Adani Group : అదానీకి శ్రీలంక సర్కారు షాక్!
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:25 AM
విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంఽధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పిందన్న ఆరోపణలపై అమెరికాలో దర్యాప్తు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు తాజాగా మరో షాక్

విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు?
న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంఽధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పిందన్న ఆరోపణలపై అమెరికాలో దర్యాప్తు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు తాజాగా మరో షాక్ తగిలింది. ఆ ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక కూడా తమ దేశంలో అదానీ గ్రీన్ ఎనర్జీ నిర్మిస్తున్న పవన విద్యుత్ ప్రాజెక్టులపై దర్యాప్తు ప్రారంభించినట్లు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎ్‌ఫపీ కథనం పేర్కొంది. అంతేకాదు, గత ఏడాది మే నెలలో అదానీ గ్రీన్ ఎనర్జీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని శ్రీలంక ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ దేశ విద్యుత్ శాఖ ఉన్నతాధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారని తన కథనంలో వెల్లడించింది. శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని మన్నార్, పూణెరిన్‌లో మొత్తం 484 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఆ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను 20 ఏళ్ల పాటు కొనుగోలు చేసేందుకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
అదంతా అవాస్తవం: అదానీ గ్రూప్ ఈ వార్తలను ఖండించింది. అవి పూర్తిగా తప్పుడు, పక్కదోవ పట్టించే కథనాలేనని తన ప్రకటనలో పేర్కొంది. ‘‘ప్రాజెక్టు పూర్తిగా రద్దు కాలేదు. సాధారణ సమీక్ష ప్రక్రియలో భాగంగా శ్రీలంక ప్రస్తుత ప్రభుత్వం గత సర్కారు హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పంద చార్జీలను పునః సమీక్షించాలని నిర్ణయించింది. శ్రీలంక పునరుత్పాదక రంగంలో 100 కోట్ల డాలర్ల (రూ.8,600 కోట్లు) పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆ దేశ హరిత ఇంధన రంగం, ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే విషయంలో తమ గ్రూప్ కట్టుబడి ఉంద’’ని అదానీ గ్రూప్ అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు.