8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. రేపటి నుంచీ..
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:36 AM
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ అమలు చేయనుంది. అయితే, పూర్తిస్థాయి నోటిఫికేషన్ తరువాతే పెరిగిన శాలరీలు ఉద్యోగులకు అందనున్నాయి. రేపటి నుంచీ ఏరియర్స్ లెక్కింపు ఉంటుందని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు మరింత చేరువైంది. జనవరి 1ని 8వ పే కమిషన్ అమలు తేదీగా ప్రభుత్వం ప్రకటిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లో ప్రధాని నరేంద్ర మోదీ 8వ వేతన కమిషన్ గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. 7వ పే కమిషన్ కాలవ్యవధి నేటితో (డిసెంబర్ 31) ముగియనుంది (8th Pay Commission From 2026 Jan 1).
వాస్తవానికి పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడిన తరువాతే పెరిగిన శాలరీలు ఉద్యోగులకు అందుతాయి. వేతన కమిషన్ ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ఆమోదించాకే తుది నోటిఫికేషన్ వెలువడుతుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, 2027 మే నెల తరువాతే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే, పెరిగిన శాలరీలకు సంబంధించిన ఏరియర్స్‌ను మాత్రం ఈ ఏడాది ప్రారంభం నుంచే లెక్కిస్తారని తెలుస్తోంది. ఏరియర్స్ లెక్కింపు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చాక పెరిగిన శాలరీలు ఎప్పటి నుంచీ అందుతాయనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా శాలరీ పెంపును నిర్ణయిస్తారన్న విషయం తెెలిసిందే. దీని ఆధారంగానే కొత్త బేసిక్ పే నిర్ణయం అవుతుంది. 7వ పే కమిషన్ కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించిన విషయం తెలిసిందే.
తాజా పే కమిషన్ నోటిఫికేషన్ తరువాత ఉద్యోగుల స్థాయిలను బట్టి శాలరీ పెంపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 18 లెవెల్స్‌గా వర్గీకరించారు. గ్రూల్ డీ లేదా లెవెన్ వన్ ఉద్యోగులను ఎంట్రీ లెవెల్ ఉద్యోగులుగా వర్గీకరిస్తారు. 2వ లెవెల్ నుంచి 9వ లెవెల్ వరకూ ఉన్న ఉద్యోగులను గ్రూప్-సీగా పేర్కొంటారు. ఇక లెవెల్స్ 10-12 ఉద్యోగులను గ్రూప్-బీ ఉద్యోగులుగా.. లెవెల్స్ 13-18 మధ్య ఉద్యోగులను గ్రూప్-ఏ ఉద్యోగులుగా పేర్కొంటారు.
ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.15గా ఉంటుందని అనుకుంటే.. లెవెల్-1 ఉద్యోగుల జీతం రూ.20,700 మేర పెరిగే అవకాశం ఉంది. లెవెల్-5 ఉద్యోగుల శాలరీ రూ.33,580 మేర పెరుగుతుంది. ఇక లెవెల్-10 వారి శాలరీ పెంపు రూ.64 వేల వరకూ ఉండే అవకాశం ఉంది. ఇలా గరిష్ఠంగా 18వ లెవెల్ ఉద్యోగుల (కేబినెట్ సెక్రెటరీ, ఇతర సీనియర్ అధికారులు) రూ.2 లక్షల వరకూ శాలరీ పెంపు ఉండే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
కొనసాగుతున్న పసిడి ధరల తగ్గుదల.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! జపాన్‌ను వెనక్కు నెట్టి..