YS Sharmila: భారతీరెడ్డిపై వ్యాఖ్యలు బాధాకరం
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:39 AM
వైఎస్ భారతీరెడ్డిపై సోషల్ మీడియాలో చేసిన అసభ్య వ్యాఖ్యలు బాధాకరమని, అవి తీవ్రవాదానికి సమానమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఈ సంస్కృతికి వైసీపీ, టీడీపీలు ఆదర్శమని అన్నారు

వైసీపీ పెంచి పోషించిన కాలకేయులే వ్యవస్థను భ్రష్టు పట్టించారు
ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం
ఈ సైకోగాళ్లను నడిరోడ్డుపై ఉరి తీయాలి
‘సైతాన్ సైన్యానికి’ జగన్ పార్టీ, టీడీపీనే ఆదర్శం: షర్మిల
అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్ భారతీరెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైౖకోగాళ్లను నడిరోడ్డుమీద ఉరితీసినా తప్పులేదు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వైసీపీ హయాంలో తనపై జరిగిన దాడిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు. అన్యం, పుణ్యం ఎరుగని పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలూ ముందుకు రావాలి’ అని షర్మిల కోరారు. రేటింగ్స్ కోసం ఎంటర్‌టైన్ చేసే యూట్యూబ్ చానెళ్లపై కఠిన చర్యలు ఉండాలన్నారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని, ఏ పార్టీవాళ్లయినా, ఎంతటి వాళ్లయినా శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థకు, విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీనే అని తేల్చిచెప్పిన షర్మిల.. అసభ్యపోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఆ రెండు పార్టీలే ఆదర్శమని అన్నారు.