Share News

ఆటో ఎక్స్‌పోలో 100 కొత్త కార్లు విడుదల

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:45 AM

భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. వచ్చే బుధవారం (22వ తేదీ) వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో...

ఆటో ఎక్స్‌పోలో 100 కొత్త కార్లు విడుదల

నేడే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

న్యూఢిల్లీ: భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. వచ్చే బుధవారం (22వ తేదీ) వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో వివిధ కంపెనీలు 100 కొత్త కార్లను విడుదల చేయవచ్చని అంచనా. ఆటోమొబైల్‌ తయారీదారుల నుంచి ఆటోమొబైల్‌ విడిభాగాలు, ఎలక్ర్టానిక్‌ విడిభాగాలు, టైర్లు, ఇంధన స్టోరేజీ వ్యవస్థల తయారీదారులు, ఆటోమొబైల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, మెటీరియల్‌ రీసైక్లింగ్‌ చేసే సంస్థల వరకు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. న్యూఢిల్లీలోని భారత మండపం, ద్వారకలోని యశోభూమి, గ్రేటర్‌ నోయిడాలోని ఢిల్లీ అండ్‌ ఇండియా ఎక్స్‌పో సెంటర్‌ అండ్‌ మార్ట్‌ల్లో సమాంతరంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 5,100 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటాయని భావిస్తున్న ఈ ప్రదర్శనను భారత్‌ సహా ప్రపంచ దేశాలకు చెందిన 5 లక్షల మంది సందర్శించే అవకాశం ఉంది. అలాగే జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియా, తైవాన్‌, యూకే పెవిలియన్లుంటాయి.


ప్రపంచ మార్కెట్లోకి సుజుకీ ఈ-విటారా

జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ చిన్న విద్యుత్‌ కార్ల విభాగంలోకి ప్రవేశించనున్నట్టు తెలిపింది. కంపెనీకి చెందిన తొలి విద్యుత్‌ కారు ఎస్‌యూవీ ఈ-విటారాను ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కారు ఉత్పత్తితో సాధించిన అనుభవాన్ని ఆసరా చేసుకుని భారత్‌ను తమ విద్యుత్‌ కార్ల తయారీ కేంద్రంగా చేయాలనుకుంటున్నట్టు కంపెనీ డైరెక్టర్‌, ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ తెలిపారు. ద్విచక్ర వాహనాల నుంచి కార్ల యజమానులు కావాలనుకుంటున్న వంద కోట్ల మంది జనాభాకు అందుబాటు ధరల్లో చిన్న కార్లు అవసరమన్నారు. అందుకే చిన్న కార్ల విభాగంలో కూడా ఈవీలు తయారుచేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

Updated Date - Jan 17 , 2025 | 05:46 AM