Gold and Silver Prices Plunge: భారీగా తగ్గిన బంగారం
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:57 AM
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.4,100 తగ్గి రూ.1,21,800కు దిగివచ్చింది. ఈ నెల 17న నమోదైన ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1,34,800తో పోలిస్తే..
ఢిల్లీ మార్కెట్లో రూ.4,100 తగ్గుదల
రూ.1,21,800కు దిగివచ్చిన 10 గ్రాముల ధర
ఆల్‌టైం రికార్డుతో పోలిస్తే రూ.13,000 డౌన్
రూ.1.45 లక్షలకు పడిపోయిన కిలో వెండి
అంతర్జాతీయంగా 4,000 డాలర్ల దిగువకు..
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.4,100 తగ్గి రూ.1,21,800కు దిగివచ్చింది. ఈ నెల 17న నమోదైన ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1,34,800తో పోలిస్తే.. గడిచిన 11 రోజుల్లో మేలిమి బంగారం రేటు రూ.13,000 తగ్గింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం కూడా రూ.4,100 తగ్గుదలతో రూ.1,21,200కు పరిమితమైంది. కిలో వెండి ఏకంగా రూ.6,250 తగ్గి రూ.1,45,000 స్థాయికి పడిపోయింది. అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనాలుగా పేరున్న ఈ విలువైన లోహాలకూ డిమాండ్ తగ్గిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు మళ్లీ 4,000 డాలర్లకు దిగువకు పడిపోయింది. ఒక దశలో 94 డాలర్లకు పైగా తగ్గి 3,887 డాలర్లకు దిగివచ్చింది. వెండి సైతం 2.85 శాతం తగ్గుదలతో 45.56 డాలర్లకు జారుకుంది.
5-10 శాతం తగ్గొచ్చు..
బంగారం, వెండి ధరల్లో దిద్దుబాటు మున్ముందూ కొనసాగవచ్చని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీ్‌సకు చెందిన సౌమిల్ గాంధీ అన్నారు. వీటి ధరలు 5-10 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేశారు. ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. అలాంటి సందర్భాల్లో బడా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతుంటారని బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు.

వెండిపై తగ్గిన దిగుమతి సుంకం
15% నుంచి 6 శాతానికి తగ్గింపు
వెండి నగల దిగుమతులకు మాత్రం చెక్
వెండి లేదా వెండితో చేసిన నగలు, నాణేలు కొనాలనుకునే వారికి శుభవార్త. ఇప్పటి వరకు వెండిపై 15 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 6 శాతానికి కుదించింది. దీంతో దేశంలో వెండి ధర మరింత దిగి రానుంది. అయితే వెండి నగలు, వెండి నగల్లో వాడే భాగాలపై విధించే దిగుమతి సుంకాన్ని మాత్రం 25 శాతం నుంచి 20 శాతానికి మాత్రమే తగ్గించింది. దేశీయ వెండి నగల తయారీ పరిశ్రమ రక్షణ కోసమే ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు.
10 కిలోల వరకు తెచ్చుకోవచ్చు
విదేశాల నుంచి వచ్చే భారతీయులు లేదా ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) 10 కిలోల వరకు వెండిని తెచ్చుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. అయితే దీనిపైనా డీజీఎ్‌ఫటీ ఎప్పటికప్పుడు జారీ చేసే టారిఫ్ రేటు ప్రకారం దిగుమతి సుంకం చెల్లించాలని స్పష్టం చేసింది. పూర్తి ఎగుమతుల కోసం మాత్రం కంపెనీలు ఎన్ని వెండి నగలనైనా పైసా డ్యూటీ లేకుండా అనుమతించే విధానం కొనసాగుతుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎగుమతిదారులు లేదా ఎగుమతి సంస్థలు ఈ నగలను దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు మాత్రం అనుమతించరు.
ఇవి కూడా చదవండి:
Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు
Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు