Indian Rupee Fall: రూపాయికి సుంకాల పోటు
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:42 AM
గడిచిన కొన్ని రోజుల్లో భారత కరెన్సీ విలువ తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం మరో 48 పైసలు పతనమై రూ.87.66 వద్ద ముగిసింది. ట్రంప్ సుంకాల పోటు...
క్రమంగా కరుగుతున్న విలువ
రూ.87.66కి మారకం రేటు
త్వరలో రూ.88.50కి చేరిక?
ముంబై: గడిచిన కొన్ని రోజుల్లో భారత కరెన్సీ విలువ తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతోంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం మరో 48 పైసలు పతనమై రూ.87.66 వద్ద ముగిసింది. ట్రంప్ సుంకాల పోటు, మన ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల ఉపసంహరణ, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. గతవారంలోనూ రూపాయి మారకం విలువ 1.2 శాతం పతనమైంది. 2022 డిసెంబరు తర్వాత మన కరెన్సీకిదే అతిపెద్ద వారం రోజుల క్షీణత. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితితోపాటు విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో రాబోయే కాలంలో కూడా రూపాయి బలహీనంగానే ఉండవచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్, కరెన్సీస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అభిప్రాయపడ్డారు. రాబోయే సెషన్లలో డాలర్-రూపీ మారకం రేటు రూ.88.50కి చేరుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తాజా నివేదిక అంచనా వేసింది. అయితే, బలహీనపడుతున్న డాలర్, ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు వంటి అంశాలు కనిష్ఠ స్థాయిల్లో రూపాయికి మద్దతుగా నిలవవచ్చని ఫారెక్స్ వర్గాలు భావిస్తున్నాయి.
యూఎ్‌సతో వాణిజ్య ఒప్పందం ఎప్పుడో.. ?
ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలు ఈ నెల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ దెబ్బతో ఎగుమతులపై 30ు మేర ప్రభావం పడవచ్చని జీటీఆర్‌ఐ అంచనా వేసింది. ఈనేపథ్యంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే సుంకాల పోటు నుంచి కాస్త ఊరట లభించవచ్చని ఎగుమతిదారులు ఎదురుచూస్తున్నారు. కానీ, యూఎస్‌తో ట్రేడ్ డీల్ ఎప్పటి లోగా కుదురుతుందన్న విషయంలో అనిశ్చితి పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. గతనెలలో ఎఫ్‌ఐఐలు మొత్తం రూ.17,400 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈనెల 1న రూ.5,588.91 కోట్లు, 2న రూ.3,366.40 కోట్లు, సోమవారం మరో రూ.2,566.51 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
ఆసియా కరెన్సీల్లోకెల్లా అత్యంత కనిష్ఠ పనితీరు
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ ఏడాది ద్వితీయార్ధంలో మన రూపాయి ఆసియాలోకెల్లా అత్యంత కనిష్ఠ పనితీరు కనబరిచిన కరెన్సీగా మిగిలిపోవచ్చని డాయిష్ బ్యాంక్ భావిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా డాలర్‌తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవనకాల కనిష్ఠానికి జారుకోవచ్చని అంచనా వేసింది. అమెరికా సుంకాల సంబంధిత ప్రతికూలతలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణే రూపాయిపై ప్రధానంగా ఒత్తిడి పెంచుతున్నాయని ఫారెక్స్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి