Share News

4 ఏళ్ల కనిష్ఠానికి వృద్ధి

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:13 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) భారత జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి 6.4 శాతానికి పరిమితం కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మాన్యుఫాక్చరింగ్‌, సేవల రంగాల పేలవ పనితీరు ఇందుకు కారణం...

4 ఏళ్ల  కనిష్ఠానికి వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పరిమితం

కేంద్ర ప్రభుత్వ ముందస్తు అంచనాలు విడుదల

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) భారత జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి 6.4 శాతానికి పరిమితం కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మాన్యుఫాక్చరింగ్‌, సేవల రంగాల పేలవ పనితీరు ఇందుకు కారణం కానుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) మంగళవారం విడుదల చేసిన ముందస్తు అంచనాల నివేదికలో పేర్కొంది. కొవిడ్‌ సంక్షోభం కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి మైనస్‌ 5.8 శాతానికి క్షీణించింది. ఆ తర్వాత ఇదే కనిష్ఠ వృద్ధి కానుంది. ఎందుకంటే, 2021-22లో 9.7 శాతం, 2022-23లో 7 శాతం, 2023-24లో 8.2 శాతం వృద్ధి నమోదైంది.


ఆర్‌బీఐ అంచనాల కంటే తక్కువ

ఈ ఆర్థిక సంవత్సరానికి ఎన్‌ఎస్‌ఓ వృద్ధి అంచనా.. గత నెలలో ఆర్‌బీఐ అంచనా వేసిన 6.6 శాతం కంటే తక్కువ. అంతేకాదు, కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసిన 6.5-7 శాతం వృద్ధి కంటే కూడా తక్కువే. ఎన్‌ఎ్‌సఓ ముందస్తు అంచనాలను ప్రభుత్వం బడ్జెట్‌ తయారీ కోసం ఉపయోగించుకోనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ను వచ్చే నెల 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

నామినల్‌ జీడీపీ వృద్ధి 9.7%

ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ఆధారిత నామినల్‌ జీడీపీ వృద్ధి రేటు మాత్రం 9.7 శాతానికి చేరుకోనుందని అంచనా. 2023-24లో నమోదైన 9.6 శాతం కంటే అధికమిది. ఎన్‌ఎ్‌సఓ గణాంకాల ప్రకారం.. 2023-24లో రూ.295.36 లక్షల కోట్లుగా ఉన్న నామినల్‌ జీడీపీ 2024-25లో రూ.324.11 లక్షల కోట్లకు చేరుకోనుంది. కాగా, 2024-25లో ప్రస్తుత ధరల ఆధారంగా జోడించిన స్థూల విలువ (జీవీఏ) రూ.292.64 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2023-24లో నమోదైన రూ.267.62 లక్షల కోట్ల జీవీఏతో పోలిస్తే 9.3 శాతం పెరగవచ్చని ఎన్‌ఎ్‌సఓ అంచనా వేసింది.


వచ్చే ఏడాది 6.5% వృద్ధి: ఇక్రా

ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి ఎన్‌ఎ్‌సఓ వృద్ధి అంచనాలు సహేతుకంగా ఉన్నాయని, కొన్ని రంగాలు అంచనా కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో మాత్రం అంతర్జాతీయ, దేశీయ అనిశ్చితులు వృద్ధిపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం మూలధన వ్యయాలను గణనీయంగా పెంచవచ్చని భావిస్తున్నామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతానికి పెరగవచ్చని అంచనా వేశారు.

ఈసారి వృద్ధి 6.2 శాతమే: హెచ్‌ఎ్‌సబీసీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు ఎన్‌ఎ్‌సఓ అంచనా కంటే దిగువ స్థాయి 6.2 శాతానికే పరిమితం కావచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌ఎ్‌సబీసీ అంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం 6.5 శాతానికి చేరుకోవచ్చని అభిప్రాయపడింది.


2024-25లో రంగాలవారీగా స్థూల విలువ జోడింపు (%)

రంగం 2024-25 అంచనా 2023-24

వ్యవసాయం సంబంధిత రంగాలు 3.8 1.4

మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌ 2.9 7.1

మాన్యుఫాక్చరింగ్‌ 5.3 9.9

ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌, నీటి సరఫరా

ఇతర యుటిలిటీ సేవలు 6.8 7.5

నిర్మాణం 8.6 9.9

వాణిజ్యం, హోటళ్లు, రవాణా,

కమ్యూనికేషన్స్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ 5.8 6.4

ఆర్థిక సేవలు, రియల్టీ, వృత్తి నైపుణ్య సేవలు 7.3 8.4

ప్రజా పాలన, రక్షణ, ఇతర సేవలు 9.1 7.8


3.8 లక్షల కోట్ల డాలర్లకు ఎకానమీ

ప్రస్తుత డాలర్‌-రూపాయి మారకం విలువ (రూ.85.7) ప్రకారంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ పరిమాణము 3.8 ట్రిలియన్‌ (లక్షల కోట్ల) డాలర్లకు చేరుకోనుందని ఎన్‌ఎ్‌సఓ అంచనా వేసింది.

తలసరి ఆదాయం రూ.2 లక్షలు

ప్రస్తుత ధరల ప్రకారంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి తలసరి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8.7 శాతం వృద్ధితో రూ.2,00,162కు చేరుకోవచ్చని ఎన్‌ఎ్‌సఓ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో తలసరి ఆదాయం రూ.1,84,205గా నమోదైంది.

Updated Date - Jan 08 , 2025 | 05:38 AM