West Godavari: టార్చ్‌లైట్‌తో తలపై కొట్టి భర్త హత్య
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:55 AM
భర్త దుబాయ్ నుంచి తిరిగొచ్చేశాడని భార్య కోపం!. భార్య తనతో కాపురం చేయడం లేదని భర్త గొడవ. దీనిపై న్యాయం చెప్పండని భర్త పెద్దల వద్ద పంచాయితీ పెట్టాడు.
పెనుగొండ, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): భర్త దుబాయ్ నుంచి తిరిగొచ్చేశాడని భార్య కోపం!. భార్య తనతో కాపురం చేయడం లేదని భర్త గొడవ. దీనిపై న్యాయం చెప్పండని భర్త పెద్దల వద్ద పంచాయితీ పెట్టాడు. అయితే అదే రోజు రాత్రి ఆమె భర్త తలపై టార్చ్ లైట్‌తో కొట్టి హతమార్చింది. పశ్చిమగోదావరి జిల్లా కొఠాలపర్రు శివారు వీరప్పచెరువు గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. వీరప్పచెరువు గ్రామానికి చెందిన కౌరు వెంకట నారాయణ (48).. తన మొదటి భార్య చనిపోవడంతో బేబీ సరోజిని అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు (23), కొడుకు (16) ఉన్నారు. వెంకటనారాయణ జీవనోపాధి నిమిత్తం గతంలో దుబాయ్ వెళ్లి కొంత కాలం అక్కడ పనిచేశాడు.
ఆరు నెలల క్రితం గ్రామానికి వచ్చిన అతడు, భార్యపై అనుమానం కలిగి తరచూ గొడవ పడేవాడు. ఆ తర్వాత మళ్లీ దుబాయ్ వెళ్లినా, వారం క్రితం పూర్తిగా స్వగ్రామానికి తిరిగొచ్చేశాడు. . భర్త దుబాయ్ నుంచి పూర్తిగా వచ్చేయడంపై బేబీసరోజిని ఆగ్రహంగా ఉంది. అయితే, భార్య తనతో కాపురం చేయడం లేదంటూ ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ పడుతున్నాడు. ఈ విషయమై సోమవారం రాత్రి 9 గంటల సమయంలో వెంకటనారాయణ గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఆ రోజు రాత్రి భార్యాభర్తలు మళ్లీ గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో భార్య స్టీల్ టార్చ్ లైట్‌తో వెంకట నారాయణ తల వెనుక భాగాన బలంగా కొట్టడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.