Share News

హైదరాబాద్‌లో దైచీ లైఫ్‌ జీసీసీ

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:23 AM

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. జపాన్‌ కేంద్రంగా పనిచేసే ప్రముఖ బీమా కంపెనీ దైచీ లైఫ్‌ గ్రూప్‌ ఈ కేంద్రాన్ని...

హైదరాబాద్‌లో దైచీ లైఫ్‌ జీసీసీ

క్యాప్‌జెమినీతో కలిసి ఏర్పాటు

జపాన్‌ వెలుపల సంస్థకిదే తొలి కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. జపాన్‌ కేంద్రంగా పనిచేసే ప్రముఖ బీమా కంపెనీ దైచీ లైఫ్‌ గ్రూప్‌ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ, కన్సల్టెన్సీ దిగ్గజం క్యాప్‌జెమినీ.. దైచీ లైఫ్‌ గ్రూప్‌ కోసం బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (బీఓటీ) పద్దతిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయంగా తన సేవల డిజిటల్‌ మార్పునకు ఈ జీసీసీ ఉపయోగపడుతుందని దైచీ లైఫ్‌ భావిస్తోంది. తన సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌, మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ (ఏఐ), డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ సేవల విస్తృతికి ఈ జీసీసీ నుంచి పనిచేసే ఐటీ, వృత్తి నిపుణులు దోహదం చేస్తారని భావిస్తున్నట్టు దైచీ లైఫ్‌ తెలిపింది. దైచీ లైఫ్‌కు జపాన్‌ వెలుపల ఇదే తొలి కేంద్రం.


క్రమంగా ఇతర దేశాలకు

ప్రారంభంలో ఈ జీసీసీ కేంద్రం సేవలు జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు మాత్రమే పరిమితం. మార్కెట్‌ అవకాశాలు, డిమాండ్‌ను బట్టి హైదరాబాద్‌ జీసీసీ సేవలను ఇతర దేశాలకు విస్తరిస్తామని దైచీ లైఫ్‌ తెలిపింది. జీసీసీల ద్వారా భిన్నమైన అంతర్గత సామర్ధ్యాలు పెంచుకోవాలన్న లక్ష్యానికి క్యాప్‌జెమినీతో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం దోహదం చేస్తుందని దైచీ లైఫ్‌ గ్రూప్‌ సీఈఓ, ప్రెసిడెంట్‌ టెట్సుయ కికుట ఒక ప్రకటనలో తెలిపారు. టెక్నాలజీ, నవకల్పనల మేళవింపు ద్వారా ఖాతాదారులు ఆశించిన దానికంటే ఎక్కువ సంతృప్తిని ఈ జీసీసీ ద్వారా అందిస్తామని క్యాప్‌జెమినీ సీఈఓ ఐమాన్‌ ఇజ్జత్‌ తెలిపారు.


ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 03:23 AM