Share News

YS Vijayamma: జగన్‌, భారతి ఆరోపణలు ఖండిస్తున్నా

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:39 AM

బాధాతప్త హృదయంతో కౌంటర్‌ దాఖలు చేస్తున్నాను. జగన్‌, భారతి పేర్కొంటున్న విషయాలు నిరాధారం, సదరు ఆరోపణలు న్యాయసమీక్షకు నిలువవు’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు.

YS Vijayamma: జగన్‌, భారతి ఆరోపణలు ఖండిస్తున్నా
YS Jagan, Bharati, Vijayamma

  • రాజకీయ ఉద్దేశాలు, కారణాలతోనే జగన్‌ కేసు వేశారు

  • ఎన్‌సీఎల్‌టీలో తల్లి విజయలక్ష్మి కౌంటర్‌.. చెల్లెలు షర్మిలారెడ్డి కూడా..

  • ఎంవోయూ ప్రకారమే సరస్వతి షేర్ల బదలాయింపు

  • కుటుంబ ఒప్పందంలో ఎన్‌సీఎల్‌టీ జోక్యం తగదు

  • పిల్లల మధ్య వివాదంతో కోర్టు గదిలో

  • నిలబడాల్సి రావడం కలచివేస్తోంది

  • బాధతోనే కౌంటర్‌ వేస్తున్నా: విజయలక్ష్మి

  • అంతా చట్టప్రకారమే జరిగింది: షర్మిల

  • తదుపరి విచారణ మార్చి 6కి వాయిదా

అమరావతి/హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘నా కుమారుడు జగన్‌, కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను. నా పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలచివేస్తోంది. బాధాతప్త హృదయంతో కౌంటర్‌ దాఖలు చేస్తున్నాను. జగన్‌, భారతి పేర్కొంటున్న విషయాలు నిరాధారం, సదరు ఆరోపణలు న్యాయసమీక్షకు నిలువవు’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు. కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న కుటుంబ ఒప్పందంలో.. జాతీయ కంపెనీ చట్ట ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) జోక్యం చేసుకోజాలదని ఆమె, జగన్‌ చెల్లెలు షర్మిలారెడ్డి తెలిపారు. ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌లో జోక్యం చేసుకునే అధికారం దానికి లేదన్నారు. కుటుంబ వివాద పరిష్కారాలు ట్రైబ్యునల్‌ పరిధిలోకి రావని పేర్కొన్నారు. తనకు తెలియకుండా సరస్వతి పవర్‌ షేర్లను తన తల్లి, చెల్లి బదిలీ చేసుకున్నారని.. సదరు బదిలీని రద్దు చేసి తన పేరిట, తన భార్య భారతి, తమ కంపెనీ క్లాసిక్‌ రియాల్టీ పేరిట 51.01 శాతం వాటాలు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని పేర్కొంటూ జగన్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేసిన విషయం విదితమే. ఆ షేర్లను తన తల్లికి గిఫ్టుగా ఇచ్చానని.. వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చని అందులో పేర్కొన్నారు.


సరస్వతి పవర్‌ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాను గిఫ్ట్‌గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించడం చట్టవిరుద్ధమన్నారు. ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరారు. అయితే రాజకీయ ఉద్దేశాలు, కారణాలతోనే జగన్‌ ఎన్‌సీఎల్‌టీలో తప్పుడు కేసు వేశారని విజయలక్ష్మి, షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ట్రైబ్యునల్‌లో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. జగన్‌ పిటిషన్‌కు ఇద్దరూ 38 పాయింట్లతో ఘాటుగా సమాధానాలిచ్చారు. కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చారని తెలిపారు. సొంత బిడ్డలపైనే ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేయాల్సి రావడం తన గుండెను పిండేసిందని విజయలక్ష్మి పేర్కొన్నారు. 2019 ఆగస్టు 31వ తేదీన కుటుంబం మధ్య జరిగిన ‘మెమోరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌(ఎంవోయూ)’ మేరకే సరస్వతి పవర్‌ షేర్ల బదలాయింపు జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎంవోయూలో ఎన్‌సీఎల్‌టీ జోక్యం చేసుకోజాలదన్నారు. షేర్ల బదలాయింపు అంతా చట్టప్రకారమే జరిగిందని వెల్లడించారు. ఎన్‌సీఎల్‌టీని తప్పుదారి పట్టించేలా జగన్‌ రాజకీయ ప్రేరిత వ్యాజ్యం వేశారని తల్లీ కుమార్తెలు పేర్కొన్నారు. వాటాల బదలాయింపుపై ఆయన చేస్తున్న ‘క్లెయిమ్‌’ అంతా తప్పేనని తెలిపారు. ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేలా పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. చట్టబద్ధంగా జరిగిన ఎంఓయూపై వాస్తవాలు వివరిస్తూ తాము పొందుపరచిన సాక్ష్యాధారాలను పరిశీలించి.. ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌సీఎల్‌టీని వారు అభ్యర్థించారు.


ట్రైబ్యునల్‌ విచారణ మార్చి 6కి వాయిదా

కాగా.. జగన్‌ పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ సోమవారం విచారణ జరిపింది. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది, వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎస్‌.నిరంజన్‌రెడ్డి వర్చువల్‌గా హాజరై వాదనలు వినిపించారు. కౌంటర్లు దాఖలు చేయాలని విజయలక్ష్మి, షర్మిల తదితర ప్రతివాదులకు గత ఏడాది సెప్టెంబరులోనే నోటీసులు జారీచేసినప్పటికీ.. ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని పేర్కొన్నారు. అందరూ కౌంటర్లు సమర్పిస్తే తాము రిజాయిండర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. విజయలక్ష్మి, షర్మిల తదితరుల తరఫున న్యాయవాది విశ్వరాజ్‌ వాదనలు వినిపించారు. ఆన్‌లైన్‌లో తాము కౌంటర్లు దాఖలు చేశామని.. ఒకట్రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్‌.. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.


Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?

Updated Date - Feb 11 , 2025 | 09:13 AM