Stock Market : మార్కెట్లకు ఫిబ్రవర్రీ
ABN , Publish Date - Mar 01 , 2025 | 02:51 AM
ఈక్విటీ మార్కెట్‌కు ఫిబ్రవరి నెల ఒక పీడకలగా మిగిలిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు, అంతర్జాతీయ అస్థిరతల కారణంగా...
ట్రంప్ దెబ్బకు సూచీలు ఢమాల్
గత నెల అంతా ‘బేర్’ పట్టులోనే
సెన్సెక్స్ ఏకంగా 4,300 పాయింట్లు పతనం
రూ.85 లక్షల కోట్ల సంపద హాంఫట్ మదుపరుల కంట రక్తకన్నీరు
ముంబై: ఈక్విటీ మార్కెట్‌కు ఫిబ్రవరి నెల ఒక పీడకలగా మిగిలిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు, అంతర్జాతీయ అస్థిరతల కారణంగా ప్రపంచ మార్కెట్లలో ఆటుపోట్లు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల తరలింపు నేపథ్యంలో ఈక్విటీ సూచీలు భారీ పతనాలు చవి చూశాయి. దేశీయంగా చూసినట్టయితే కార్పొరేట్ల బలహీన ఆర్థిక ఫలితాలు, జీడీపీ గణాంకాలపై నెలకొన్న ఆందోళనలు దీనికి ఆజ్యం పోశాయి. గత నెల 20వ తేదీన ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రారంభమైన బేరిష్ ట్రెండ్ ఫిబ్రవరిలో కూడా కొనసాగింది. సుమారు 40 రోజులుగా ఒకటి రెండు సందర్భాల్లో తప్పితే భారత్ సహా ప్రపంచ మార్కెట్ల ధోరణి ప్రతికూలంగానే ఉంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ప్రధాన సూచీ అయిన సెన్సెక్స్ ఫిబ్రవరిలో 4,300 పాయింట్ల (5.5%) మేరకు నష్టపోయింది. బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.40.6 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మార్కెట్ అంతటినీ పరిగణనలోకి తీసుకుంటే సంపద నష్టం రూ.85 లక్షల కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలంటున్నాయి.
వరుసగా ఐదో నెలా నిఫ్టీ నష్టాల్లోనే
ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ అయితే వరుసగా ఐదో నెల కూడా నష్టాల్లో ముగిసింది. 19 సంవత్సరాల చరిత్రలోనే కనివిని ఎరుగని భారీ నష్టం ఇది. 1996 తర్వాత నిఫ్టీ ఇంత సుదీర్ఘకాలం నష్టాల్లో ట్రేడ్ కావడం ఇదే ప్రథమం. 2024 సెప్టెంబరులో జీవితకాల గరిష్ఠ స్థాయిలకు చేరిన సెన్సెక్స్, నిఫ్టీ తదుపరి ఏర్పడిన కరెక్షన్‌లో 15-16% వరకు నష్టపోయాయి. మార్కెట్లోని ఇతర సూచీలు అంతకన్నా భారీ నష్టాలనే నమోదు చేశాయి. నిఫ్టీ నెక్స్ట్ ఇండెక్స్ 26%, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ 21%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 26-27% నష్టపోయాయి. నిఫ్టీలోని 50 షేర్లలో 30 ఇప్పటికే బేర్ గుప్పిట్లోకి జారుకున్నాయి. నిఫ్టీ షేర్లలో టాటా మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ట్రెంట్, హీరో మోటో కార్ప్ షేర్లు గరిష్ఠ స్థాయిల నుంచి 40% వరకు దిగజారాయి.
ఎఫ్‌పీఐల నిధుల తరలింపు
మార్కెట్ ఇంత భారీగా నష్టపోవడానికి ప్రధాన కారణం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నిధుల తరలింపు. గత రెండు నెలల కాలంలో అంటే 2025 ప్రారంభం నుంచి ఎఫ్‌పీఐలు నికరంగా 1,220 కోట్ల డాలర్లు (రూ.1.06 లక్షల కోట్లు) తరలించుకుపోయారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే రూ.47,349 కోట్లు ఉపసంహరించారు. 2024 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో విక్రయించిన 1,230 కోట్ల డాలర్ల (రూ.1.07 లక్షల కోట్లు) విలువ గల ఈక్విటీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఐదు నెలల కాలంలో వారి అమ్మకాల మొత్తం విలువ 2,450 కోట్ల (రూ.2.13 లక్షల కోట్లు) డాలర్లకు చేరింది.
