పదోన్నతులకు మోక్షమెన్నడో...?
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:49 PM
పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల మాటంటే ఎండమావిలో నీటి జాడను అన్వేషించినట్లే. కానీ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పరిపాలనా విధానం రూపురేఖలు మారుతున్నాయి.

ఫ తుది సీనియారిటీ జాబితాల
రూపకల్పనలో ఎడతెగని జాప్యం
కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల మాటంటే ఎండమావిలో నీటి జాడను అన్వేషించినట్లే. కానీ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పరిపాలనా విధానం రూపురేఖలు మారుతున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను పవన కళ్యాణ్ తీసుకోవడంతో ఈ శాఖకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు లేకుండా ఉసురుమంటున్న పంచాయతీ కార్యదర్శులకు పవన కళ్యాణ్ వరాల జల్లు ప్రకటించారు. గత ఏడాది నవంబరు 30లోగా పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా అన్ని జిల్లాలోనూ గ్రేడ్-1 నుంచి గ్రేడ్ 5 వరకు ఉన్న పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితాలు రూపొందించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1, 2 జోనల్ స్థాయి పరిధిలోని వస్తాయి. కాబట్టి వారి సీనియారిటీ జాబితా కమిషనరేట్‌లో రూపొందిస్తారు. కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-3, 4, 5 వారి సీనియారిటీ జాబితాను జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయం రూపొందిస్తుంది. ఈ మేరకు ముసాయిదా సీనియారిటీ జాబితాను రూపొందించారు. అయితే అందులో అనేక తప్పులు దొర్లాయి. అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి త్వరితగతిన తుది జాబితాను రూపొందించాల్సిన పని నత్తనడకన కొనసాగుతోంది. ఇటీవల జిల్లాలో గ్రామ, రెవెన్యూ అధికారుల పదోన్నతులు పూర్తికాగా పంచాయతీ కార్యదర్శుల పదోన్నతి దస్త్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. డీపీవో కార్యాలయ దిగువస్థాయి సిబ్బంది అనుభవరాహిత్యం, అవగాహన లేమితో తప్పులు దొర్లడంతో పంచాయతీ కార్యదర్శులతో నిరభ్యంతర పత్రాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియక పంచాయతీ కార్యదర్శులు అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నారు.
ఇక గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి త్రిశంకుస్వర్గంలో మాదిరిగా ఉంది. జగన సర్కార్ వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చి మూడేళ్లపాటు రూ.15వేలుకు పని చేయించారు. వారికి మూడు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉండగా.. జగన సర్కార్ మొండి చేయి చూపించింది. దీంతో వారు అతి తక్కువ పేస్కేల్‌తో పని చేస్తున్నారు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల కన్నా 6 ఇంక్రిమెంట్లు వెనుకబడి ఉన్నారు. కూటమి సర్కార్ ఈ తప్పిదాన్ని సరి చేస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు. కనీసం పదోన్నతి లభిస్తే తమ జీతాలు మెరుగై తమ జీవితాలు బాగుపడుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.