Share News

ఎఫ్‌డీ ఏం చేద్దాం

ABN , Publish Date - Jun 08 , 2025 | 03:38 AM

ఈసారి ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును ఏకంగా 0.50 శాతం తగ్గించింది. రుణగ్రహీతలకు ఇది శుభవార్తే. రెపో తగ్గింపుతో రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి...

ఎఫ్‌డీ ఏం చేద్దాం

ఆర్‌బీఐ రెపో రేటు కోతలతో డిపాజిట్లపై వడ్డీ ఆదాయం తగ్గుముఖం

ఈసారి ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును ఏకంగా 0.50 శాతం తగ్గించింది. రుణగ్రహీతలకు ఇది శుభవార్తే. రెపో తగ్గింపుతో రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం కూడా తగ్గనుంది. కానీ, డబ్బు పొదుపు చేయాలనుకునే వారికి మాత్రం ఇది ప్రతికూల పరిణామమే. ఎందుకంటే, రెపో కోతతో రుణ రేట్లతో పాటు డిపాజిట్‌ రేట్లూ తగ్గుముఖం పట్టనున్నాయి. అంటే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎ్‌ఫడీ)పై లభించే వడ్డీ ఆదాయం మరింత తగ్గనుంది. ఆర్‌బీఐ ఈ ఫిబ్రవరి, ఏప్రిల్‌లోనూ రెపో రేటులో 0.25 శాతం చొప్పున మొత్తం అర శాతం కోత పెట్టింది. దీంతో ఎఫ్‌డీ రేట్లు ఈ ఫిబ్రవరి నుంచి 0.30 శాతం నుంచి 0.70 శాతం స్థాయిలో తగ్గాయి. కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లతో పాటు పొదుపు ఖాతా (సేవింగ్స్‌ అకౌంట్‌) రేట్లనూ తగ్గించేశాయి. తాజాగా రెపో కోతతో డిపాజిట్లపై వడ్డీ ప్రతిఫలం మరింత తగ్గనుంది. ముఖ్యంగా స్వల్ప, మధ్యకాలిక డిపాజిట్లపై వడ్డీ రేటును గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి..?

వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో ఎఫ్‌డీ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉండే ఆప్షన్లు చాలా పరిమితమే. వడ్డీ రాబడి భారీగా తగ్గకుండా చర్యలు చేపట్టడమే ఉత్తమ వ్యూహం.

త్వరపడండి..

ఆర్‌బీఐ రెపో తగ్గించినప్పటికీ, బ్యాంకులు డిపాజిట్లు రేట్లను తగ్గించేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. కాబట్టి, కొత్తగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకునేవారు త్వరపడటం మేలు. ఇప్పటికీ చాలా బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయ వడ్డీ ఆఫర్‌ చేస్తున్నాయి. 7 శాతం అంతకు పైగా వార్షిక వడ్డీ చెల్లిస్తున్నాయి.


స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు

పెద్ద బ్యాంకులతో పోలిస్తే స్మాల్‌

ఫైనాన్స్‌ బ్యాంకులు మరింత ఆకర్షణీయ వడ్డీని ఆఫర్‌ చేస్తుంటాయి. అయితే, వీటిల్లో డిపాజిట్‌ కూడా కొంత రిస్క్‌తో కూడుకున్నదే. స్వల్పకాలానికి తక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేయవచ్చని, దీర్ఘకాలిక ఎఫ్‌డీలకు మాత్రం బడా బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌ పథకాలే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

కార్పొరేట్‌ ఎఫ్‌డీలు

రిస్క్‌ తీసుకోగలిగే కార్పొరేట్‌ కంపెనీల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లో సొమ్ము జమ చేయడం ద్వారా అధిక వడ్డీ పొందవచ్చు. మీ పొదుపు సొమ్ములో కొంత మొత్తాన్ని 2-3 ఏళ్ల కాలపరిమితితో కూడిన కార్పొరేట్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే, ఉత్తమ రేటింగ్‌ కలిగిన ప్రముఖ కంపెనీల బాండ్లను మాత్రమే ఎంచుకోవాలి.

డెట్‌ ఫండ్లు

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లు, కార్పొరేట్‌, గవర్నమెంట్‌ సెక్యూరిటీలు కూడా మంచి ప్రత్యామ్నాయాలు. స్వల్పకాలిక ఎఫ్‌డీ పథకాల కంటే అధిక రిటర్నులు అందుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఇవన్నీ ఎంతో కొంత రిస్క్‌తో కూడినవే.

దీర్ఘకాలిక డిపాజిట్లు

మీరు పొదుపు చేయబోయే సొమ్ము లేదా రెన్యువల్‌ చేయబోయే ఎఫ్‌డీ ఖాతాలోని సొమ్ముతో ఇప్పట్లో అవసరం లేదనకుంటే.. దీర్ఘకాలానికి డిపాజిట్‌ చేయడం మేలు. దాంతో అధిక వడ్డీ ఆదాయం పొందే వీలుంటుంది.


ఇవీ చదవండి:

మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా లేదా.. లేదంటే రూ.10 వేల పైన్

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2025 | 03:38 AM