Share News

పసిడి అమ్మకాలు ఢమాల్‌!

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:46 AM

పసిడి ధర ఇటు కొనుగోలుదారులు, వ్యాపారులకు దడ పుట్టిస్తోంది. పెరిగిన ధర చూసి పిల్లల పెళ్లిళ్ల కోసం పసిడి కొనాలనుకునే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావటంతో...

పసిడి అమ్మకాలు  ఢమాల్‌!

80 శాతం తగ్గిన ఆభరణాల విక్రయాలు

పెళ్లిళ్ల సీజన్‌ అయినా కొనుగోళ్లు అంతంతే.. చుక్కలనంటిన ధరే కారణం

న్యూఢిల్లీ: పసిడి ధర ఇటు కొనుగోలుదారులు, వ్యాపారులకు దడ పుట్టిస్తోంది. పెరిగిన ధర చూసి పిల్లల పెళ్లిళ్ల కోసం పసిడి కొనాలనుకునే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావటంతో అమ్మకాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు ప్రస్తుత ధర చుక్కలు చూపిస్తోంది. గత ఏడాది పెళ్లిళ్ల సీజన్‌తో పోలిస్తే నగల అమ్మకాలు ప్రస్తుతం 70 నుంచి 80 శాతం పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ‘పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలని చాలామంది భావించారు. అయితే పెరిగిన ధరలు చూసి వాళ్లు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. ధర ఎప్పుడు తగ్గుతుంది? బంగారం కొనేందుకు ఏది సరైన సమయం అని అదే పనిగా ఫోన్‌ చేసి అడుగుతున్నారు’ అని ఒక నగల వ్యాపారి చెప్పారు. వివాహాల సీజన్‌ అయినప్పటికీ ధరలు అందుబాటులో లేకపోవటంతో దేశవ్యాప్తంగా పసిడి విక్రయాలు గణనీయంగా పడిపోయాయని భారత బులియన్‌, జువెలర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు.


ట్రంప్‌ హెచ్చరికలు.. రూపాయి పతనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే కెనడా, మెక్సికో, ఈయూ వంటి మిత్ర దేశాలతో పాటు చైనా దిగుమతులపైనా సుంకాలు పెంచేశారు. రేపో మాపో కొన్ని దేశాల దిగుమతులపై ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించారు. దీంతో పెట్టుబడులకు ఢోకా లేని పసిడి ధర చుక్కలంటుతోంది. మరోవైపు దేశీయంగా రూపాయి పతనం కూడా పసిడి ధరలు పెరగటానికి ప్రధాన కారణంగా ఉంది. మన దేశ పసిడి అవసరాల్లో 95 శాతానికిపైగా దిగుమతులే దిక్కు. ఇందుకు డాలర్లలో చెల్లించాలి. అయితే డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజురోజుకీ క్షీణిస్తోంది. ఈ పతనాన్ని అడ్డుకునేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గత నాలుగు నెలల్లో దాదాపు 9,000 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ డాలర్‌తో రూపాయి పతనం ఆగలేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే మార్చి నెలాఖరుకు డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.90కు దిగజారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో పసిడి పరుగుకు ఇది కూడా ఒక ప్రధాన కారణం.


ఈ ఏడాది ఇప్పటికే 10% పైగా పెరిగిన ధర

ఢిల్లీ మార్కెట్లో గురువారం 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్‌) బంగారం ధర రూ.140 పెరిగి రూ.88,100కు చేరింది. ఒక దశలో రూ.88,600ను తాకింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం గురువారం ఒక దశలో 2,944.60 డాలర్లకు (సుమారు రూ.2,55,944) చేరింది. దేశీయంగా బంగా రం ధర ఈ ఏడాది ఇప్పటికే 10 శాతానికి పైగా ధర పెరిగింది. 2024లో పసిడి ధర 21 శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే.


సరఫరాకు మించి డిమాండ్‌

అంతర్జాతీయంగా సైనిక ఉద్రిక్తతలు తగ్గినా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. ట్రంప్‌ అధికారం చేపట్టాక ఇది మరింత పెరిగింది. దీంతో భారత్‌, చైనాతో పాటు ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారం రిజర్వులు పెంచుకుంటూ వస్తున్నాయి.

మరోవైపు మిగతా లోహాలతో పోలిస్తే పసిడి ఉత్పత్తి తక్కువ. డిమాండ్‌ మాత్రం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక అనిశ్చితితో స్టాక్‌ మార్కెట్లూ ‘బేర్‌’మంటున్నాయి. దీంతో పెట్టుబడులకు పెద్దగా ఢోకా లేని పసిడి మళ్లీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.


For Business News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 01:46 AM