Wealth Migration: భారత్‌ను వీడనున్న 3500 మంది మిలియనీర్లు.. ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టులో వెల్లడి
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:15 PM
ఈ ఏడాది భారత్ నుంచి 3,500 మంది మిలియనీర్లు ఇతర దేశాలకు శాశ్వతంగా తరలిపోనున్నట్టు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు తాజాగా తేల్చింది. అపరకుబేరుల్ని అత్యధికంగా ఆకర్షిస్తున్న దేశాల్లో యూఏఈ ఎప్పటిలాగే నెం.1 స్థానంలో నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది భారత్ నుంచి 3500 మంది మిలియనీర్లు విదేశాలకు తరలిపోనున్నారు. హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ నుంచి ఇలా వ్యక్తిగత సంపద తరలిపోవడం గతేడాదితో పోలిస్తే కాస్త తగ్గినట్టు కూడా నివేదికలో వెల్లడైంది. 2023లో 5,100 మంది మిలియనీర్లు భారత్ నుంచి వెళ్లిపోతారని అంచనా వేశారు. 2024లో 4,300 మంది తరలిపోతారని అప్పట్లో పేర్కొన్నారు
2014 నుంచి 2024 మధ్య కాలంలో భారత్‌లో మిలియనీర్‌ల సంఖ్య 72 శాతం పెరిగిందని హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ అంచనా వేసింది. ఇక మిలియనీర్ల వలస కారణంగా ఈ ఏడాది మొత్తం 26.2 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద దేశం దాటిపోనుంది. స్థూలంగా చూస్తే మాత్రం దేశం విడిచి వెళ్లాలనుకుంటున్న మిలియనీర్‌ల సంఖ్య పెరుగుతోందని నివేదిక తేల్చింది.
కనీసం 1 మిలియన్ డాలర్లను తక్షణం పెట్టుబడి పెట్టగలిగిన వారినే ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 1.42 లక్షల మంది మిలియనీర్లు తమ మాతృదేశాలను వీడనున్నారు. యూకే నుంచి ఈసారి నికరంగా అత్యధిక వ్యక్తిగత సంపద తరలిపోయే అవకాశం ఉంది.
ఈ నివేదిక ప్రకారం, బ్రిటన్ నుంచి ఈసారి ఏకంగా 16,500 మంది మిలియనీర్లు తరలిపోనున్నారు. 7,800 మంది చైనా మిలియనీర్లు దేశాన్ని వీడనున్నారు.
ఇక విదేశీ సంపదను ఆకర్షించడంలో యూఏఈ ఎప్పటిలాగే టాప్‌లో నిలిచింది. ఈ ఏడాది 9,800 మంది మిలియనీర్లు యూఏఈకి తమ మకాం శాశ్వతంగా మార్చనున్నారు. యూఏఈ తరువాతి స్థానంలో అమెరికా ఉంది. ఈ ఏడాది అమెరికాకు 7800 మంది తరలి వెళ్లే అవకాశం ఉంది. బ్రెగ్జిట్‌కు పూర్వం మిలియనీర్లను ఆకర్షించే దేశంగా ఉన్న బ్రిటన్ ఆ తరువాత తన ప్రాభవాన్ని కాస్త కోల్పోయింది. మిలియనీర్ల వలసలకు ప్రధాన కారణం పన్ను సంస్కరణలేనని కూడా ఈ నివేదిక తేల్చింది.
ఇవీ చదవండి:
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు
ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి