ఖజానాకు కాసుల గలగల
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:54 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (మార్చి 16 నాటికి) ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 13.13 శాతం వృద్ధితో రూ.21.26 లక్షల కోట్లకు చేరాయి. ముందస్తు పన్ను చెల్లింపులు...
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.21.26 లక్షల కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 13% వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (మార్చి 16 నాటికి) ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 13.13 శాతం వృద్ధితో రూ.21.26 లక్షల కోట్లకు చేరాయి. ముందస్తు పన్ను చెల్లింపులు పుంజుకోవడం ఇందుకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు వాయిదాల్లో ముందస్తు పన్ను వసూళ్లు రూ.10.44 లక్షల కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ.9.11 లక్షల కోట్లతో పోలిస్తే 14.62 శాతం వృద్ధి నమోదైంది. 2024-25 చివరి విడత ముందస్తు పన్ను చెల్లింపుల గడువు శనివారం నాటితో ముగిసింది. ఈ సారి కార్పొరేట్ కంపెనీల ముందస్తు పన్ను చెల్లింపులు వార్షిక ప్రాతిపదికన 12.54 శాతం వృద్ధితో రూ.7.57 లక్షల కోట్లకు, కార్పొరేటేతర ముందస్తు పన్ను చెల్లింపులు 20.47 శాతం వృద్ధితో రూ.2.87 లక్షల కోట్లకు పెరిగాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 208 ప్రకారం.. సంబంధిత ఆర్థిక సంవత్సరానికి రూ.10,000కు పైగా పన్ను చెల్లించాల్సి ఉన్న వ్యక్తులు (వేతనజీవులు సహా) కూడా ముందుస్తుగానే పన్ను చెల్లించాల్సి ఉంటుం ది. 2024 ఏప్రిల్ 1 నుంచి ఆదివారం నాటి (తేదీ 16) వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను సహా మొత్తం కార్పొరేటేతర పన్నుల నికర ఆదాయం 17 శాతం పెరిగి రూ.11.01 లక్షల కోట్లకు చేరింది. కార్పొరేట్ పన్ను నికర రాబడి మాత్రం 7 శాతం వృద్ధితో రూ.9.69 లక్షల కోట్లకు పరిమితమైంది. సెక్యూరిటీ లావాదేవీ పన్నుల నికర ఆదాయం 56 శాతం పెరిగి రూ.53,095 కోట్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.4.60 లక్షల కోట్ల రిఫండ్స్ జారీ చేయడం జరిగింది. కాగా, స్థూల పన్ను వసూళ్లు 16.15 శాతం వృద్ధితో రూ.25.86 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.22.37 లక్షల కోట్లు సమకూరవచ్చని కేంద్రం అంచనా.
4.68 లక్షల మంది
వార్షికాదాయం రూ.కోటి పైనే..
అందులో 43,000 మంది
ఆదాయం రూ.10 కోట్ల పైమాటే..
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తాజా డేటా ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు 9.11 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) సమర్పించారు. అందులో 8.56 కోట్ల రిటర్నుల ఈ-వెరిఫికేషన్ పూర్తయిందని.. రూ.3.92 లక్షల కోట్ల రిఫండ్లు జారీ చేయడం జరిగిందని ఐటీ శాఖ తెలిపింది. కాగా, 4.68 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో రూ.కోటికి పైగా వార్షికాదాయాన్ని వెల్లడించారు. అందులో 43,004 మంది వార్షిక రాబడి రూ.10 కోట్ల పైమాటే.
వార్షికాదాయం పన్ను చెల్లింపుదారులు
రూ.1-5 కోట్లు 3,89,380
రూ.5-10 కోట్లు 36,274
రూ.10 కోట్లకు పైగా 43,004
మొత్తం 4,68,658
ఇవి కూడా చదవండి:
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Gold Silver Rates Today: గుడ్ న్యూస్..రెండో రోజు కూడా తగ్గిన బంగారం, వెండి ధరలు..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News