Share News

2025-26లో 20,000 నియామకాలు

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:48 AM

వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రాంగణ నియామకాల (క్యాంపస్‌ హైరింగ్‌) ద్వారా 20,000 మందికి పైగా ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోనున్నట్లు దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కంపెనీ నియామకాల...

2025-26లో 20,000 నియామకాలు

ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌ హైరింగ్‌ ప్రణాళిక ఇది..

ఈ క్యూ3లో రూ.6,806 కోట్లకు కంపెనీ లాభం

ఆదాయ వృద్ధి అంచనా 4.5-5 శాతానికి పెంపు

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్రాంగణ నియామకాల (క్యాంపస్‌ హైరింగ్‌) ద్వారా 20,000 మందికి పైగా ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోనున్నట్లు దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కంపెనీ నియామకాల ప్రక్రియ ప్రణాళికకు అనుగుణంగా కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 15,000కు పైగా నియామకాలు చేపట్టనున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల హైరింగ్‌ 20,000కు మించవచ్చ’’ని త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఇన్ఫోసిస్‌ సీఎ్‌ఫఓ జయేశ్‌ సంఘ్రజ్క తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,591 పెరుగుదలతో మొత్తం 3,23,379కి చేరుకుంది. సంస్థలో ఉద్యోగుల సంఖ్య పెరగడం వరుసగా ఇది రెండోసారి. కాగా, క్యూ3లో ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 13.7 శాతానికి పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో అట్రిషన్‌ రేటు 12.9 శాతంగా నమోదైంది.


నికర లాభంలో 11.5 శాతం వృద్ధి

ఈ క్యూ3లో ఇన్ఫోసిస్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 11.46 శాతం వృద్ధి చెంది రూ.6,806 కోట్లకు చేరుకుంది. ఆదాయం 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లుగా నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ వృద్ధి అంచనాను క్యూ2 త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించిన 3.75-4.5 శాతం నుంచి తాజాగా 4.5-5 శాతానికి పెంచింది. వరుసగా మూడు త్రైమాసికాలగా కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాను పెంచుకుంటూ వస్తోంది. నిర్వహణ లాభాల మార్జిన్‌ను మాత్రం గతంలో అంచనా వేసిన 20-22 శాతంగానే కొనసాగించింది. క్యూ3 ఆదాయంలో ఆర్థిక సేవల రంగం నుంచి సమకూరిన వాటా 27.8 శాతంగా ఉండగా.. మాన్యుఫాక్చరింగ్‌ రంగ వాటా 15.5 శాతంగా నమోదైంది. రిటైల్‌, ఎనర్జీ రంగాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాలవారీగా చూస్తే.. భారత్‌, ఐరోపా మార్కెట్ల నుంచి సమకూరిన ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైంది. కంపెనీకి కీలక మార్కెట్‌ అయిన ఉత్తర అమెరికా నుంచి ఆదాయం కేవలం 5 శాతం పెరిగింది.


హెచ్‌1బీ వీసాలపై ఆధారం తగ్గింది..

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక హెచ్‌1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ, తమపై పెద్దగా ప్రభావం ఉండబోదని దేశీయ ఐటీ కంపెనీలంటున్నాయి. గడిచిన కొన్నేళ్లలో హెచ్‌1బీ వీసాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గిందని ఇన్ఫోసిస్‌ సీఎ్‌ఫఓ జయేశ్‌ అన్నారు. అన్నిటికంటే ముందుగా, ఆన్‌సైట్‌లో కంపెనీ హెచ్‌1బీ వీసాపై పనిచేసే వారి నిష్పత్తి గతంలో 30 శాతంగా ఉండగా.. ఇప్పుడది 24 శాతానికి తగ్గిందన్నారు. ప్రస్తుతం అమెరికా ఆన్‌సైట్‌ ప్రాజెక్టుల్లో హెచ్‌1బీ ఇండిపెండెంట్‌ ఉద్యోగుల వాటా 60 శాతానికి మించిందన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 05:48 AM