Share News

Vidadala Rajini: 50 కోట్లు రూ.5 కోట్లు ఇస్తారా.. ఫైన్‌ కడతారా?

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:23 AM

వైసీపీ నేత విడదల రజని, ఆమె మరిది గోపి, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కలిసి ఒక స్టోన్‌ క్రషర్ యజమానికి రూ.5 కోట్లు డిమాండ్‌ చేసి బెదిరించారని ఏసీబీ తెలిపింది. వ్యాపారి రూ.2 కోట్లు చెల్లించి, మరిన్ని డిమాండ్లతో ఒత్తిడి చేసిన కేసు ప్రకారం, గోపిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Vidadala Rajini: 50 కోట్లు రూ.5 కోట్లు ఇస్తారా.. ఫైన్‌ కడతారా?

స్టోన్‌ క్రషర్‌ యజమానికి రజని బెదిరింపు

వదిన తరఫున ఒత్తిడి పెంచిన మరిది విడదల గోపి

రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ వెల్లడి

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘మీరు ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలంటే నాకు 5కోట్లు ఇవ్వండి.. లేదంటే 50 కోట్లు జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని స్టోన్‌ క్రషర్‌ యజమాని చలపతిరావును బెదిరించినట్లు న్యాయస్థానానికి ఏసీబీ తెలియజేసింది. తన మరిది విడదల వేణుగోపీనాథ్‌ అలియాస్‌ గోపి, నాటి ప్రాంతీయ విజిలెన్స్‌ అధికారి పల్లె జాషువా(ఐపీఎస్‌), పీఏ రామకృష్ణ ద్వారా అధికార దుర్వినియోగానికి, బెదిరింపులకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో మూడో నిందితుడైన గోపిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచిన ఏసీబీ అధికారులు.. రిమాండ్‌ రిపోర్ట్‌ కూడా సమర్పించారు. ‘చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన విడదల రజని తన నియోజకవర్గంలోని యడ్లపాడు వద్ద స్టోన్‌ క్రషర్‌ నిర్వహిస్తున్న చలపతిరావును 2020 సెప్టెంబరు 4న రూ.5కోట్లు డిమాండ్‌ చేశారు. తాను సక్రమంగా వ్యాపారం చేస్తున్నానని, అన్యాయంగా 5కోట్లు చెల్లించలేనని వ్యాపారి స్పష్టంచేశారు. డబ్బులు ఇవ్వకుంటే వ్యాపారం మూసేసుకోవాలని రజని తరఫున మరిది గోపి హుకుం జారీ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ సైతం ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టాడు.


ఈ క్రమంలో రజని అప్పటి గుంటూరు విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి పల్లె జాషువాను రంగంలోకి దించి తనిఖీల పేరుతో హడలెత్తించారు. విజిలెన్స్‌ ఉన్నతాధికారులకు చెప్పకుండా, ఎలాంటి అనుమతీ తీసుకోకుండా జాషువా తనిఖీల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దిక్కుతోచని స్థితిలో క్రషర్‌ వ్యాపారి రూ.2 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. 2021 మార్చిలో రజని ఇంటికెళ్లి గోపి చేతికి ఆ మొత్తం నగదు అందజేశారు. డబ్బు అందిందని రజనికి గోపి ఫోన్‌చేసి నిర్ధారించారు. ఆ తర్వాత తమకు కూడా చెరో పది లక్షలు ఇవ్వాలని చలపతిరావును గోపి, జాషువా డిమాండ్‌ చేశారు. దీంతో వారికి నగదు రూపంలో చెల్లించారు. విషయం ఎక్కడ చెప్పినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటావని గోపి, జాషువా బెదిరించడంతో చలపతిరావు మిన్నకుండిపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం నివేదిక అందిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీబీని ఆదేశించింది. కేసు నమోదు చేసిన ఏసీబీ... ప్రాథమిక దర్యాప్తు చేసి విడదల గోపి బెదిరింపులపై ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌లో ఉన్న అతడిని అరెస్టు చేశారు’ అని రిమాండ్‌ రిపోర్టులో వివరించారు.


ఏసీబీ కస్టడీ, గోపి బెయిల్‌ పిటిషన్లపై 28న విచారణ

విజయవాడ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): విడదల రజని మరిది గోపిని వారంపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన వసూలు చేసిన డబ్బులు ఏయే మార్గాల్లో ఎవరెవరికి చేరాయో తేల్చడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంకోవైపు.. జైలులో ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని గోపి కోర్టును కోరారు. ఆయన తరఫున న్యాయవాది మన్మఽథరావు పిటిషన్‌ వేశారు. రెండు పిటిషన్లపై విచారణను ఏసీబీ న్యాయస్థానం ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.


అరెస్ట్‌ నుంచి విడదల రజినికి రక్షణ

విజిలెన్స్‌ తనిఖీ పేరుతో స్టోన్‌ క్రషర్‌ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని నమోదైన కేసులో మాజీ మంత్రి విడదల రజిని, ఆమె పీఏ రామకృష్ణకు అరెస్ట్‌ నుంచి హైకోర్టులో ఉపశమనం లభించింది. వీరిద్దరికి బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 35(3)(సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ)) కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని, కేసుకు సంబంధించిన విషయాలను బయట మాట్లాడవద్దని పిటిషనర్లకు షరతులు విధించింది. దర్యాప్తునకు ఆటంకం కలిగించవద్దని, సాక్షులను ప్రభావితం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. వారం రోజుల్లో నివాస వివరాలను అఫిడవిట్‌ రూపంలో దర్యాప్తు అధికారికి అందజేయాలని పేర్కొంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విడదల రజిని మరిది గోపిని పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపఽథ్యంలో ఆయన వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను నిరర్ధకమైనదిగా ప్రకటించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్లను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు. విజిలెన్స్‌ తనిఖీ పేరుతో తనను బెదిరించి రూ.2.20కోట్లు అక్రమంగా వసూలు చేశారని పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజి స్టోన్‌ క్రషర్‌ మేనేజింగ్‌ పార్ట్నర్‌ నల్లపనేని చలపతిరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విడదల రజిని, మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 05:31 AM