రూ.173 లక్షల కోట్లు 2024లో ప్రపంచ బిలియనీర్లు పోగేసిన సంపద ఇది..
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:58 AM
గత ఏడాది ప్రపంచ బిలియనీర్ల సంపద 2 లక్షల కోట్ల డాలర్ల (రూ.173 లక్షల కోట్లు) మేర పెరిగి మొత్తం 15 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1,298 లక్షల కోట్లు) చేరుకుందని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయన నివేదిక వెల్లడించింది....
రూ.173 లక్షల కోట్లు 2024లో ప్రపంచ బిలియనీర్లు పోగేసిన సంపద ఇది..
రోజుకు సగటున రూ.49,305 కోట్ల చొప్పున పెరిగిన వెల్త్
రూ.1,298 లక్షల కోట్లకు పెరిగిన వారి మొత్తం ఆస్తులు
2023తో పోలిస్తే మూడింతల వేగంతో పెరిగిన నెట్‌వర్త్
గత ఏడాది నాటికి 2,769కి పెరిగిన ప్రపంచ బిలియనీర్లు
డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో ఆక్స్‌ఫామ్ నివేదిక విడుదల
దావోస్: గత ఏడాది ప్రపంచ బిలియనీర్ల సంపద 2 లక్షల కోట్ల డాలర్ల (రూ.173 లక్షల కోట్లు) మేర పెరిగి మొత్తం 15 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1,298 లక్షల కోట్లు) చేరుకుందని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ అధ్యయన నివేదిక వెల్లడించింది. 2023తో పోలిస్తే ప్రపంచ కుబేరుల ఆస్తి 2024లో మూడింతల వేగంతో వృద్ధి చెందిందని రిపోర్టు పేర్కొంది. 2024లో బిలియనీర్ల నెట్‌వర్త్ రోజుకు సగటున 570 కోట్ల డాలర్ల (రూ.49,305 కోట్లు) మేర పెరుగుతూ వచ్చిందని.. 2023లో ప్రపంచవ్యాప్తంగా 2,565 మంది బిలియనీర్లుండగా.. గత ఏడాదిలో వీరి సంఖ్య 2,769కు పెరిగిందని నివేదిక తెలిపింది. క్రితం సంవత్సరంలో ప్రపంచ టాప్-10 కుబేరుల సంపద రోజుకు సగటున 10 కోట్ల డాలర్ల (రూ.865 కోట్లు) చొప్పున పెరుగుతూ వచ్చిందని..
ఉన్నపళంగా వారు ఆస్తిలో 99 శాతం కోల్పోయినా బిలియనీర్లుగానే కొనసాగుతారని రిపోర్టు పేర్కొంది. కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.8650 కోట్లు) ఆస్తి కలిగిన వారిని బిలియనీరుగా పిలుస్తారు. స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు ప్రారంభ రోజున ఆక్స్‌ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. కుబేరుల సంపదలో భారీగా వృద్ధి చెందుతూ వస్తోన్నప్పటికీ, 1990 నుంచి పేదల సంఖ్యలో తగ్గుదల మాత్రం నామమాత్రంగానే ఉందని రిపోర్టు పేర్కొంది.
ఆక్స్‌ఫామ్ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
గత సంవత్సరం ఆసియా బిలియనీర్ల ఆస్తి 29,900 కోట్ల డాలర్ల (రూ.25.86 లక్షల కోట్లు) మేర పెరిగింది. వచ్చే దశాబ్దకాలంలో కనీసం ఐదుగురు ట్రిలియనీర్లుగా (కనీసం లక్ష కోట్ల డాలర్ల సంపద కలిగిన వారు) అవతరించే అవకాశం ఉంది.
2024లో కొత్తగా 204 మంది బిలియనీర్లుగా అవతరించారు. అంటే, వారానికి సుమారు నలుగురు చొప్పున కొత్తగా ఈ జాబితాలో చేరారు. గత ఏడాది ఆసియా నుంచి 41 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు.
2023లో ఆర్థిక వ్యవస్థ ద్వారా ఉత్తర ప్రపంచంలోని ఒక శాతం సంపన్నులు దక్షిణ ప్రపంచం నుంచి గంటకు 3 కోట్ల డాలర్ల మేర ఆర్జించారు. వలస పాలన విధానం ఎప్పుడో ముగిసిందని చాలా మంది భావించారు. కానీ, దక్షిణ ప్రపంచ దేశాల నుంచి సంపద అధిక శాతం కుబేరులున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ఉత్తర ప్రపంచ దేశాలకు తరలిపోతున్నది.
ప్రపంచ సంపదలో 69 శాతంతోపాటు బిలియనీర్ల సంపదలో 77 శాతం ఉత్తర ప్రపంచ దేశాల వద్దే కేంద్రీకృతమై ఉంది. అంతేకాదు, ప్రపంచ మొత్తం జనాభాలో ఉత్తర దేశాల వాటా 21 శాతమే. కానీ, ప్రపంచ బిలియనీర్లలో 68 శాతం ఈ ప్రాంతానికి చెందినవారే.
ప్రస్తుత బిలియనీర్లలోని 60 శాతం మందికి సంపద వారసత్వం లేదా గుత్తాధిపత్యం లేదా ఆశ్రిత సంబంధాల ద్వారా సమకూరిందే. అంటే, వీరి సంపదలో అధిక శాతం అర్హత లేని ఆర్జనేనని ఇది సూచిస్తుంది. ఆర్థిక అసమానతలను తగ్గించడంతోపాటు ధనికస్వామ్యాన్ని నిరోధించేందుకు సంపన్నులపై మరిన్ని పన్నులు విధించాలి.
బిలియనీర్ల సంపదలో 36 శాతం వారసత్వంగా వచ్చిందే. 18 శాతం గుత్తాధిపత్యం, 6 శాతం అశిత్ర పక్షపాత సంబంధాల ద్వారా సమకూరిందే.
1,000 మందికి పైగా బిలియనీర్లు 5.2 లక్షల కోట్ల డాలర్లకు పైగా తమ సంపదను వచ్చే 2-3 దశాబ్దాల్లో వారి వారసులకు బదిలీ చేయవచ్చని యూబీఎస్ అంచనా వేసింది. ఫోర్బ్స్ అధ్యయనం ప్రకారం.. 30 ఏళ్లలోపు ప్రతి బిలియనీర్‌కు సంపద వారసత్వంగా లభించిందే.
రోజుకు 6.85 డాలర్లు (రూ.593) అంతకంటే తక్కు సంపాదనతో జీవితం వెళ్లదీస్తున్న వారి సంఖ్యలో 1900 నుంచి పెద్ద మార్పేమీ లేదు.