Share News

YSJagan: పాదయాత్ర చేస్తా

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:58 AM

యువజన విభాగాన్ని, వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల్లో పర్యటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో పర్యటన తర్వాత మళ్లీ పాదయాత్ర చేపడతానని ప్రకటించారు.

YSJagan: పాదయాత్ర చేస్తా

  • కడప జిల్లా టూర్‌ తర్వాత మొదలెడతా..

  • వైసీపీ బలోపేతానికి జిల్లాల్లో పర్యటన: జగన్‌

  • యువజన విభాగానికి జోన్ల వారీగా వర్కింగ్‌ ప్రెసిడెంట్లు

అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): యువజన విభాగాన్ని, వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల్లో పర్యటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో పర్యటన తర్వాత మళ్లీ పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. మంగళవారం తాడేపల్లి ప్యాలె్‌సలో యువజన విభాగం నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. యువజన విభాగంలో ఉన్నవారంతా సోషల్‌ మీడియాలో ఎన్‌రోల్‌ కావాలని సూచించారు. ప్రజలకు.. వ్యక్తిగతంగా జరిగే అన్యాయాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టాలన్నారు. యువజన నేతల చేతిలో సెల్‌ఫోనే ఒక ఆయుధమని చెప్పారు. వైసీపీలో యువ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారంటూ.. వారికే యువజన విభాగం బాధ్యతలు అప్పగిస్తానని ప్రకటించారు. అంతలోనే దిద్దుకుని.. మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది యువకులేనని.. వారికి అప్పగిస్తానని అన్నారు. ఈ విభాగానికి ఉత్తరాంధ్ర, కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి, రాయలసీమ.. ఇలా జోన్లవారీగా వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమిస్తున్నట్లు చెప్పారు. కడప లోక్‌సభ ఉప ఎన్నికలో తాను5.45 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచానని.. దాంతో కాంగ్రెస్‌ తనపై పగపట్టిందని జగన్‌ వ్యాఖ్యానించారు. 2011లో పార్టీని స్థాపించినప్పుడు తనతో పాటు అమ్మ (విజయలక్ష్మి) మాత్రమే తోడుగా వచ్చిందన్నారు. అప్పట్లో ఎవరూ లేరని.. క్రమంగా పార్టీని బలోపేతం చేశానని చెప్పుకొచ్చారు.

Updated Date - Jul 02 , 2025 | 04:00 AM