Share News

Stock Market Losses : బ్లాక్‌ ఫ్రైడే

ABN , Publish Date - Mar 01 , 2025 | 03:16 AM

జీడీపీ గణాంకాలపై నెలకొన్న భయాలతో పాటు సుంకాలపై ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు, అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం శుక్రవారం ఈక్విటీ మార్కెట్లో మంటలు రేపాయి.

Stock Market Losses : బ్లాక్‌ ఫ్రైడే

  • బేర్‌ దెబ్బకు విలవిల

  • ఒక్కరోజే సెన్సెక్స్‌ 1,414 పాయింట్లు, నిఫ్టీ 420 పాయింట్లు డౌన్‌

  • రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి

జీడీపీ గణాంకాలపై నెలకొన్న భయాలతో పాటు సుంకాలపై ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు, అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం శుక్రవారం ఈక్విటీ మార్కెట్లో మంటలు రేపాయి. భారీ స్థాయిలో జరిగిన అమ్మకాల ప్రభావంతో సెన్సెక్స్‌ 1,414.33 పాయింట్లు నష్టపోయి 73,198.10 వద్ద ముగిసింది. నిఫ్టీ 420.35 పాయింట్లు నష్టపోయి 22,124.70 వద్ద క్లోజైంది. ఫలితంగా బీఎ్‌సఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ (ఇన్వెస్టర్ల సంపద) ఒక్క రోజులోనే రూ.8.9 లక్షల కోట్ల మేరకు దిగజారి రూ.384.22 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. కీలక సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ, ఆటో, బ్యాంక్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలన్నీ కూడా భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అవి 0.7 శాతం నుంచి 6.5 శాతం మధ్యన నష్టపోయాయి.

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు దేశీయ మార్కెట్లో అమ్మకాలకు ఆజ్యం పోశాయి. ఏఐలో అగ్రగామిగా ఉన్న ఎన్‌విడియా షేర్లలో భారీ అమ్మకాలు దేశీయ ఐటీ షేర్లలో కూడా అమ్మకాలకు దారి తీశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 4.2 శాతం మేరకు నష్టపోయింది. టెక్‌ మహీంద్రా, విప్రో, ఎంఫసిస్‌ షేర్లు గరిష్ఠంగా 6.5 శాతం వరకు నష్టపోయాయి.


ట్రంప్‌ చర్యల ప్రభావం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గురువారం కెనడా, మెక్సికోలపై 25ు సుంకాలు విధించడంతో పాటు చైనాపై 10ు అదనపు సుంకాలు విధిస్తూ తీసుకున్న చర్యలు శుక్రవారం మార్కెట్లో ప్రకంపనలు రేపాయి. ట్రంప్‌ వాణిజ్య విధానాలపై నెలకొన్న అనిశ్చితి మార్కెట్‌ను మరింత అస్థిరతకు గురి చేస్తోంది. వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చవచ్చన్న భయాల కారణంగా డాలర్‌ ఇండెక్స్‌ 107.36 పాయింట్లకు దూసుకుపోయింది. డాలర్‌ ఇండెక్స్‌ ఎంత బలపడితే భారత్‌ సహా వర్ధమాన మార్కెట్లకు అంత నష్టం అంటున్నారు.

ఈక్విటీ మార్కెట్లలో బలహీనత కారణంగా అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి శుక్రవారం 19 పైసల మేరకు క్షీణించి 87.37 వద్ద ముగిసింది.

ఏడాది కనిష్ఠానికి 148 స్టాక్స్‌

శుక్రవారం నాటి బేర్‌ దెబ్బకు నిఫ్టీ 500 ఇండెక్స్‌లోని 140 స్టాక్స్‌ 52 వారాల కనిష్ఠానికి చేరాయి. ఈ షేర్లలో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఆయిల్‌ ఇండియా, టాటా టెక్నాలజీస్‌, సొనాటా సాఫ్ట్‌వేర్‌ సహా మరికొన్ని ఉన్నాయి. మరోవైపు నిఫ్టీ 50లోని 45 షేర్లు నష్టాల్లోనే ముగిసాయి.

Updated Date - Mar 01 , 2025 | 05:48 AM