సంక్రాంతి సంప్రదాయాలు వెలుగులెక్కడ?
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:09 AM
ఒకప్పుడు సంక్రాంతి వస్తున్నదంటే గ్రామాల్లో పండుగదనం ఉట్టిపడేలా సందడి ఉండేది.

దూరమవుతున్న క్రీడా పోటీలు
కనుమరుగవుతున్న ఉత్సాహం
చాగలమర్రి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు సంక్రాంతి వస్తున్నదంటే గ్రామాల్లో పండుగదనం ఉట్టిపడేలా సందడి ఉండేది. క్రమేపి ఆనాటి సంక్రాంతి సంబరాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. గంగిరెద్దుల ఆటలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. గాలిపటాల రెపరెపలు కూడా లేవు. ఇక పశు సంపదకు పూజలు అసలే లేవు. బతుకుదెరువు కోసం కొందరు గంగిరెద్దుల వలే ఆవులను సింగారించి వీధుల్లో తిప్పుతూ పొట్ట పోసుకుంటున్నారు. ఇక ఇళ్లముందు రంగవల్ల్లులు అక్కడక్కడ తళుక్కున మెరుస్తున్నాయి. పేడతో పెట్టే గొబ్బెమ్మల జాడే లేదు. అంతేకాక హరిదాసుల కీర్తనలతో గ్రామాలు ప్రతిధ్వనించేవి. నేడు వారి రాక కూడా తగ్గింది.
మండలంలో గొడిగనూరు, ముత్యాలపాడు, చిన్నబోదనం, మద్దూరు గ్రామాల్లో సంక్రాంతి పండుగకు పారువేట ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా గ్రామాల్లో దేవతామూర్తులను పల్లకితో ఊరేగింపు చేస్తూ వివిధ వేషధారణలతో విన్యాసాలు చేస్తారు. అయితే గొర్రెలకు తోకలు కోసి సున్నం పెట్టి వదిలేడయం.. యువకులకు పరుగుపందేలు నిర్వహించడం... పారిపోయిన గొర్రెను పట్టుకొచ్చిన వారికి గ్రామం తరపున ఆ గొర్రెను బహుమతిగా అందజేయడం లాంటి గతంలో చేసేవారు. ప్రస్తుతం ఇలాంటి కార్యక్రమాలు స్వస్తి పలకడంతో సంక్రాంతి కళ తప్పినట్లయింది. మల్లేవేముల, మద్దూరు గ్రామాల్లో చెన్నకేశవ, సంజీవరాయ, ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులచే పల్లకి ఉత్సవం మాత్రమే నిర్వహిస్తారు. నేలంపాడు, రాంపల్లె, పెద్దబోధనం తదితర గ్రామాల్లో భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు, యువతీ యువకులు క్రీడా పోటీలను నిర్వహించే వారు. అయితే ఇప్పుడు ఇలాంటి పోటీలు కనిపించడం లేదు. బెంగుళూరు, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసే సాఫ్ట్‌వేర్లు స్వగ్రామాలకు చేరుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవారు. మరో వైపు వాతావరణ ప్రభావంతో రైతులు కూడా సాగు చేసిన పంటలు దెబ్బతింటుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో పండుగల వైపు అంత ఆసక్తి కనబరచడం లేదు.
ఫ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు
ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగులు సంక్రాంతికి కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు వస్తుండటంతో సందడిగా ఉండేవి. రానురాను వారు గ్రామాలకు రావడమే మానేశారు. కొన్ని గ్రామాల్లో మాత్రం సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు.
పల్లెల్లో పండుగ సందడి లేదు..
గ్రామాలలో సంక్రాంతి సాంప్రదాయాలు తగ్గి సాంకేతికత వైపు వెళ్తున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో పండుగలను ఉత్సాహంగా జరుపుకోలేకపోతున్నాం. గ్రామాల్లో జరిగే ముగ్గుల పోటీలు, కోడి పందెంలు ఆగిపోయాయి. పండుగ వచ్చిందంటే గంగిరెద్దుల, హరిదాసులు కనిపించేవారు. కానీ ఆ రోజులు ఇప్పుడు లేవు.
- శ్రీనివాసరెడ్డి, రైతు, తోడెండ్లపల్లె గ్రామం
గ్రామాల్లో ఆధునికత వైపు దృషి
సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామంలో సంబరాల సందడిగా ఉండేది. ఇళ్ల ముందు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు ఉంచి పూజలు చేసి నృత్యాలు చేసేవారు. చిన్నారులకు తలపై రేగుపండ్లు పోసి స్నానాలు చేయించేవారు. కుటుంబ సభ్యులంతా ఆనందం పంచుకునేవారు. ప్రస్తుతం గ్రామాల్లో సందడి కనిపించడం లేదు. పిల్లల చదువుపై దృష్టి సారిస్తున్నారు. ఆధునిక పద్ధతుల వల్ల మార్పులు జరిగాయి.
- రమణారెడ్డి, రైతు, ముత్యాలపాడు గ్రామం
పారువేట ఉత్సవాలకే పరిమితం
గ్రామాల్లో సంక్రాంతి పండుగ రోజు పారువేట ఉత్సవాలకే పరిమితమయ్యాయి. గతంలో కోడి పందెంలు, ఎద్దుల పోటీలు, క్రీడా పోటీలు జరుగుతుండేవి. కాలానుగుణంగా నాటి సాంప్రదాయాలు విస్మరిస్తున్నారు. పంటలు సరిగా పండక, నేటి యువత దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వడంతో సాంప్రదాయ పండుగ కళతప్పుతోంది.
- నరసింహారెడ్డి, మాజీ సర్పంచ, శెట్టివీడు గ్రామం