Stock Market Terminology: స్టాక్ మార్కెట్లో కీలకమైన పదాలు, వాటి అర్థాలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 06:44 PM
స్టాక్ మార్కెట్ వర్గాల నుంచి వినిపించే మాటల్లో 'డెడ్ క్యాట్ బౌన్స్', 'బేర్ మార్కెట్','బుల్ మార్కెట్', 'కేపిట్యులేషన్', 'రెసిషన్', 'బై ద డిప్', '10 ఇయర్ ట్రెజరీ నోట్' వంటివి ఉంటాయి. అసలు వీటి అర్థం మార్కెట్ పరిభాషలో ఏంటన్నది చూద్దాం.
Stock Market Terms: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం భారతదేశంలో గతంతో పోలిస్తే బాగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత తమ నెలవారీ సంపాదనలో కొంతమేర స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే, భవిష్యత్ లో లాభదాయకంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో మంచి కంపెనీల స్టాక్స్ కొనుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ టెర్మినాలజీపై కొంత అవగాహన తెచ్చుకోవడం మంచిదే అవుతుంది. ట్రంప్ టారిఫ్ బెదిరింపుల పుణ్యమాని ప్రస్తుతం ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పదాలపై అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.
మార్కెట్ వర్గాల నుంచి ఇటీవల తరచూ వినిపించే మాటల్లో 'డెడ్ క్యాట్ బౌన్స్', 'బేర్ మార్కెట్','బుల్ మార్కెట్', 'కేపిట్యులేషన్', 'రెసిషన్', 'బై ద డిప్', '10 ఇయర్ ట్రెజరీ నోట్' వంటివి ఉన్నాయి. అసలు వీటి అర్థం మార్కెట్ పరిభాషలో ఏంటన్నది చూద్దాం. వీటికంటే ముందు మార్కెట్లో ప్రతీ రోజు వినిపించే రెండు ముఖ్యమైన మాటలేంటంటే, మార్కెట్ బుల్లిష్ గా ఉందా, బేరిష్ గా ఉందా అంటుంటారు. 'బుల్లిష్' అంటే మార్కెట్ పైకి లేచి లాభాల బాట పట్టడం. 'బేరిష్' మూవ్ అంటే నష్టాల్లోకి పోవడం. ఎందుకు ఈ బుల్లిష్, బేరిష్ మాటలు వచ్చాయంటే, సాధారణంగా బుల్ (ఎద్దు) ఎవరిమీదైనా దాడి చేసేటప్పుడు తన కొమ్ములతో పైకి లేపి కుమ్ముతుంది. అదే.. బేర్ (ఎలుగుబంటి ) దాడి చేసే సమయంలో కిందకి పడేసి దాడిచేస్తుంది. అందుకే మార్కెట్ పెరగడాన్ని బుల్ రన్ అని.. పడిపోతుంటే, బేర్ రన్ అని ప్రాచీన కాలంగా అంటుంటారు. ఇక, మిగతా అంశాలను చూద్దాం.
డెడ్ క్యాట్ బౌన్స్
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగినట్టు మార్కెట్లు ఒక్కసారిగా భారీగా పతనమైతే దానిని (ఫ్రీ ఫాల్) అంటారు. ఈ అనిశ్చితి సమయంలో ఒక్కసారిగా మార్కెట్ పైకి లేస్తే(రీబౌండ్) దానిని "డెడ్ క్యాట్ బౌన్స్" అంటారు. ఇటువంటి సందర్భాలలో మార్కెట్ రికవరీ తాత్కాలికంగా, చిన్నగా మాత్రమే ఉండి తర్వాత మళ్లీ తిరోగమనం బాట పడుతుంది. చనిపోయిన పిల్లి కూడా తగినంత ఎత్తు నుండి పడిపోతే బౌన్స్ అవుతుందనే భావన ఉన్నందున ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి రెండు రోజుల క్రితం ట్రంప్ 90 రోజుల పాటు టారిఫ్స్ పోస్ట్ పోన్ చేస్తున్నారనే ఫేక్ వార్తలు వచ్చాయి. అప్పటికే బాగా కిందపడ్డ అమెరికా మార్కెట్లు ఆ వార్తతో ఒక్కసారిగా లేచాయి. అయితే, అమెరికా అధికార వర్గాలు అది ఫేక్ న్యూస్ అని ప్రకటించడంతో మళ్లీ ఒక్కసారిగా కిందకి పడిపోయాయి. దీనినే డెడ్ క్యాట్ బౌన్స్ అంటారు. (అయితే, ట్రంప్ సర్కారు దానినే నిజం చేసిందనుకోండి).
