GST Rate Cut: జోరుగా తయారీ
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:21 AM
జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో ఈసారి పండగ సీజన్‌లో వస్తు గిరాకీ భారీగా పెరగవచ్చని కంపెనీలు ఆశాభావంగా ఉన్నాయి. ఊపందుకోనున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా..
జీఎ్‌సటీ తగ్గించిన నేపథ్యంలో పండగ సీజన్ గిరాకీపై భారీ అంచనాలు
ఉత్పత్తిని 25% వరకు పెంచిన కంపెనీలు
న్యూఢిల్లీ: జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో ఈసారి పండగ సీజన్‌లో వస్తు గిరాకీ భారీగా పెరగవచ్చని కంపెనీలు ఆశాభావంగా ఉన్నాయి. ఊపందుకోనున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కంపెనీలు, ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎలకా్ట్రనిక్ ఉపకరణాల సంస్థలు తయారీని 25 శాతం వరకు పెంచినట్లు తెలిసింది. వస్తువుల తయారీకి అవసరమైన విడిభాగాల సమీకరణను సైతం గణనీయంగా పెంచాయి. తగ్గించిన జీఎ్‌సటీ రేట్లు దుర్గా నవరాత్రుల ప్రారంభ రోజు (ఈ నెల 22) నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పుంజుకోనున్న వస్తు గిరాకీ క్రిస్మస్ వరకు కొనసాగవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. సాధారణంగా కంపెనీలు పండగ సీజన్ కోసం ఆగస్టు-సెప్టెంబరులోనే ఉత్పత్తి పెంచుతాయి. అక్టోబరు-డిసెంబరు కాలంలో తమ పూర్తి తయారీ సామర్థ్యంలో 50-70 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటాయి. అధిక గిరాకీకి అనుగుణంగా సరఫరా చేసేందుకు ఈసారి ఏడాది చివరి వరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 శాతం ఉపయోగించుకోవాల్సి రావచ్చని చాలావరకు కంపెనీలు భావిస్తున్నాయి.
అదే బాటలో ఎలకా్ట్రనిక్ కంపెనీలు
ప్రస్తుతం మార్కెట్లో 32 అంగుళాల కంటే అధిక సైజున్న టీవీలకే డిమాండ్ అధికంగా ఉంది. అన్ని సైజుల టీవీలు, ఏసీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్‌వాషర్లపై జీఎ్‌సటీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో బడా సైజు టీవీల ధరలు కనీసం రూ.2,000 తగ్గవచ్చన్న అంచనాలున్నాయి. కాబట్టి, ఈ పండగ సీజన్‌లో వీటి విక్రయాలు ఊపందుకోవచ్చన్న అంచనాలున్నాయి. భారీ టీవీల స్టాక్‌ను ఇప్పటికే సిద్ధం చేసుకున్న కంపెనీలు వచ్చే 2-3 నెలల్లో భారీగా లబ్ధి పొందనున్నాయని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్‌ఎ్‌స సతీశ్ అన్నారు. 32 అంగుళాల నుంచి అధిక సైజుకు మారాలనుకునే వారి కొనుగోళ్లు భారీగా పెరగవచ్చని, ఈ నేపథ్యంలో 43 అంగుళాలు, ఆపై సైజు టీవీల ఉత్పత్తిని 20 శాతం పెంచినట్లు ఆయన చెప్పారు. జీఎ్‌సటీ తగ్గింపుతో తమ టీవీల ధరలను 8-10 శాతం మేర తగ్గించనున్నట్లు సోనీ ఇండియా తెలిపింది. రేట్ల తగ్గుదలతో డిమాండ్ 10 శాతం మేర పెరగవచ్చని కంపెనీ ఎండీ సునీల్ నయ్యర్ అన్నారు.
ఏసీలకూ డిమాండ్
సాధారణంగా ఏసీల విక్రయాలు ఫిబ్రవరి నుంచి ఊపందుకుంటాయి. వీటిపై జీఎ్‌సటీ గణనీయంగా తగ్గడంతో కస్టమర్లు ఈ పండగ సీజన్‌లోనూ ఏసీ కొనుగోళ్లకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
చిన్న కార్ల తయారీ పెంపు
ప్రస్తుతం అన్ని కార్లపై జీఎ్‌సటీ 28 శాతంగా ఉంది. కాగా, 4 మీటర్లలోపు వాహనాల విభాగంలో 1200 సీసీ వరకు పెట్రోల్ కార్లు, 1500 సీసీ వరకు డీజిల్ కార్లపై జీఎ్‌సటీని 18 శాతానికి తగ్గించారు. దీంతో పండుగ సీజన్‌లో చిన్న కార్లు, హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీల కొనుగోళ్లు అనూహ్యంగా పెరగవచ్చని వాహన తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా కంపెనీలు ఈ మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే పెంచినట్లు తెలుస్తోంది. పన్ను భారం తగ్గడంతో చిన్న, హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాలు 10 శాతం వరకు పెరగవచ్చని, ఈ ఏడాది ఇండస్ట్రీ విక్రయాల వృద్ధి 7-8 శాతానికి పెరగవచ్చని మారుతి సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ అన్నారు. జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణతో కార్ల డిమాండ్ ఒక్కసారిగా పెరగనుందని, అధిక గిరాకీ వచ్చే రెండు నెలలపాటు కొనసాగవచ్చని సిట్రోయెన్ కార్ల విక్రయ కంపెనీ స్టెల్లాంటిస్ ఇండియా ఆటోమోటివ్ బ్రాండ్స్ విభాగ డైరెక్టర్ కుమార్ ప్రియేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి
వార్నీ.. చివరకు నకిలీ టికెట్లు కూడానా.. విషయం ఏంటంటే..
బ్యాంక్ ఉద్యోగిని కొంపముంచిన ఏఐ.. ఇంత మోసమా?..