IT Sector : ఐటీ ఉద్యోగాలకు ‘టెక్’ గండం
ABN , Publish Date - Jan 04 , 2025 | 06:18 AM
ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాల భవిష్యత్ ఆశాజనకంగా కనిపించడం లేదు. కంపెనీలు ఇప్పటికే ఆచితూచి నియామకాలు జరుపుతున్నాయి. గత రెండేళ్లలో ఐఐటీలతో సహా ప్రముఖ

2030 నాటికి కోటి కొలువులు కష్టమే.. కొత్త టెక్నాలజీల్లోనే 20 లక్షల ఉద్యోగాలు
అదనంగా రూ.13 లక్షల కోట్ల టర్నోవర్
క్వెస్ట్ ఐటీ స్టాఫింగ్
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాల భవిష్యత్ ఆశాజనకంగా కనిపించడం లేదు. కంపెనీలు ఇప్పటికే ఆచితూచి నియామకాలు జరుపుతున్నాయి. గత రెండేళ్లలో ఐఐటీలతో సహా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ప్రాంగణ నియామకాలు భారీగా తగ్గాయి. అమెరికా, యూర్‌పల నుంచి మన ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గడం ఇందుకు ఒక కారణమైతే, కృతిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి సరికొత్త టెక్నాలజీలు ఇందుకు మరో కారణం. ప్రస్తుతం భారత ఐటీ రంగం 54 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. 2030 నాటికి ఇది కోటికి చేరుతుందని‘ క్వెస్ట్ ఐటీ స్టాఫింగ్’ అనే సంస్థ గతంలో అంచనా వేసింది. అయితే ఏఐ వంటి టెక్నాలజీల కారణంగా 2030 నాటికి ఇది 75 లక్షలకు మించకపోవచ్చని తన తాజా నివేదికలో తెలిపింది.
మారుతున్న సమీకరణాలు: ఏఐ, ఎంఎల్, ఆటోమేషన్ కారణంగా మన ఐటీ కంపెనీల స్వరూప, స్వభావాలు మారిపోతున్నాయి. కంపెనీలు సాధారణ టెక్ ఉద్యోగుల కంటే జనరేటివ్ ఏఐ, ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్, డేటా సైన్స్, ఆటోమేషన్ వంటి ప్రత్యేక నైపుణ్యాల్లో పట్టు ఉన్న వారి కోసం వెదుకుతున్నాయి. ఈ సంవత్సరం వీరి నియామకాలు 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ చెప్పారు. కాగా 2030 నాటికి ఈ ప్రత్యేక రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, రూ.12.86 లక్షల కోట్ల వ్యాపారం లభించే అవకాశం ఉందని క్వెస్ట్ ఐటీ స్టాఫింగ్ సీఈఓ కపిల్ జోషి అంచనా. అయితే ప్రస్తుతం దేశీయ ఐటీ కంపెనీలకు ఈ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు చాలినంత మంది దొరకడం లేదు. దీంతో కంపెనీలు ఉన్న ఉద్యోగులకే ఈ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ నెట్టుకొస్తున్నట్టు జోషి చెప్పారు. ఈ మార్పులతో భారత ఐటీ పరిశ్రమ ముందు ముందు హై వాల్యూ టెక్ సేవలు, నవ కల్పనలకు కేంద్రంగా మారనుందన్నారు.
బెంగళూరు టాప్
కంపెనీలు, ఉద్యోగాలపరంగా చూస్తే దేశ ఐటీ రంగంలో ఇప్పటికీ బెంగళూరుదే హవా. సరికొత్త టెక్నాలజీ కంపెనీల పరంగా చూసినా బెంగళూరు మిగతా అన్ని నగరాల కంటే ముందుంది. బెంగళూరు తర్వాత ఈ విషయంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్టు క్వెస్ట్ ఐటీ స్టాఫింగ్ తెలిపింది.
‘జీసీసీ’లదే హవా
నిన్న మొన్నటి వరకు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టేవి. ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు (జీసీసీ) ఆ స్థానాన్ని ఆక్రమించాయి. ప్రస్తుతం మన దేశంలోని 1,700 జీసీసీల్లో 19 లక్షల మంది పని చేస్తున్నారు. 2030 నాటికి ఈ కేంద్రాల సంఖ్య 2,200కు, ఉద్యోగుల సంఖ్య 25 నుంచి 28 లక్షలకు పెరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా.