Share News

యోగా డే సూపర్‌హిట్‌

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:58 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్‌హిట్‌ అయ్యింది. జిల్లాలోని 4 వేల 835 ప్రాంతాల్లో ఎనిమిది లక్షల మంది శనివారం ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు యోగాస నాలు వేశారు.

యోగా డే సూపర్‌హిట్‌
భీమవరం పరేడ్‌ గ్రౌండ్‌లో యోగాసనాలు.. వేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు

ఆసనాలు వేసిన ఎనిమిది లక్షల మంది

విశాఖలో ప్రధాని కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు

జిల్లా నుంచి 185 బస్సుల్లో తరలివెళ్లిన ప్రజలు

భీమవరం పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ వేడుక

భీమవరం టౌన్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి):అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్‌హిట్‌ అయ్యింది. జిల్లాలోని 4 వేల 835 ప్రాంతాల్లో ఎనిమిది లక్షల మంది శనివారం ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు యోగాస నాలు వేశారు. జిల్లా కేంద్రం భీమవరం సహా అన్ని వార్డు, సచివాలయాల పరిధిలో, పాఠశాలల్లోను జరిగిన యోగాం ధ్ర కార్యక్రమానికి పెద్దఎత్తున జనం హాజరయ్యారు. ముందస్తుగా నెల రోజులపాటు జిల్లాలో యోగాపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేపట్టడం ఈసారి కలిసొచ్చింది. మరోవైపు విశాఖలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు తదితరులు హాజరైన కార్యక్రమా నికి జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వేర్వేరు ప్రాంతాల నుంచి 185 బస్సులను ఏర్పాటు చేయడంతో యోగాసనాలు వేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు.

ఎనిమిది వేల మందితో

ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది వేల మందితో భీమవరం కలెక్టరేట్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన యోగాభ్యాసన పండుగ వాతావరణాన్ని తలపించిందని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. విశాఖలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని అనుసరిస్తూ ఇక్కడ యోగాభ్యాసాలు కొనసాగించారు. ఇప్పటి వరకు నేర్చుకున్న యోగాసనాలను నిలిపి వేయకుండా రోజూ కొనసాగించి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని కలెక్టర్‌ సూచించారు. నెల రోజులపాటు నిర్వహించిన యోగాంధ్ర ను విజయవంతం చేసినందుకు జేసీ టి.రాహుల్‌ కుమార్‌రెడ్డిని అభినందించారు. జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేశారని కొనియాడారు. ఆరోగ్య భారత్‌ కోసం ప్రధాని మోదీ యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాజ్య సభ సభ్యుడు పాకా సత్యనారాయణ అన్నారు. నెల రోజు లుగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించిన యోగా పోటీల్లో జిల్లాస్థాయిలో గెలు పొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డ్వామా పీడీ డాక్టర్‌ కేసీహెచ్‌ అప్పారావు, జిల్లా టూరిజం అధికారి ఏవీ అప్పారావు, డీఈవో ఇ.నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ఆకివీడులో విద్యార్థుల అవస్థలు

ఆకివీడులో నిర్వహించిన యోగాంధ్రలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 1,500 మంది పట్టే ఏఎంసీ షెడ్‌లో 2000 మందికి పైగా విద్యార్థులను కూర్చోబెట్టడంతో ఊపి రాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాంతులు వస్తున్నాయని చెప్పడంతో కొందరు పిల్లలను ఉపాధ్యాయులు బయటకు తీసుకుని వెళ్లారు. ఓపెన్‌ స్థలంలో పెట్టకుండా గాలి లేని షెడ్‌లో పెట్టడంతో విద్యార్థులందరూ ఇబ్బందులు పడ్డారు. యోగాకంటే ఎక్కువ సమయం స్పీచ్‌లకే కేటాయించ డంతో అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 22 , 2025 | 12:58 AM