మసాలాల తయారీలోకి జెమినీ ఎడిబుల్స్
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:54 AM
ఫ్రీడమ్ బ్రాండ్ నేమ్‌తో వంటనూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్ కంపెనీ ‘జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా’ తాజాగా మసాలా ఉత్పత్తుల తయారీ...

శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్‌తో జేవీ ఏర్పాటు
చెన్నై: ఫ్రీడమ్ బ్రాండ్ నేమ్‌తో వంటనూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్ కంపెనీ ‘జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా’ తాజాగా మసాలా ఉత్పత్తుల తయారీ, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం కోయంబత్తూరుకు చెందిన శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్‌తో కలిసి జీఈఎఫ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ (జేవీ)ను ఏర్పాటు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఈ జేవీలో ఇప్పటికే రూ.70 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ చౌదరి తెలిపారు. ఈ జేవీ ద్వారా భవిష్యత్‌లో ప్లాంట్ ఏర్పాటు కోసం వచ్చే రెండేళ్లలో మరో రూ.50 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ భాగస్వామ్య సంస్థ తొలి ఏడాదిలోనే రూ.100 కోట్ల ఆదాయాన్ని చేరుకోగలదని భావిస్తున్నామని అన్నారు.
వచ్చే ఐదేళ్లలో రెవెన్యూను రూ.1,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడుకు పరిమితమైన అన్నపూర్ణ మసాలా ఉత్పత్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మార్కెట్లకు సైతం విస్తరించనున్నట్లు వెల్లడించారు.
ఏపీలో మసాలా తయారీ ప్లాంట్: రోజుకు వంద టన్నుల తయారీ సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ విజయ్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ కోయంబత్తూరులో రోజుకు 30 టన్నుల తయారీ సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను కలిగి ఉంది.