెలలోపు ఇవ్వకుంటే అప్పుడు సర్వీస్‌ పూర్తయిన తేదీ లేదా పైకం వచ్చిన తేదీ.. ఈ రెండింటిలో ఏది ముందైతే అది టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ అవుతుంది.

ఉదాహరణకు ఒక సర్వీస్‌ మార్చి 30న పూర్తయింది. దానికి సంబంధించిన అమౌంట్‌ జూన్‌ 10న వచ్చిందనుకుందాం. అలాగే ఇన్వాయిస్‌ ఏప్రిల్‌ 25న జారీ చేశాడనుకుందాం. అప్పుడు ఇన్వాయిస్‌ సకాలంలో అంటే 30 రోజుల లోపు ఇచ్చాడు కాబట్టి ఏప్రిల్‌ 25 (ఇన్వాయిస్‌ తేదీ), జూన్‌ 10 (సొమ్ము పొందిన తేదీ).. ఈ రెండింటిలో ఏది ముందయితే అది. అంటే ఏప్రిల్‌ 25 టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ అవుతుంది. కాబట్టి ఏప్రిల్‌ నెల రిటర్నులో కట్టాల్సిన పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ఇన్వాయిస్‌ 30 రోజుల తర్వాత అంటే ఏ మే నెలలోనో ఇచ్చి ఉంటే అప్పుడు అమౌంట్‌ వచ్చిన తేదీ లేదా సర్వీస్‌ పూర్తయిన తేదీ.. ఈ రెండింటిలో ఏది ముందయితే అది టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ అవుతుంది. ఈ విధంగా చూసినప్పుడు మార్చి 30 అనేది టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ అవుతుంది. కాబట్టి మార్చి నెలకు సంబంధించిన రిటర్నులో చెల్లించాల్సిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణ సరఫరాకు సంబంధించిన నియమం.


కంటిన్యుయస్‌ సప్లయ్‌లో కూడా ఇవే నిబంధనలు ఉన్నప్పటికీ ఇన్వాయిస్‌ జారీ చేయాల్సిన సమయంలో తేడా ఉంది. ఇక్కడ 30 రోజుల నిబంధన అమలు కాదు. సర్వీసులకు సంబంధించి కంటిన్యుయస్‌ సప్లయ్‌లో ఇన్వాయిస్‌ జారీ చేయటానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. ఇందులో కాంట్రాక్ట్‌ అనేది కచ్చితంగా ఉండాలని చెప్పుకున్నాం. ఒకవేళ ఇన్వాయి్‌సలో నిర్ధారిత తేదీలలో డబ్బులు చెల్లించాలనే ఒప్పందం ఉంటే ఆ తేదీల నాడు ఇన్వాయి్‌సలు జారీ చేయాలి (డబ్బు అందినా, లేకున్నా). అలా నిర్ధారిత తేదీ లేకుంటే డబ్బులు ఎప్పుడైతే వస్తాయో ఆ తేదీ నాటికి ఇన్వాయిస్‌ జారీ చేసి ఉండాలి. పైన చెప్పిన ఉదాహరణ కంటిన్యుయెస్‌ సప్లయ్‌ అనుకుంటే.. కాంట్రాక్ట్‌లో డబ్బులకు సంబంధించి నిర్ధారిత తేదీ లేకుంటే అప్పుడు జూన్‌ 10 వరకు ఇన్వాయిస్‌ జారీ చేయవచ్చు. ఎందుకంటే, జూన్‌ 10న తనకు డబ్బులు అందాయి కాబట్టి. అంటే సర్వీస్‌ పూర్తయిన 30 రోజుల లోపు ఇన్వాయిస్‌ ఇవ్వకున్నా అది సకాలంలో ఇచ్చినట్లే భావించాలి. అప్పుడు టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ జూన్‌ నెల అవుతుంది. అదే సాధారణ సరఫరా అయితే పైన చెప్పినట్లు మార్చి నెలలోనే టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ అవుతుంది.


ఇక సర్వీసులకు సంబంధించిన కంటిన్యుయస్‌ సప్లయ్‌ ఇన్వాయిస్‌ జారీ చేయటానికి మూడో పద్దతి కూడా ఉంది. కొన్ని కాంట్రాక్టుల్లో నిర్ధారిత పని పూర్తయినప్పుడే డబ్బు చెల్లించేటట్లు ఒప్పందం చేసుకుంటారు. ఉదాహరణకు బిల్డింగ్‌ కాంట్రాక్టర్లు ఏయే పనులు పూర్తయినప్పుడు ఎంతెంత చెల్లించాలో అని కాంట్రాక్ట్‌లో పొందుపరుస్తారు. అంటే ఇక్కడ చెల్లింపు అనేది సమయాన్ని బట్టి కాకుండా పనిని బట్టి ఉంటుంది. దీన్ని ఈవెంట్‌ను బట్టి చెల్లింపు చేయటం అంటారు. ఇలాంటి సందర్భంలో ఆ ఈవెంట్‌ పూర్తయిన తేదీ నాటికి ఆ ఈవెంట్‌ వరకు ఎంత మొత్తం అవుతుందో అంత మేర ఇన్వాయిస్‌ ఇవ్వాల్సి ఉంటుంది (డబ్బు అందినా, లేకున్నా). అంటే సర్వీసులకు సంబంధించిన కంటిన్యుయస్‌ సప్లయ్‌లో ఈ మూడు సందర్భాల్లో ఇచ్చిన ఇన్వాయి్‌సలు 30 రోజులలోపు ఇవ్వనప్పటికీ సకాలంలో ఇచ్చినట్లే గుర్తించాలి. కాబట్టి టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ అనేది దీని ప్రకారం మారుతుంది.

అలాగే కంటిన్యుయస్‌ సప్లయ్‌ అనేది వస్తు సరఫరాకు సంబంధించినదైతే ఇన్వాయి్‌సల నియమ నిబంధనలు వేరే విధంగా ఉంటాయి. తదనుగుణంగా టైమ్‌ ఆఫ్‌ సప్లయ్‌ కూడా మారుతుంది. కాబట్టి కంటిన్యుయస్‌ సప్లయ్‌లో ఉండే కాంట్రాక్టర్లు ఈ విషయాలు గమనించాలి.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవీ చదవండి:

చైనా నిపుణులు భారత్‌ను వీడుతున్న వైనంపై కేంద్రం నజర్

బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 03:09 AM