Jagan Meetings: తనదాకా వస్తే..
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:07 AM
మద్యం కుంభకుణంపై ‘సిట్’ దర్యాప్తును తొలుత లైట్‌గా తీసుకున్న జగన్ శిబిరంలో ఇప్పుడు కలవరం మొదలైంది. రాజ్ కసిరెడ్డి మొదలుకుని...
సీనియర్లతో జగన్ వరుస భేటీలు
మిథున్ అరెస్టుతో ఉలికిపాటు
చార్జిషీటులో తన పేరుతో టెన్షన్
సాంకేతిక ఆధారాలతో సిట్ ఉచ్చు
కేడర్‌లో స్థైర్యం నింపడంపై చర్చ
ఫలితమివ్వని నిరసన పిలుపులు
ఎమ్మెల్యేల రాజీనామాకు యోచన
దాంతో లాభం ఉండదన్న నేతలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకుణంపై ‘సిట్’ దర్యాప్తును తొలుత లైట్‌గా తీసుకున్న జగన్ శిబిరంలో ఇప్పుడు కలవరం మొదలైంది. రాజ్ కసిరెడ్డి మొదలుకుని... మిథున్ రెడ్డి వరకు అనేకమంది జగన్ సన్నిహితులు అరెస్టయ్యారు! ప్రాథమిక చార్జిషీట్‌ను చూస్తే ‘తనదాకా రావడమూ’ ఖాయమని జగన్ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... భవిష్యత్ కార్యాచరణ, పార్టీ కేడర్‌లో స్థైర్యం నింపడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీసీనియర్లతో వరుసభేటీలు జరుపుతున్నారు.
పక్కాగా లాగుతున్న సిట్
‘మద్యంలో స్కామే లేదు’ అంటూ జగన్ ఇన్నాళ్లూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే ‘సిట్’ అత్యంత పకడ్బందీగా దర్యాప్తు జరుపుతూ, అనేక సాంకేతిక ఆధారాలతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. తొలి చార్జిషీట్‌లో మాజీ సీఎం జగన్ పేరును ప్రస్తావించారు. దీంతో ఏ క్షణానైనా ఆయనను అరెస్టు చేస్తారన్న అభిప్రాయానికి తాడేపల్లి ప్యాలెస్ వచ్చేసిందని సమాచారం. కేవలం స్టేట్‌మెంట్లతో కేసు నిలబడదంటూ పార్టీ ముఖ్యనేతల నుంచి కార్యకర్తలదాకా జగన్ భరోసా ఇస్తూ వచ్చారు. కానీ, పక్కా సాంకేతిక ఆధారాలతో రాజ్ కసిరెడ్డి నుంచి మిథున్‌రెడ్డి వరకు.. అందరినీ సిట్ అదుపులోకి తీసుకుని జైలుకు పంపించింది. దీంతో జగన్‌లో ధీమా పూర్తిగా సడలిపోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కలవరం మరింత పెరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. జగన్ వైసీపీ స్థాపించిన నాటి నుంచీ ఆయన కుటుంబం జగన్ వెంట నిలిచింది. అందులోనూ... జగన్‌కు మిథున్ రెడ్డి వ్యక్తిగతంగానూ సన్నిహితుడు. మిథున్ అరెస్టుపై పార్టీ నుంచి తగిన స్థాయి స్పందన కనిపించలేదని పెద్దిరెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మిథున్‌కు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా పెద్దగా ఫలితం కనిపించలేదు. చివరికి... పెద్దిరెడ్డికి చెందిన ఉమ్మడి చిత్తూరులోనూ అదే పరిస్థితి. ఈ పరిణామం పరిస్థితి ఇలాగే కొనసాగితే కేడర్‌లో స్థైర్యం దెబ్బతింటుందనే అంచనా ఒకవైపు...‘సిట్’ తనదాకా వచ్చినా ఇంతేనా అనే ఆందోళన మరోవైపు! దీంతో భవిష్యత్ కార్యాచరణపై సీనియర్లతో జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
‘వర్కవుట్ కాదు సర్’
మిథున్ అరెస్టుతో ఆగకుండా ‘సిట్’ మరింత ముందుకు వెళ్లే అవకాశముండటంతో... 11 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని జగన్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ఆలోచనను ఆయన కొందరు ముఖ్యనేతల వద్ద ఉంచారు. అయితే.. ఈప్రతిపాదనను సగం మంది ఎమ్మెల్యేలు తిరస్కరించారని తెలుస్తోంది. ‘‘రాజీనామాలను వెంటనే ఆమోదిస్తారో, లేదో తెలియదు. ఒకవేళ ఆమోదిస్తే ఆరునెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి. గెలిస్తే... మన స్థానాలు మనకు దక్కుతాయి. ఒకటిరెండుచోట్ల ఓడితే...ఉన్న పరువూ పోతుంది. ఈ వ్యూహం సరికాదు’’ అని జగన్‌కు స్పష్టంచేసినట్లు తెలిసింది. ఇక... ఎప్పుడు పిలుపు ఇచ్చినా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు సిద్ధం కావాలని మండలస్థాయి నేతలకు ఇప్పటి నుంచే ఆదేశాలువెళ్తున్నట్లు సమాచారం. ఒకవేళ... జగన్‌ను అరెస్టు చేస్తారనేఅంచనాతో ఇప్పటి నుంచే ‘ఆందోళనలకు సిద్ధం’ చేస్తున్నట్లు చెబుతున్నారు.
పనిచేయని ‘పిలుపులు’
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. ఫీజు పోరు, రైతుపోరు, నిరుద్యోగ పోరు, ఆరోగ్యశ్రీ బిల్లుల సమస్య వంటి వాటిపై జగన్ పిలుపు ఇచ్చిన నిరసన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఇంటింటికీ వెళ్లాలని పార్టీ శ్రేణులను జగన్ ఆదేశించారు. అయితే.. ఇప్పటిదాకా ఇంటింటికీ వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారంచేసే కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టలేకపోతోంది. జిల్లా కేంద్రాల్లో ఫంక్షన్‌హాల్‌లో మీటింగ్ పెట్టుకుని నాయకులు చేసే ఉపన్యాసాలకే ఈ కార్యక్రమం పరిమితమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News