‘‘పెరిగితే అమ్ముకో’’ వ్యూహం బెటర్
ప్రస్తుతం భారత మార్కెట్ గమనాన్ని పరిగణనలోకి తీసుకుంటే మార్కెట్లో ఏదైనా ర్యాలీ ఏర్పడిప్పుడల్లా అమ్ముకునే వ్యూహం అనుసరించడం మంచిదంటున్నారు. అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో కొంతకాలం పాటు మన మార్కెట్ పరిస్థితి ఇలాగే ఉండవచ్చని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ చీఫ్ ఇన్వె్‌స్టమెంట్ ఆఫీసర్ మహేశ్ పాటిల్ అన్నారు. అయితే ఓవర్‌సోల్డ్ స్థితి కారణంగా అప్పుడప్పుడూ స్వల్ప ర్యాలీలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాబోయే రెండు నెలల కాలంలో ఇన్వెస్టర్ల నుంచి బలమైన కొనుగోళ్ల మద్దతు ఉండకపోవచ్చని ఆయన అన్నారు. దేశంలో స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగుపడే వరకు పెద్దఎత్తున కొనుగోళ్లకు పాల్పడకపోవడం మంచిదని మిరే అసెట్ క్యాపిటల్ మార్కెట్స్ ప్రతినిధి మనీష్ జైన్ సలహా ఇస్తున్నారు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేశీయ సంస్థల కొనుగోళ్లు మార్కెట్‌ను ఆదుకుంటున్నాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సీఈఓ ప్రతీక్ గుప్తా అన్నారు.
22,800 వద్ద నిరోధం
నిఫ్టీకి 22,800 నిరోధ స్థాయి అని నువామా ఆల్టర్నేటివ్స్, ఐఐఎ్‌ఫఎల్ సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత స్థితిలో మరి కొంత దిగజారవచ్చని, ఆ క్రమంలో నిఫ్టీ 21,800 వరకు దిగజారవచ్చని ఐఐఎఫ్ సెక్యూరిటీస్ ప్రతినిధి శ్రీరామ్ వేలాయుధన్ అంచనా. మార్చిలో నిఫ్టీ 22,000-22,900 పాయింట్ల మధ్యన కదలాడవచ్చని నువామా ప్రతినిధి అభిలాష్ పగారియా అంటున్నారు.
ఇది టెక్నికల్ కరెక్షన్ మాత్రమే
అయితే ఇది టెక్నికల్ కరెక్షన్ మాత్రమేనని జెఫ్రీస్ ఈక్విటీ స్ర్టాటజిస్ట్ క్రిస్ వుడ్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అమ్మకాల ధోరణి చూస్తుంటే అవకాశం వచ్చినప్పుడు అమ్మేసుకుని లాభాలు మూటగట్టుకోవాలన్న దురాశ కొందరిదైతే, భవిష్యత్తులో ఏం జరగబోతోందో అన్న భయోత్పాతానికి గురై మరి కొందరు అమ్మకాలకు తెగబడుతున్నారనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మార్కెట్ దిద్దుబాటుకు గురవుతున్న వేగం కారణంగా ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బ తిన్నదని, అదే ఈ అమ్మకాలకు ప్రధాన కారణమని ఆల్కెమీ క్యాపిటల్ ప్రతినిధి అలోక్ అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం మార్కెట్ తిరోగమనం చివరి దశలో ఉన్నదని, ఇప్పటికే మార్కెట్లో లిక్విడిటీ ఆవిరైపోయినందు వల్ల ట్రెండ్ మారే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషణ సంస్థ మెరిసిస్ అంటోంది. వచ్చే 4-6 నెలల కాలంలో బలమైన బౌన్స్‌బ్యాక్‌కు ఆస్కారం ఉన్నదన్నది ఆ సంస్థ విశ్లేషకుల అంచనా.