బాబును నమ్మితే మోసం గ్యారంటీ
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:28 AM
బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారంటీ అంటూ టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతున్నారు..భవిష్యత్ మాట దేవుడెరుగు.. బాబును నమ్మితే మోసం మాత్రం గ్యారంటీగా కనిపిస్తోంది’ అంటూ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రులు బొత్స, కారుమూరి ఎద్దేవా
పెదవేగి, జూలై 4(ఆంధ్రజ్యోతి):‘బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారంటీ అంటూ టీడీపీ నేతలు ఇంటింటికీ తిరుగుతున్నారు..భవిష్యత్ మాట దేవుడెరుగు.. బాబును నమ్మితే మోసం మాత్రం గ్యారంటీగా కనిపిస్తోంది’ అంటూ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాసం దగ్గర శుక్రవారం వైసీపీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న బొత్స, కారుమూరి మాట్లాడుతూ సంపద సృష్టిస్తా నని, ఏడాది తిరిగే సరికి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నిలుపుతామని చంద్రబాబు ఎన్నికల్లో ఊకదంపుడు హామీలు ఇచ్చారన్నారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియాతో టీడీపీ నేతలు ప్రజల సొమ్మును దోచు కుంటున్నారని ఆరోపించారు. మాజీఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ కొల్లేరు ప్రజలకు బాకీ ఉన్నానని తన ఇంటిదగ్గర కొల్లేరు ప్రజల ముసుగులో కొంతమంది ఆందోళన చేస్తున్నారని, కానీ తాను ఏ ఒక్కరికీ బాకీలేనన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, జక్కంపూడి రాజా, వైసీపీ నాయకులు నౌడు వెంకట రమణ, మామిడిపల్లి జయప్రకాశ్, కంభంపాటి విజయరాజు, కారుమూరి సునీల్ తదితరులు పాల్గొన్నారు.