ఏటిగట్టు భద్రం
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:26 AM
గోదావరి ఏటిగట్టు పటిష్టం కానుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఏటిగట్టు పనులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పెండింగ్ పనులకు నిధులు విడుదల చేసింది. వరదలతో పరీవాహక గ్రామాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టింది.
ఎత్తు పెంచడానికి రూ.15 కోట్లు
కనకాయలంక వంతెనకు రూ.24 కోట్లు
రూ.9 కోట్లతో స్లూయిస్ ఆధునీకరణ
ప్రతిపాదనలకు ఆమోదం
టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం
వర్షాకాలం అనంతరం పనులు ప్రారంభం
ప్రస్తుత వరద రక్షణ చర్యలకు ఇసుక నిల్వలు
గోదావరి ఏటిగట్టు పటిష్టం కానుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఏటిగట్టు పనులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పెండింగ్ పనులకు నిధులు విడుదల చేసింది. వరదలతో పరీవాహక గ్రామాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టింది. యలమంచిలి, నరసాపురం మండలాల్లో స్లూయిస్ ఆధునికీకరణకు టెండర్లు పూర్తయ్యాయి. ప్రసుతం వరద నుంచి రక్షణ చర్యలకు ఇసుకను సిద్ధం చేశారు.
నరసాపురం/నరసాపురం రూరల్, జూలై 30(ఆంధ్ర జ్యోతి): ఏటిగట్టు పటిష్టత, వరద నష్టం నివారణపై గత వైసీపీ ప్రభుత్వం అలసత్వం వహించింది. కనీసం గట్టు వెంబడి స్లూయిస్ తలుపులకు కూడా గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి నెలకొంది. గోదావరి వరద సమయంలో యలమం చిలి, దొడ్డిపట్ల, కాజా, నవరసపురం, బియ్యపుతిప్ప, ముస్కే పాలెం గ్రామాల్లో వందలాది ఎకరాలు ముంపుబారిన పడుతున్నాయి. ఇళ్లు జలదిగ్భంధంలో చిక్కుకుంటున్నాయి. సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం ముందుగా స్లూయిస్ ఆధునీకరణపై దృష్టి సారించింది.
రూ.24 కోట్లతో వంతెన నిర్మాణం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని చాకలిపాలెం, యలమంచిలి మండలం కానకాయలంకను కలుపుతూ వంతెన నిర్మాణానికి రూ.24 కోట్లు కేటాయించింది. రెండు రేవులను కలుపుతూ గోదావరిపై వంతెన నిర్మించనున్నారు. గోదావరి వరదకు నీట మునిగే ప్రాంతాల్లో కనకాయలంక కాజ్‌వే ఒకటి. రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. వంతెన నిర్మాణంతో సమస్య పరిష్కారం కానుంది.
ఏటిగట్టు పటిష్టతకు రూ.15 కోట్లు
1986, 2022 వరదలను దృష్టిలో ఉంచుకుని గోదావరి ఏటిగట్టును ఎత్తు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత గట్టును రెండు మీటర్ల మేర ఎత్తు పెంచితే ముంపు బెడద ఉండదని అధికారుల ప్రతిపాదన. సుమారు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో ప్రభుత్వం పనులకు టెండర్లు పిలిచింది. వర్షాకాలం అనంతరం ఏటిగట్టు పనులు చేపట్టనున్నారు. వాకలపల్లి, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, చించునాడ, పక్షిపాలెం, గంగడపాలెం, బాడవ, వైవీలంక ప్రాంతాల్లో ఏటిగట్టును ఎత్తు పెంచను న్నారు. గోదావరి గట్టును పటిష్ఠపర్చడంతో పాటు గట్టుపై 21 కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.50 కోట్లు కేటాయించింది. యలమంచిలి మండలం కంచుస్థంభంపాలెం నుంచి వైవీ.లంక వరకు గోదావరి గట్టుపై గ్రావెల్ రోడ్డు వేయనున్నారు. గట్టు పటిష్టతతో పాటు చిన్నపాటి వాహన రాకపోకలకు అనుకూలం.
సిద్ధంగా ఇసుక నిల్వలు..
ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు దిగువకు రావడంతో ఇరిగేషన్ ఆధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. గట్టు బలహీనపడిన ప్రదేశాలను గుర్తించి తాత్కాలిక రక్షణ చర్యలుగా ఇసుక బస్తాలను వేసి ముంపును నివారించనున్నారు. 500 క్యూబిక్ మీటర్ల ఇసుకను నరసాపురం ఇరిగేషన్ కార్యాలయం వద్ద సిద్ధంగా ఉంచారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే ఇసుక బస్తాలను తరలించనున్నారు.
స్లూయిస్ పనులకు టెండర్లు పూర్తి
గోదావరి పరివాహక ప్రాంతంలో స్లూయిస్ ఆధునీకరణ పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రూ.9 కోట్లతో చేపట్టన్ను పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తయింది. వర్షాకాలం అనంతరం పనులు చేపట్టనున్నారు. యలమంచిలి మండలం కాజా, ముడుగు తూములు, నరసాపురం మండలం ముస్కేపాలెం, బియ్యపుతిప్ప గ్రామాల్లోని స్లూయిస్ పనులు చేపట్టనున్నారు.
వర్షాకాలం అనంతరం పనులు ప్రారంభం
గోదావరి తీరంలో వరద ప్రమాద నివారణ పనులు చేపట్టనున్నాం. గోదావరి ఏటిగట్టు స్లూయిస్, గట్టు ఎత్తు పనులను వర్షాకాలం తర్వాత చేపడతాం. ఈ పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. గుర్తించిన ప్రదేశాల్లో గట్టును ఎత్తు చేయడం, ముంపు నివారణ నివారించేందుకు స్లూయిస్ పనులు కూడా చేపట్టనున్నాం. వీటితో పాటు రూ.24 కోట్లతో కానకాయలంక వంతెన, రూ.4 కోట్లతో బాడవ, కంచుస్థంభం పాలెం వరకు ఏటిగట్టుపై గ్రావెల్ రహదారి పనులు చేపట్టనున్నాం.
– పవన్, ఇరిగేషన్ ఏఈ