Share News

ఎవరి పాత్ర ఎంత?

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:57 AM

ముదునూరి సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అతని విషయాన్ని వంశీ అనుచరులకు ఉప్పదించింది ఎవరు? హైదరాబాద్‌లో ఉన్న సత్యవర్థన్‌ విజయవాడకు వస్తున్నాడని ఎలా తెలిసింది? కిడ్నాప్‌ చేయడానికి ఎన్ని నెలల నుంచి ప్రణాళిక రూపొందించారు? ఎవరెవరు ఎంతెంత పాత్ర పోషించారు? అనే వివరాలను రాబడుతున్నారు. ఇప్పటికే నిందితుల జాబితాను సిద్ధం చేశారు. ఐదుగురు జైలులో ఉండగా.. ఆరుగురు పరారీలు ఉన్నారు. వీరి కోసం వేట ముమ్మరం చేశారు. దేశ సరిహద్దులు దాటకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

ఎవరి పాత్ర ఎంత?

సత్యవర్థన్‌ కేసులో లోతుగా పోలీసుల విచారణ

సిద్ధమైన నిందితుల పూర్తి జాబితా

జైలులో ఐదుగురు... పరారీలో ఆరుగురు

దేశ సరిహద్దులు దాటకుండా లుక్‌ అవుట్‌ నోటీసు జారీ

నేడు న్యాయాఽధికారి ముందుకు సత్యవర్థన్‌?

ముదునూరి సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అతని విషయాన్ని వంశీ అనుచరులకు ఉప్పదించింది ఎవరు? హైదరాబాద్‌లో ఉన్న సత్యవర్థన్‌ విజయవాడకు వస్తున్నాడని ఎలా తెలిసింది? కిడ్నాప్‌ చేయడానికి ఎన్ని నెలల నుంచి ప్రణాళిక రూపొందించారు? ఎవరెవరు ఎంతెంత పాత్ర పోషించారు? అనే వివరాలను రాబడుతున్నారు. ఇప్పటికే నిందితుల జాబితాను సిద్ధం చేశారు. ఐదుగురు జైలులో ఉండగా.. ఆరుగురు పరారీలు ఉన్నారు. వీరి కోసం వేట ముమ్మరం చేశారు. దేశ సరిహద్దులు దాటకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

విజయవాడ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి):

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్‌ యూటర్న్‌ తీసుకోవడంతో వంశీ అనుచరుల్లో అవధులు లేని ఆనందం కనిపించింది. తిరిగి అతికొద్ది రోజుల్లోనే సత్యవర్థన్‌ అన్నయ్య కిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో అనుచరులకు షాక్‌ తగిలింది. విజయవాడ పోలీసులు వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన తర్వాత ఆయన శిబిరంలోని పక్షులు తలో దిక్కుకు చెదిరిపోయాయి. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులుగా ఉన్నారు. దర్యాప్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 11 మందిలో ఐదుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారిలో కొమ్మా కోట్లు, ఓలుపల్లి మోహనరంగారావు ముఖ్యమైన నిందితులుగా పోలీసులు భావిస్తున్నారు. కేసులో ఉన్న 11 మంది ఒక్కో బాధ్యతను నిర్వర్తించినట్టు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా సరిహద్దులు దాటేసిన నిందితులు దేశ సరిహద్దులు దాటకుండా పోలీసులు వారిపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మైహోం భూజాలో వంశీ నివాసం ఉంటున్న ఎఫ్‌ బ్లాక్‌ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన విజయవాడ పోలీసులు వాటిని తీసుకుని వచ్చారు. ఆ ఫుటేజీలను సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో విశ్లేషించిన తర్వాత కోర్టులో సాక్ష్యాధారంగా సమర్పించాలని భావిస్తున్నారు.

ఇదీ నిందితుల జాబితా

ముదునూరి సత్యవర్థన్‌ను బెదిరించి, కిడ్నాప్‌ చేసిన కేసులో ఉన్న 11 మంది నిందితుల పేర్లు మొత్తం బయటకు వచ్చాయి. సత్యవర్థన్‌ అన్నయ్య కిరణ్‌ ఫిర్యాదుతో పటమట పోలీసులు క్రైం నంబరు 86/2025తో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో వల్లభనేని వంశీమోహన్‌ (ఏ1), కొమ్మా కోట్లు (ఏ2), భీమవరపు రామకృష్ణ (ఏ3), ఘంటా వీర్రాజు (ఏ4), ఓలుపల్లి మోహనరంగారావు (ఏ5), వజ్రేశ్వరరావు (ఏ6), ఏలినేని వెంకట శివరామకృష్ణప్రసాద్‌ (ఏ7), నిమ్మ లక్ష్మీపతి (ఏ8), పొట్టి రాము (ఏ9), వేలూరి వంశీబాబు (ఏ10), చేబ్రోలు శ్రీను (ఏ11) నిందితులుగా ఉన్నారు. వారిలో వంశీ, ఘంటా వీర్రాజు, శివరామకృష్ణప్రసాద్‌, లక్ష్మీపతి, వంశీబాబును పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల్లో వంశీ ప్రధాన అనుచరులు కొమ్మా కోట్లు, ఓలుపల్లి మోహనరంగావుకు మొత్తం ప్రణాళిక తెలుసని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వారిద్దరూ ఎక్కడున్నా సంకెళ్లు వేయాలని భావిస్తున్నారు. వారి కోసం ఒక ప్రత్యేక బృందం పనిచేస్తోంది. కాగా, సోమవారం న్యాయాఽధికారి ముందు సత్యవర్థన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Updated Date - Feb 17 , 2025 | 12:57 AM