పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి అదానీ
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:14 AM
అదానీ గ్రూప్ పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం థాయ్‌లాండ్ కేంద్రంగా పనిచేసే ఇండోరమా రీసోర్సెస్ లిమిటెట్‌తో కలిసి సంయుక్తం (జేవీ)గా వలోర్ పెట్రోకెమికల్ లిమిటెడ్ (వీపీఎల్) పేరుతో...

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం థాయ్‌లాండ్ కేంద్రంగా పనిచేసే ఇండోరమా రీసోర్సెస్ లిమిటెట్‌తో కలిసి సంయుక్తం (జేవీ)గా వలోర్ పెట్రోకెమికల్ లిమిటెడ్ (వీపీఎల్) పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ జేవీ ఈక్విటీలో అదానీ గ్రూప్, ఇండోరమా కంపెనీకి చెరి సగం వాటా ఉంటుంది. అదానీ పెట్రోకెమికల్స్ అనే కంపెనీ ద్వారా అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ పెట్టుబడి సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లో ఒక రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, స్పెషాలిటీ కెమికల్స్ తయారీ యూనిట్లను రెండు దశల్లో ఏర్పాటు చేస్తారు. ఏటా 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే ఈ పెట్రోకెమికల్ ప్లాంటు కోసం 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.34,000 కోట్లు) వరకు ఖర్చు చేయనున్నట్టు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఇందులో 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే తొలి దశ వచ్చే ఏడాది, ఇంకో 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే రెండో దశ 2027లో పూర్తవుతుంది.