Share News

Donald Trump : సుంకాల యుద్ధం మరింత తీవ్రం

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:43 AM

కన్నుకి కన్ను.. పన్నుకి పన్ను. ఇదీ అమెరికా అఽధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నూతన వాణిజ్య విధానం. ‘ఏ దేశంతో ఎంత దోస్తానా ఉన్నా.. వాణిజ్యంలో మాత్రం అది కుదరదు. మా ఉత్పత్తులపై మీరు ఎంత సుంకం విధిస్తే, మీ ఉత్పత్తులపై

Donald Trump : సుంకాల యుద్ధం మరింత తీవ్రం

పరస్పర సుంకాలకు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌

భారత్‌పైనా తీవ్ర ప్రభావం

ఇప్పటికే ‘బేర్‌’మంటున్న స్టాక్‌ మార్కెట్‌

మున్ముందు మరింత డౌన్‌ట్రెండ్‌ ఉండే చాన్స్‌

కన్నుకి కన్ను.. పన్నుకి పన్ను. ఇదీ అమెరికా అఽధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నూతన వాణిజ్య విధానం. ‘ఏ దేశంతో ఎంత దోస్తానా ఉన్నా.. వాణిజ్యంలో మాత్రం అది కుదరదు. మా ఉత్పత్తులపై మీరు ఎంత సుంకం విధిస్తే, మీ ఉత్పత్తులపై మేమూ అంతే (రెసిప్రోకల్‌) సుంకాలు విధిస్తాం. ఇది కూడా కాదని వాణిజ్యేతర రక్షణ విధానాలతో మా ఎగుమతులను కట్టడి చేస్తే, మీ ఎగుమతులపై మేమూ అదే పని చేస్తాం’ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెప్పే ట్రంప్‌.. ఈ పరస్పర సుంకాల విషయాన్ని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మోదీ సమక్షంలోనే ప్రకటించడం విశేషం. ఏప్రిల్‌ 2 నుంచి ఈ కొత్త సుంకాల అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా నూతన వాణిజ్య మంత్రిగా నియమితులైన హోవార్డ్‌ లుట్నిక్‌ ప్రకటించారు.

పరస్పర సుంకాలు అంటే?

ఒక దేశం ఇంకో దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై ఎంత సుంకం విధిస్తుందో, ఆ దేశం నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అవతలి దేశమూ అంతే సుంకం విధించడాన్ని పరస్పర సుంకాలు అంటారు. ఉదాహరణకు అమెరికా నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్స్‌పై చైనా 25 శాతం దిగుమతి సుంకం విధిస్తే, అమెరికా కూడా చైనా నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్స్‌పై అదే స్థాయిలో 25 శాతం దిగుమతి సుంకం విధిస్తుంది. ఇలా చేయకపోబట్టే ఇతర దేశాలు తమ ఉత్పత్తులను చౌకగా అమెరికా మార్కెట్లో కుమ్మరిస్తూ, తమ మార్కెట్లలో మాత్రం అఽధిక సుంకాలు లేదా వాణిజ్యేతర ఆంక్షలతో అమెరికా ఎగుమతులను అడ్డుకుంటున్నాయని ట్రంప్‌ ఆరోపణ. దీనికి చెక్‌ పెట్టాలంటే ఈ సుంకాలు తప్పవని ట్రంప్‌ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అఽధికారం చేపట్టి నెలైనా తిరక్కుండానే అందుకు శ్రీకారం చుట్టారు.


దారికొస్తున్న దేశాలు

ఈ హెచ్చరికలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈయూతో సహా అనేక దేశాలు ‘ట్రంప్‌ మహాశయా, నీతో పెట్టుకోం. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందాం’ అని ఇప్పటికే సంకేతాలు పంపించాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా చైనా కూడా ఏదోలా ట్రంప్‌తో వాణిజ్య ‘సంధి’కే ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కూడా ఇదే పనిలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా నుంచి దిగుమతయ్యే హార్లే డేవిడ్‌సన్‌ బైక్స్‌పై మన దేశం ఇప్పటికే సుంకాలను భారీగా తగ్గించింది. వాణిజ్య లోటు తగ్గించేందుకు మరిన్ని అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతోపాటు పెద్దఎత్తున అమెరికా ఆయుధాలు, చమురు, ఎల్‌ఎన్‌జీ దిగుమతులకూ సై అనబోతోంది.

