Share News

CM Chandrababu Naidu: మీ కలలకు మా రెక్కలు

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:07 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేందుకు వచ్చే ఏడాది విద్యార్థి ఆవిష్కర్తల భాగస్వామ్య సదస్సు (స్టూడెంట్స్‌ ఇన్నోవేటర్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ సమిట్‌....

CM Chandrababu Naidu: మీ కలలకు మా రెక్కలు

  • ఆవిష్కర్తలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.. వచ్చే ఏడాది సదస్సు

  • మంచి ఆలోచనలకు అవార్డులు

  • ఉన్నత విద్యకు కొత్త పథకం ‘కలలకు రెక్కలు’

  • విదేశీ విద్యకు పావలా వడ్డీకి రుణాలు

  • ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు

  • ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం

  • విద్యారంగంలో లోకేశ్‌ మార్పులు

  • మూడేళ్లలో విప్లవాత్మక ఫలితాలు

  • గతంలో విద్యారంగంపై రాజకీయ నీడ

  • మెగా పీటీఎంలో చంద్రబాబు వెల్లడి

  • బడిని బాగుచేద్దాం.. లోకేశ్‌ పిలుపు

శనివారం నో బ్యాగ్‌ డే అమలు చేస్తున్నాం. నేను ఊహించిన దానికంటే విద్యావిధానం ఎంతో మెరుగ్గా ఉంది. పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా చదువుల్లో రాణిస్తున్నారు. మట్టిలో మాణిక్యాలకు సరైన మార్గనిర్దేశం చేస్తే ఏదైనా సాధించగలరనే నమ్మకం ఉంది.

- సీఎం చంద్రబాబు

పార్వతీపురం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేందుకు వచ్చే ఏడాది విద్యార్థి ఆవిష్కర్తల భాగస్వామ్య సదస్సు (స్టూడెంట్స్‌ ఇన్నోవేటర్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ సమిట్‌- ఎస్ఐపీఎస్)ను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. పిల్లల ఆలోచనలు బాగుంటే వారి ప్రతిభను గుర్తించి రివార్డులు అందిస్తామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఏపీ మోడల్‌ స్కూల్‌లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశం(పీటీఎం)లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆయన, విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. పిల్లల విద్యా ప్రమాణాలను సీఎం పరిశీలించారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు కష్టపడి చదివి.. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు వారి ఇష్టాలను గౌరవించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రమాణాల స్థాయి పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను లోకేశ్‌ సీఎంకు వివరించారు.


అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ఉన్నత విద్య కోసం, విదేశీ విద్య కోసం ‘కలలకు రెక్కలు’ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. విదేశీ విద్యకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థుల కలలు, కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు. వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. పిల్లలకు అవసరమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే కాలంలో విద్యావ్యవస్థలో ఎవ్వరూ ఊహించని విధంగా ఫలితాలు వస్తాయి. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని పిలుపిచ్చారు. గిరిజన ప్రాంతానికి చెందిన అంధ విద్యార్థిని కరుణకుమారి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని అంధ మహిళా క్రికెట్‌ ప్రపంచక్‌పను సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆడబిడ్డలను వేధించిన వారికి అదే చివరి రోజవుతుందని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్థికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడారంటే..


ఇప్పుడు పిల్లలే ఆస్తి..

ఒకప్పుడు పిల్లలను తల్లిదండ్రులు భారంగా భావించేవారు. కానీ నేడు ఆ పిల్లలే ఆస్తి. పిల్లలే తల్లిదండ్రులకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారు. తల్లిదండ్రు లు పిల్లల కోసం కష్టపడతారు. గురువులు విద్యను బోధించడంతో పాటు పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి. విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో.. సహకరించాలని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును కోరాం. ప్రపంచంలో లెర్నింగ్‌ విధానాలను అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 18 మంది విద్యార్థులకో ఉపాధ్యాయుడు ఉన్నారు. అదే ప్రైవేటు పాఠశాలల్లో 28మంది విద్యార్థులకు ఒకరే టీచర్‌’’’ అని తెలిపారు.

టీచర్లను గౌరవిస్తాం..

ఉపాధ్యాయులను గౌరవించే బాధ్యత మాది. పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తాం. తద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్ష కూడా నిర్వహిస్తున్నాం. గత ప్రభుత్వం 45 యాప్‌లు పెట్టింది. టీచర్లకు 24 గంటలూ అదే పని. మేమిప్పుడు ఒకే యాప్‌ తెచ్చాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం.


లోకేశ్‌ కోసం ఎప్పుడూ స్కూలుకెళ్లలేదు..

లోకేశ్‌ కోసం నేనెప్పుడూ స్కూలుకు వెళ్లలేదు. నా భార్య వెళ్లేది. అన్నీ ఆవిడే చూసుకునేది. లోకేశ్‌ను రాజకీయాల్లోకి రమ్మని నేనెప్పుడూ బలవంతం చేయలేదు. మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కూడా ఏశాఖ కావాలని అడిగితే ఎడ్యుకేషన్‌ అడిగారు. ఆ శాఖ చాలా కష్టంగా ఉంటుందన్నాను. అయితే తాను ఇష్టపడుతున్నానని, ఆ శాఖ తీసుకుని చరిత్ర సృష్టిస్తానని లోకేశ్‌ చెప్పారు.. ఆశీర్వదించాను. లోకేశ్‌కు ఒకటే చెబుతున్నా. నీ తల్లి నిన్ను స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ వరకు తీసుకెళ్లింది. ఇప్పుడీ పిల్లలను కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది. మూడేళ్లలో దేశంలోనే ఏపీ విద్యావ్యవస్థ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంటుందని లోకేశ్‌ నాకు హామీ ఇచ్చారు. అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతోంది. భవిష్యత్‌లో భారత్‌ పిల్లలు, యువశక్తి ఎక్కువ ఉండే దేశం అవుతుంది. ఇప్పుడే వారి నాలెడ్జ్‌ చూశాను. వారి వద్ద నేనే నేర్చుకునే రోజు వస్తుందని అనుకుంటున్నా. పిల్లలను తీర్చిదిద్దితే ప్రపంచాన్నే సాధిస్తారు.

Updated Date - Dec 06 , 2025 | 04:17 AM