Share News

తప్పులతడక

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:17 AM

గ్రామ పంచాయతీల్లో ఆర్థికపరమైన అంచనాలు తయారు చేసేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గ్రామస్వరాజ్య పోర్టల్‌ ఇక్కట్లపాల్జేస్తోంది. గతంలో ఉన్న గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(పీఆర్‌ వన్‌యాప్‌)లో కొద్దిపాటి మార్పులు చేసి ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తుంటే తీసుకోవడంలేదు. ఏ పద్దుకు, ఎంత నిధులు కేటాయించాలనే అంశంపై వివరాలు నమోదు చేస్తుంటే అన్ని వివరాలు పారిశుధ్యానికి సంబంధించిన కాలమ్‌లోకి వెళ్లి పోతున్నాయి. ఈ పోర్టల్‌ తప్పులతడకగా ఉందని, సరిచేయాలని పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

తప్పులతడక

- ఈ-గ్రామస్వరాజ్య పోర్టల్‌లో సాంకేతిక లోపాలు

- గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక వివరాల నమోదుకు ప్రభుత్వం ఆదేశం

- ఈ ఏడాది జనవరి 31నాటికి పూర్తి చేయాలని ఉత్తర్వులు

- పీఆర్‌ వన్‌యాప్‌లోని వివరాలు నమోదు చేస్తుంటే మారిపోతున్న విభాగాలు

- ఇబ్బందులు పడుతున్న సిబ్బంది.. సమస్య పరిష్కరించాలని అధికారులకు వినతి

గ్రామ పంచాయతీల్లో ఆర్థికపరమైన అంచనాలు తయారు చేసేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గ్రామస్వరాజ్య పోర్టల్‌ ఇక్కట్లపాల్జేస్తోంది. గతంలో ఉన్న గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(పీఆర్‌ వన్‌యాప్‌)లో కొద్దిపాటి మార్పులు చేసి ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేస్తుంటే తీసుకోవడంలేదు. ఏ పద్దుకు, ఎంత నిధులు కేటాయించాలనే అంశంపై వివరాలు నమోదు చేస్తుంటే అన్ని వివరాలు పారిశుధ్యానికి సంబంధించిన కాలమ్‌లోకి వెళ్లి పోతున్నాయి. ఈ పోర్టల్‌ తప్పులతడకగా ఉందని, సరిచేయాలని పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

ఏటా గ్రామపంచాయతీలకు వచ్చే ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తారు. పంచాయతీల్లో ఇంటి పన్నులు, చెరువులు, పచ్చగడ్డి వేలం పాటలు, కాలువల్లో వలకట్ల రూపంలో వచ్చే ఆదాయం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లపై వచ్చే అద్దె తదితర ఆదాయ మార్గాలను అనుసరించి పంచాయతీల్లో ఆయా విభాగాలకు 10 నుంచి 15శాతం అదనంగా కేటాయింపులు పెంచి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తారు. ఈ ఏడాది గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించి.. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గ్రామ స్వరాజ్య పోర్టల్‌లో ఈ వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీల్లో చేపట్టే పనులు, నిధుల కేటాయింపుపై ప్రత్యేక ప్రణాళికను తయారు చేసేందుకు షెడ్యూలును పంచాయతీరాజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది జనవరి 5వ తేదీన పంచాయతీల ఆదాయ వనరుల అంచనాలను రూపొందించి, డ్రాప్ట్‌ విడుదల చేయాలని ఆదేశించారు. అదేరోజు తొలివిడత గ్రామసభలను కూడా నిర్వహించాలని సూచించారు. వీటిని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి అనుసంధానంగా ఉండే పీఆర్‌ వన్‌యాప్‌లో జనవరి 6న ఈ వివరాలను అప్‌లోడ్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 10లోగా మార్పులు, చేర్పులు చేసి తుది నివేదికను ఆప్‌లోడ్‌ చేయాలని సూచించారు. 10 నుంచి 20వ తేదీ వరకు పంచాయతీల్లో రికార్డు అసిస్టెంట్‌లు, సర్పంచ్‌లు, ఈవోలు, ఇతర సిబ్బందికి ఈ అంశంపై శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. పీఆర్‌వన్‌ యాప్‌లో నమోదు చేసిన వివరాలను జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు మండల, డివిజన్‌, జిల్లాస్థాయి అధికారులు పరిశీలించాలని సూచించారు. జనవరి 28లోగా రెండో సారి గ్రామసభలను నిర్వహించి ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసి, పూర్తి వివరాలను పీఆర్‌ వన్‌యాప్‌లో ఆప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ విభాగం నూతనంగా రూపొందించిన నివేదికలను ఈ-గ్రామ స్వరాజ్య పోర్టల్‌లో జనవరి 31న ఆప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు జారీచే శారు.

నమోదులో ఇబ్బందులు

గ్రామ పంచాయతీల్లో రూపొందించిన అంచనాలను ఈ-గ్రామ స్వరాజ్య పోర్టల్‌లో నమోదు చేసేందుకు పంచాయతీల్లో పనిచేసే సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తుంటే అన్నీ తప్పుల తడకలుగా ఉండి సకమ్రంగా నమోదు కావడంలేదు. ఉదాహరణకు పంచాయతీలకు వచ్చే ఆదాయంలో 30శాతం నిధులను సిబ్బంది జీతభత్యాలకు కేటాయిస్తారు. 15శాతం నిధులను తాగునీటి అవసరాల కోసం, 15శాతం నిధులను రహదారుల అభివృద్ధికి, 10శాతం నిధులను విద్యుత బిల్లులకు, కార్యాలయాల నిర్వహణ, ఇంటర్‌నెట్‌ వాడకం, స్థానికంగా ఉన్న ఇతరత్రా అవసరాల మేరకు కేటాయింపుల చేస్తారు. పీఆర్‌ వన్‌యాప్‌లోని వివరాలను ఈ-గ్రామ స్వరాజ్య పోర్టల్‌లో ఇచ్చిన ఫార్మట్‌లో నమోదు చేస్తుంటే అన్నీ పారిశుద్ధ్యం విభాగం కాలమ్‌లో నమోదు అవుతున్నాయి. దీంతో ఈ ప్రక్రియ జనవరి 31వ తేదీ నుంచి నిలిచిపోయింది.

మార్చి వచ్చేస్తోందని ఆందోళన

ఈ-గ్రామస్వరాజ్య పోర్టల్‌లో సంబంధిత వివరాలను నమోదు చేయడంలో పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతోపాటు, అందులో నెలకొన్న సాంకేతిక సమస్యలను సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ఇదే పద్ధతిలో ఫిబ్రవరి నెల మొత్తం గడచిపోయిందని చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో పంచాయతీలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఫ్రీజింగ్‌ విధిస్తారని పంచాయతీరాజ్‌ విభాగం అధికారులు అంటున్నారు. తప్పులు సరిదిద్దకుండా మార్చి నెలాఖరులోగా ఈ-గ్రామ స్వరాజ్య పోర్టల్‌లో అన్ని వివరాలను నమోదు చేయడానికి అవకాశం ఉండదని పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది, అధికారులు చెబుతున్నారు. నూతన ఆర్థిక సంవత్సరంలో ఈ పనులు ఎప్పటికి పూర్తి చేయాలి, ఎప్పటికి పంచాయతీల్లో పాలన గాడినపడుతుందనే అంశంపై పంచాయతీరాజ్‌ విభాగం అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 01:17 AM