టెక్స్‌టైల్స్‌

మన వస్త్ర పరిశ్రమ ఎగుమతులకూ అమెరికానే ప్రధాన కారణం. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, బంగ్లాదేశ్‌ పరిణామాలతో అనేక అమెరికా టెక్స్‌టైల్‌ కంపెనీలు మన దేశం నుంచి దిగుమతులు పెంచాయి. ట్రంప్‌ పరస్పర సుంకాలతో దీనికి బ్రేక్‌ పడే ప్రమాదం కనిపిస్తోంది.

ఐటీ ఎగుమతులు

మన ఐటీ ఎగుమతులకూ అమెరికానే అతిపెద్ద మార్కెట్‌. ట్రంప్‌ సుంకాల ప్రభావం నేరుగా మన ఐటీ ఎగుమతులపై ఉండకపోయినా, ఆ ఉద్రిక్తతల ప్రభావం మాత్రం మన ఐటీ పరిశ్రమపై బాగానే ఉంటుంది. ట్రంప్‌ తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెచ్చిన హెచ్‌-1బీ వీసా నిబంధనలు, ఆ దేశంలో మన ఐటీ నిపుణుల ఉద్యోగ అవకాశాలను బాగా దెబ్బతీశాయి. ఇప్పుడు ఈ దుందుడుకు నిర్ణయాల ప్రభావం ఐటీ కంపెనీలపైనా కొద్దో గొప్పో పడక తప్పదు.

స్టీల్‌ పరిశ్రమ

అమెరికా మొత్తం స్టీల్‌ దిగుమతుల్లో మన వాటా 5 శాతానికంటే తక్కువే. అయినా డొనాల్డ్‌ ట్రంప్‌ మన దేశాన్నీ చైనా, కెనడా, మెక్సికో, బ్రెజిల్‌లా ఒకే గాటన కట్టేసి 25 శాతం సుంకం విధించారు. దీంతో టాటా స్టీల్‌, సెయిల్‌, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ వంటి కంపెనీల లాభాలకు ఇప్పటికే గండిపడి స్టాక్‌ మార్కెట్లో ఆ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి. ట్రంప్‌ సుంకాలతో చైనా తన మిగులు స్టీల్‌ను భారత మార్కెట్లోకి డంప్‌ చేసే ప్రమాదం మరింత పెరిగిందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఫార్మా

భారత ఫార్మాకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌. గత ఏడాది మన ఫార్మా కంపెనీలు ఆ దేశానికి దాదాపు రూ.72,300 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి చేశాయి. ఇందులో జెనరిక్‌ మందులదే అత్యధిక వాటా. ఇప్పుడు ఈ సుంకాలతో అమెరికాకు మన ఫార్మా ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. శుక్రవారం నాట్కో, లారస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వంటి దిగ్గజ ఫార్మా కంపెనీల షేర్లు భారీగా నష్టపోవడానికి ట్రంప్‌ సుంకాలే ప్రధాన కారణం.

మనకూ నష్టమే..

ట్రంప్‌ సుంకాల ప్రభావం మన దేశంపైనా పడనుంది. కాకపోతే అది చైనా, జపాన్‌, ఈయూ దేశాలపై ఉన్నంత తీవ్రంగా ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. గత ఏడాది భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 19,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.16.49 లక్షల కోట్లు) చేరింది. ఇందులో దాదాపు 5,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.34 లక్షల కోట్లు) మన దేశానికి మిగులు ఉంది. అమెరికా మొత్తం ఎగుమతి, దిగుమతుల్లో మన వాటా అంతంత మాత్రమే. అయితే మన దేశానికి చెందిన కొన్ని రంగాలు ట్రంప్‌ సుంకాలతో దెబ్బతింటాయని భావిస్తున్నారు. అవేమిటంటే.

Updated Date - Feb 15 , 2025 | 05:43 AM