బేర్ మార్కెట్
అమెరికా వాల్ స్ట్రీట్‌లో లేదా మన దలాల్ స్ట్రీట్ లో లేదా మిగతా ప్రపంచ మార్కెట్లలో ఒక్కసారిగా గణనీయమైన పతనం, అంటే దాదాపు 20 శాతం మేర (అమెరికా డౌజోన్స్, మన నిఫ్టీ, సెన్సెక్స్ ఇలా..) మార్కెట్ సూచీల పాయింట్లు పడిపోతే ఆ పరిస్థితిని బేర్ మార్కెట్ అంటారు. జంతువు నిద్రాణస్థితిలో ఉన్నప్పుడు మార్కెట్ తిరోగమనాన్ని సూచించడానికి కూడా బేర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు.
బుల్ మార్కెట్
బేర్ మార్కెట్ కు పూర్తి విరుద్ధంగా మార్కెట్ పైపైకి వెళ్తుంటే దానిని బుల్ మార్కెట్ అంటారు. మార్కెట్ ర్యాలీ తీసింది అని కూడా అంటుంటారు.
కేపిట్యులేషన్ (లొంగిపోవడం)
మార్కెట్ భారీ నష్టాలతో పయనిస్తున్నప్పుడు పెట్టుబడిదారులు లేదా వ్యాపారులు తాము స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులపై ఆశను కోల్పోయి, తమ నష్టాలను తిరిగి రికవరీ చేసుకోవాలనే ఆలోచనను కూడా వదులుకునే పరిస్థితిని క్యాపిట్యులేషన్ అంటారు. చేసేందేలేక దన్నం పెట్టి ఉన్నదే చాలనుకొని బయటపడ్డమన్నమాట.
రెసిషన్ (మాంద్యం)
మాంద్యం అంటే ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయి నిరుద్యోగం పెరిగే సమయం. ఈ సమయంలో దేశంలోని వ్యవస్థలన్నీ కుదేలైపోవడంతో స్టాక్ మార్కెట్లు కూడా దారుణంగా పడిపోయే అవకాశం ఉంది.
బై ద డిప్
"బై ద డిప్” అంటే మార్కెట్లో గణనీయమైన పతనం తర్వాత భారీ డిస్కౌంట్‌తో స్టాక్‌లను కొనుగోలు చేయడాన్ని 'బై ద డిప్' అంటారు. అయితే, ఒక స్టాక్ ఎంత రేటుకి వస్తే అది డిస్కౌంట్ లో వచ్చిందని భావించడం కష్ట సాధ్యం. సదరు స్టాక్ ధర తర్వాతి రోజుల్లో మరింత పడిపోతే మరింత ఎక్కువ డిస్కౌంట్ లో ఆ స్టాక్ దొరికే అవకాశం ఉంటుంది కదా..
10 ఇయర్స్ ట్రెజరీ నోట్
పదేళ్ల కాలపరిమితితో ప్రభుత్వాలు బాండ్ ల రూపంలో తీసుకునే అప్పుల్ని ట్రెజరీ బాండ్స్ అంటారు. ఒక దశాబ్దం పాటు డబ్బు తీసుకోవడానికి ప్రభుత్వం, లేదా సదరు సంస్థలు చెల్లించే వడ్డీ రేటు. ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్, ఆర్థిక పరిస్థితులకు కీలకమైన సూచిక. అంతేకాదు, ఇది అన్ని రకాల ఇతర రుణాలు, పెట్టుబడులకు ప్రైస్(ధర) నిర్ణయించడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి:
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News