రిలయన్స్‌కు డబుల్ షాక్
ABN , Publish Date - Mar 05 , 2025 | 06:06 AM
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)కు ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్‌లో...

కంపెనీకి ప్రభుత్వం 2 నోటీసులు జారీ
ఓఎన్‌జీసీ గ్యాస్‌ను తరలించుకున్నందుకు రూ.24,500 కోట్లు కట్టాలని ఆదేశాలు
నిర్దేశిత గడువులోగా బ్యాటరీ సెల్ ప్లాంట్ ఏర్పాటు చేయనందుకు రూ.3 కోట్ల పెనాల్టీ
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)కు ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్‌లో ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీకి చెందిన క్షేత్రాల నుంచి అక్రమంగా గ్యాస్ (సహజవాయువు) ఉత్పత్తి చేసుకున్నందుకు గాను 281 కోట్ల డాలర్లు (దాదాపు రూ.24,500 కోట్లు) చెల్లించాలని రిలయన్స్‌కు మోదీ సర్కారు డిమాండ్ నోటీసు జారీ చేసింది. అంతేకాదు, నిర్దేశిత గడువులోగా బ్యాటరీ సెల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేకపోయినందుకు గాను ఆర్‌ఐఎల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజ్ లిమిటెడ్‌పై భారీ పెనాల్టీని సైతం విధించింది. కేజీ బేసిన్ డీ6 బ్లాక్‌లో రిలయన్స్, దాని భాగస్వామి బీపీ సహజవాయువు, ఇంధన నిక్షేపాల క్షేత్రాలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. రిలయన్స్ తన నిల్వలకు పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ క్షేత్రాల నుంచి కూడా గ్యాస్‌ను అక్రమంగా తరలించుకోవడంతో పాటు వెలికి తీసి, విక్రయించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది. కాగా, ఈ కేసులో రిలయన్స్‌కు అనుకూలంగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు (ఆర్బిట్రేషనల్ ట్రైబ్యునల్) ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు గత నెల 14న తోసిపుచ్చింది. దాంతో రిలయన్స్‌తో పాటు దాని భాగస్వాములైన బీపీ, నికో లిమిటెడ్‌కు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నష్టపరిహారం చెల్లించాలంటూ తాజాగా డిమాండ్ నోటీసు జారీ చేసింది.
అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ విభాగం కోసం ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా 5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ మొదటి మైలురాయుని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేకపోయినందుకు గాను పెనాల్టీ విధిస్తున్నట్లు రిలయన్స్ న్యూ ఎనర్జ్జీకి భారీ పరిశ్రమల శాఖ ఈ నెల 3న నోటీసు పంపింది. ఈ జనవరి 1 నుంచి ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.50 కోట్ల పెర్‌ఫార్మెన్స్ సెక్యూరిటీలో రోజుకు 0.1 శాతం చొప్పున జరిమానా విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు పెనాల్టీ మొత్తం రూ.3.1 కోట్లకు చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..